చంద్రబాబు ఇంటికెళ్లి తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకలకు రావాలని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో తొలి దశలో తన స్నేహం గురించి చంద్రబాబు చెప్పారన్నారు.
ఇద్దరూ కలిసే ఎలా తిరిగామో చంద్రబాబు తనకు చెప్పారన్నారు. చాలా సేపు చంద్రబాబుతో మాట్లాడానన్నారు. రాజశేఖరరెడ్డి ఎలాంటి మనిషో బాబు చెప్పారన్నారు. ఇద్దరూ కలిసి ఒకే జీపులో ప్రయాణించిన సంగతిని చెప్పారన్నారు. ఇద్దరూ కలిసి అప్పటి ముఖ్యమంత్రి కోసం ఎలా పని చేశారో గుర్తు చేశారన్నారు. తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు.
చంద్రబాబును పెళ్లికి పిలవడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని షర్మిల కోరారు. ఇదేమీ వింత, విచిత్రం కాదని ఆమె కామెంట్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్లకు కూడా చంద్రబాబును ఆహ్వానించారన్నారు. చంద్రబాబు కూడా తమ పెళ్లిళ్లకు వచ్చి ఆహ్వానించారని ఆమె చెప్పుకొచ్చారు.
చంద్రబాబుతో ఎలాంటి రాజకీయ లావాదేవీలు వుండవన్నారు. ఫ్రెండ్లీ రాజకీయాలు ఉండాలని ఆమె కోరారు. చంద్రబాబు కుటుంబానికి ఒకే ఒక్క కేక్ పంపినట్టు ఆమె తెలిపారు. కేవలం చంద్రబాబుకే కాదు, తెలంగాణలో హరీశ్‌రావు, కేటీఆర్, కవితలకు కూడా కేక్ పంపినట్టు గుర్తు చేశారు. రాజకీయాల్లో భాగంగా ప్రత్యర్థులం కాబట్టి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుంటామని చెప్పారు. కేక్‌లు పంపడం లాంటివి వ్యక్తిగత స్నేహానికి సంకేతంగా ఆమె చెప్పారు.