జ‌గ‌న్ సార్ ప్లీజ్‌… ఎంపీ సీటొద్దు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీలో అదృష్ట‌వంతుడు. స‌ర్వేల్లో ఆదిమూలంపై వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని, ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టాల‌ని మొద‌ట నిర్ణ‌యించారు. కానీ వైసీపీ పెద్ద‌లు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటున్నాన‌ని, త‌న‌పై వ్య‌తిరేక‌త ఏంట‌ని…

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీలో అదృష్ట‌వంతుడు. స‌ర్వేల్లో ఆదిమూలంపై వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని, ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టాల‌ని మొద‌ట నిర్ణ‌యించారు. కానీ వైసీపీ పెద్ద‌లు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటున్నాన‌ని, త‌న‌పై వ్య‌తిరేక‌త ఏంట‌ని సీఎం జ‌గ‌న్ వ‌ద్దే ఆయ‌న గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. త‌న‌కు స‌త్యవేడు సీటు ఇవ్వాల‌ని ప‌ట్టుప‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ స‌సేమిరా అన్నారు.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి ఎంపీ అభ్య‌ర్థిగా ఆయ‌న్ను ప్ర‌క‌టించారు. అయితే ఎంపీగా పోటీ చేయ‌డం ఆదిమూలానికి ఏ మాత్రం ఇష్టం లేదు. స‌త్య‌వేడు ఎమ్మెల్యేగా కొన‌సాగాల‌నేది ఆయ‌న కోరిక‌.

ఒక‌వైపు ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా, ఎలాగైనా స‌త్య‌వేడు ఎమ్మెల్యే సీటు ద‌క్కించుకోవాల‌నే త‌న ప్ర‌య‌త్నాల్ని ఆయ‌న విర‌మించ‌డం లేదు. ఈ ప‌రంప‌ర‌లో సీఎం జ‌గ‌న్‌ను మ‌రోసారి ఆయ‌న క‌లుసుకున్నారు.

మ‌రోసారి స‌త్య‌వేడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు ప‌రిశీలించాల‌ని సీఎంను ఆయ‌న అభ్య‌ర్థించిన‌ట్టు తెలిసింది. ప్లీజ్ సార్‌, ఇదొక్క ద‌ఫా స‌త్య‌వేడు టికెట్ ఇవ్వాల‌ని చివ‌రిసారిగా జ‌గ‌న్‌ను వేడుకున్నార‌ని స‌మాచారం.

కోనేటి ఆదిమూలానికి వైసీపీలో పెద్ద దిక్కు కూడా ఎవ‌రూ లేరు. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు మిథున్‌రెడ్డిల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డంతో క‌నీసం తిరుప‌తి ఎంపీ సీటైనా ద‌క్కింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నే ఆదిమూలం విజ్ఞ‌ప్తిని జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించాల్సి వుంది.