బాబు ఇంటికి ష‌ర్మిల‌

కాంగ్రెస్ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం ఈ నెల 18న, వివాహం వ‌చ్చే నెల 17న జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుక‌ల‌కు రావాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖుల‌ను రాజ‌కీయాల‌కు…

కాంగ్రెస్ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం ఈ నెల 18న, వివాహం వ‌చ్చే నెల 17న జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుక‌ల‌కు రావాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖుల‌ను రాజ‌కీయాల‌కు అతీతంగా ఆమె ఆహ్వానిస్తున్నారు. మొద‌ట త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మాధి వ‌ద్ద ఆహ్వాన ప‌త్రిక ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంత‌రం త‌న అన్న‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇంటికెళ్లి నిశ్చితార్థ‌, వివాహ వేడుక‌ల‌కు రావాల‌ని ఆహ్వానించారు.

అనంత‌రం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు త‌దిత‌రుల‌ను వ‌రుస‌గా ఆహ్వానించుకుంటూ వ‌స్తున్నారు. ఇవాళ ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు ఇంటికి 11 గంట‌ల‌కు ఆమె వెళ్ల‌నున్నారు. త‌న కుమారుడి వేడుక‌కు రావాల‌ని బాబు కుటుంబ స‌భ్యుల్ని ఆమె ఆహ్వానించ‌నున్నారు.

ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సీఎం జ‌గ‌న్‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌నే భావ‌న కొర‌వ‌డింది. ఒక‌రికొక‌రు శ‌త్రువులుగా చూసుకుంటున్నారు. మ‌రోవైపు అన్న‌తో వ్య‌క్తిగ‌త విభేదాలతో ష‌ర్మిల రాజ‌కీయంగా ప్ర‌త్యామ్నాయ మార్గాల్ని ఎంచుకున్నారు. తెలంగాణ‌లో సొంత పార్టీని పెట్టుకున్న‌ప్ప‌టికీ, ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి వ‌చ్చింది.

ఇప్పుడామె ఏపీ కాంగ్రెస్ లీడ‌ర్‌. త్వ‌ర‌లో ఏపీ కాంగ్రెస్ సార‌థ్య బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించ‌నున్నారు. అన్న‌పై బాణాలు సంధించ‌నున్నారు. ష‌ర్మిల వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌ని ఇటీవ‌ల సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. క్రిస్మ‌స్‌ను పుర‌స్క‌రించుకుని లోకేశ్‌కు ప్ర‌త్యేకంగా గిప్ట్స్ కూడా ష‌ర్మిల పంపారు. ఆ త‌ర్వాత ఇప్పుడు చంద్ర‌బాబు ఇంటికెళ్ల‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. శుభ‌కార్యాల‌కు ఆహ్వానించ‌డానికే అయిన‌ప్ప‌టికీ, జ‌గ‌న్ , వైసీపీ నేత‌లు ఎలా చూస్తార‌నే విష‌య‌మై చ‌ర్చ జరుగుతోంది.