ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డికి జగన్ టికెట్ నిరాకరించడానికి ఎల్లో మీడియా చెబుతున్న కారణాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లపై బూతులు తిట్టాలని వైసీపీ ఆదేశించగా, అందుకు ససేమిరా అనడంతోనే మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుండగా ఒంగోలు నుంచి తనను పోటీ చేయాలని జగనన్న చెప్పారని, మీ మద్దతు ఇస్తే బరిలో దిగుతానని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో చెవిరెడ్డి అన్నట్టు ప్రచారం జరుగుతోంది. చెవిరెడ్డి ప్రతిపాదనను బాలినేని తిరస్కరించినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ప్రత్యర్థులను బూతులు తిట్టేందుకు మాగుంట వెనుకాడడంతో టికెట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మరి అదే సూత్రం చెవిరెడ్డికి వర్తించదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చల్లో భాగంగా చంద్రబాబు పాలనలో తనను ఏ విధంగా హింసించారో చెప్పడానికి చెవిరెడ్డి విమర్శించారే తప్ప, ఇతరత్రా సందర్భాల్లో ప్రెస్‌మీట్స్ పెట్టిన సందర్భాలు లేవు. ప్రత్యర్థులను తిట్టడమే టికెట్ ఇవ్వడానికి ప్రామాణికం అయితే, మరి చెవిరెడ్డికి కూడా దక్కే అవకాశాలు లేవు.
ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుండాలనే తలంపుతో తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చంద్రగిరి టికెట్ ఇప్పించుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద అభ్యర్థుల ఎంపికలో ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలకు తోడుగా చెవిరెడ్డి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని పోటీ చేయాలని సీఎం జగన్ చెప్పడమే నిజమైతే, ఆయన రాజకీయ సన్యాస వ్రతాన్ని సీఎం చెడగొట్టినట్టే. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని జగన్‌కు సేవకుడిగా వుండాలనే ఆయన కోరిక నెరవేరనట్టే. రకరకాల ప్రచారానికి అవకాశం ఇవ్వకూడదనుకుంటే ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వంపై నిజాలేంటో చెవిరెడ్డి చెప్పాలి.