పల్నాడు జిల్లా నరసారావుపేట లోక్‌సభ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు సీఎం జగన్ మనసు మార్చుకున్నట్టు సమాచారం. నరసారావుపేట సిటింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయుల్ని కాదని, బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని జగన్ ఆలోచించారు.
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోటీ చేయించి, శ్రీకృష్ణదేవరాయుల్ని గుంటూరుకు పంపాలని వైసీపీ వ్యూహం రచించింది. అయితే నరసారావుపేట ఎంపీ ససేమిరా అనడంతో సీఎం వ్యూహం బెడిసి కొట్టింది.
నరసారావుపేట టికెట్ విషయంలో తన మనసులో మాటను వైసీపీ అధిష్టానం పెద్దలకు చెప్పానని, వాళ్ల నిర్ణయం చెబితే, తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో వెల్లడిస్తానని శ్రీకృష్ణదేవరాయులు మీడియాకు తెలిపారు.
ఇదే సందర్భంలో శ్రీకృష్ణదేవరాయుల్ని మార్చడం వల్ల నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులకు కలిగే ఇబ్బందుల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ నియోజకవర్గ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు సీఎంను కలిసి, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణదేవరాయులుకే టికెట్ ఇవ్వాలని పట్టు పట్టారు.
ఒక దశలో ఆయన ఎంపీ అభ్యర్థి కాకపోతే, తాము పోటీ చేయలేమని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నాగార్జున యాదవ్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న దందాల గురించి సీఎంకు వివరించినట్టు సమాచారం.
ఇలాంటోన్ని తీసుకొచ్చి తమపై రుద్దితే అసలుకే నష్టం వస్తుందని జగన్ వద్ద తమ భయాన్ని, ఆవేదనను ఎమ్మెల్యేలు బయట పెట్టినట్టు తెలిసింది. పార్టీకి నష్టం వస్తుందనుకుంటే నాగార్జున యాదవ్‌ను నిలబెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
సంక్రాంతి పండుగ తర్వాత శ్రీకృష్ణదేవరాయుల్ని పిలిపించుకుని నరసారావుపేట టికెట్‌ను సీఎం జగన్ ఖరారు చేయనున్నట్టు తెలిసింది. సహజంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే జగన్ ఎవరు చెప్పినా వినిపించుకోరని అంటుంటారు. అలాంటిది నరసారావుపేట టికెట్ విషయంలో మాత్రం ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది.