ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇద్దరు సీనియర్ మోస్ట్ మాజీ మంత్రులు ఉన్నారు. వారు ఒకనాడు రాజకీయంగా చక్రం తిప్పారు. కానీ కాలం కలిసి రాక దశాబ్దం పై దాటింది. దాంతో వారి రాజకీయం ప్రతీ ఎన్నికల ముందు ఆసక్తికరంగా మారుతూ వస్తోంది.
వారే మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ. ఈ ఇద్దరూ అనకాపల్లిలో అనేక ఎన్నికల్లో చక్రం తిప్పారు. ఒకరు తెలుగుదేశంలో హవా చలాయిస్తే మరొకరు కాంగ్రెస్ లో తనకు తిరుగులేదనిపించుకున్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలుగుదేశం వైసీపీ మళ్ళీ తెలుగుదేశం ఇలా తన రాజకీయాలను నడుపుతూ లేటెస్ట్ గా సైకిలెక్కేశారు. కొణతాల రామక్రిష్ణ ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు ఘాటుగానే చేశారు దాంతో ఆయన ఎన్నికల ముందు వైసీపీ తప్ప వేరే పార్టీల వైపు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది
ఆయన తెలుగుదేశంలో చేరుతారు అని అంతా అనుకున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న దాడి వీరభద్రరావు టీడీపీలో చేరిపోవడంతో కొణతాల జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారు.
జనసేన అనకాపల్లి ఎంపీ టికెట్ ని కోరుకుంటోంది. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన చేతికి వస్తే అక్కడ పోటీ చేయడానికి కొణతాల ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది నేతలు సీనియర్లు జనసేనతో టచ్ లో ఉంటున్నారు.
తెలుగుదేశంలో ఖాళీ లేదు, టికెట్ రాదు అనుకుంటున్న వారూ వైసీపీలో ఇమడలేమని భావించిన వారికి జనసేన ఆప్షన్ గా ఉందని అంటున్నారు. కొణతాల కాంగ్రెస్ లో దశాబ్దాల పాటు పనిచేసిన సీనియర్. దాంతో ఆయనను కాంగ్రెస్ వైపు రప్పించాలని ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే దాదాపుగా పుష్కర కాలంగా అధికార రాజకీయాలకు దూరంగా ఉన్నా కొణతాల ఈసారి మాత్రం ఆచీ తూచీ నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఆయన గాజు గ్లాస్ నే చేతిలో పట్టుకుంటారు అని ప్రచారంగా ఉంది.