విశాఖ జిల్లాలో గాజువాక సీటు ఎపుడూ హాట్ ఫేవరేట్ గానే ఉంటుంది. 2009లో తొలిసారిగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో ఈ సీటు ఏర్పడింది. ఇక్కడ ప్రజల తీర్పు కూడా విలక్షణంగా ఉంటుంది. ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లూ మూడు పార్టీలు విజయం సాధించాయి.
తొలిసారి ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలిస్తే 2014లో తెలుగుదేశం ఈ సీటుని సాధించింది. 2019లో వైసీపీ ఇక్కడ నుంచి విజయం అందుకుంది. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో గాజువాక స్టేట్ లెవెల్ లో మారుమోగిపోయింది.
ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రత్యర్ధిగా ఎవరు ఉండబోతున్నారు అన్నది కనుక చూస్తే మళ్లీ జనసేనకే గాజువాక సీటు అని ప్రచారం అయితే ఉంది. ఈ సీటు జనసేనకు సెంటిమెంట్ అని అంటున్నారు. అంతే కాకుండా పవన్ పోటీ చేసి ఓడిన సీటులో ఈసారి గెలిచి చూపించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు.
ఈ సీటు విషయంలో తెలుగుదేశానికి కూడా అవసరాలు ఉన్నాయి. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. టీడీపీ కూడా ఒక బలమైన సామాజిక వర్గానికి విశాఖ జిల్లాలో సీటు చూపించాల్సి ఉంది.
జనసేన మాత్రం ఈ సీటు తమకే ఇవ్వాలని పట్టుపడుతోంది. ఈ సీటు పొత్తులో భాగంగా తీసుకుంటే ఇటీవల వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ని ఇక్కడ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. యాదవ సామాజిక వర్గం గాజువాకలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాగే మరో బలమైన సామాజిక వర్గం కాపులు ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలు కలిస్తే జనసేన విజయం ఖాయం అవుతుంది అని లెక్కలేస్తున్నారు
వైసీపీ కూడా యాదవ సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని పక్కన పెట్టి సామాజిక సమీకరణలో భాగంగా కార్పోరేటర్ ఉరుకూటి చందుని ఇంచార్జ్ చేసింది. జనసేన తరఫున వంశీ పోటీ చేస్తే ఒకే సామాజిక వర్గాల మధ్యన రసవత్తరంగా పోరు సాగనుంది. గాజువాక ఫలితం ఈసారి కూడా ఆసక్తిగా ఉంటుందని అంటున్నారు.