కాంగ్రెసు పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల జాతర నడుస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో ఐక్యంగానే పనిచేసి విజయం సాధించిన కాంగ్రెసు నాయకులు.. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవుల విషయంలో కీచులాడుకున్నా ఆశ్చర్యం లేదనే పరిస్థితి కనిపిస్తోంది. ఆశావహులు అందరికీ ముందుముందు పదవులు దక్కే అవకాశం ఉన్నది గానీ.. అందరూ కూడా తొలివిడత లోనే ఎమ్మెల్సీ అయిపోవాలని ఉత్సాహపడుతున్నారు. అందుకే నాయకత్వం మీద ఒత్తిడిపెడుతున్నారు.
అయితే ప్రాథమికంగా చూసినప్పుడు.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం తమ ఈగోలను పక్కన పెట్టి, తమ పంతాలను పెట్టి సహకరించిన త్యాగమూర్తులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలా? లేదా, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులకు తొలిప్రాధాన్యం ఇవ్వాలా? అనే మీమాంస పార్టీ నాయకుల్లో నడుస్తోంది. ఈ కోణంలో తీసుకోగల నిర్ణయాన్ని కూడా వేర్వేరు అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెసుకు దక్కే అవకాశాలే ఎక్కువ. రెండూ ఏక్రగీవం అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే త్వరలోనే గవర్నరు కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు స్థానాలకు కలిపి ఇప్పుడు ఒకేసారిగా ఎంపిక పూర్తిచేయాలని పార్టీ భావిస్తోంది. దానివల్ల.. ఎక్కువ మందిని సంతృప్తి పరచినట్టు అవుతుందనేది వారి ఆలోచన.
అయితే ప్రొఫెసర్ కోదండరాం గత ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణ జనసమితిని పూర్తిగా పోటీనుంచి పక్కకు తప్పించి కాంగ్రెసు పార్టీకి సహకరించారు. అప్పట్లోనే ఆయనకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడం తథ్యం అని తెలుస్తోంది. ఇప్పుడున్న మొత్తం నాలుగు సీట్లలో ఒకటి ప్రొఫెసర్ కు వెళుతుంది. మిగిలిన మూడు సీట్లకే కాంగ్రెసులో అనేక మంది పోటీపడుతున్నారు.
పార్టీ నేతలు షబ్బీర్ ఆలీ, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, నిరంజన్, మధుయాస్కీ, శోభారాణి, అనిల్ కుమార్ తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో పలువురు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారే. ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని పోటీచేసి, వారికి చేతగాక ఓడిపోయి మళ్లీ ఎమ్మెల్సీ సీట్లకు కర్చీఫ్ వేస్తామంటే ఎలా అనే వాదన పార్టీలో కొందరినుంచి వినిపిస్తోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం చివరిదాకా పోటీపడి, పార్టీకోసం త్యాగం చేసిన- ఆమేరకు ఎమ్మెల్సీ హామీ పొందిన నాయకులు కొందరుఉన్నారు. వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే వాదన ఉంది.
ఇదే సమయంలో పార్టీకి మరో ఇబ్బంది కూడా ఉంది. ప్రస్తుతానికి మైనారిటీ ఎమ్మెల్యే పార్టీకి లేరు. కేబినెట్ లో మైనారిటీ మంత్రి ఉండడం పార్టీకి అవసరం. ఈ నేపథ్యంలో ఆ వర్గం నుంచి ఒకరికి, వీలైతే షబ్బీర్ ఆలీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టాలనే ఆలోచన కూడా ఉంది. ఇలాంటి రకరకాల కాంబినేషన్ల కారణంగా.. ఎమ్మెల్సీ పోస్టులు ఎవరికి దక్కుతాయనేది స్పష్టత రావడం లేదు.