వైసీపీ ఎంపీ సీటు రేసులో గంటా సన్నిహితుడు…!?

ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి ఎంపీ సీటుకు సంబంధించి వైసీపీలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ డాక్టర్ భీశెట్టి సత్యవతిని మారుస్తారు అని పక్కాగా సమాచారం ఉండడంతో ఆ సీటు దక్కించుకునేందుకు…

ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి ఎంపీ సీటుకు సంబంధించి వైసీపీలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ డాక్టర్ భీశెట్టి సత్యవతిని మారుస్తారు అని పక్కాగా సమాచారం ఉండడంతో ఆ సీటు దక్కించుకునేందుకు చాలా మని రేసులోకి దూసుకుని వస్తున్నారు.

హై కమాండ్ ఆలోచనల వరకూ చూస్తే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని ఉందని అంటున్నారు. అయితే అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కి కాపు సామాజిక వర్గానికి ఇస్తున్నారు కాబట్టి మరో బలమైన సామాజికవర్గంగా ఉన్న గవరలకు ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది.

దాంతో యధాతధంగా కరణం ధర్మశ్రీ చోడవరం నుంచి పోటీ చేయడానికి వీలు కుదిరింది. అనకాపల్లి ఎంపీ టికెట్ ని బీసీలకే ఇస్తారు అని అంటున్నారు. మహిళలకు ఇస్తారని అనుకున్నా విశాఖ ఎంపీ సీటు బీసీ మహిళ అయిన బొత్స ఝాన్సీలక్ష్మికి ఇచ్చారు.

దాంతో పురుషులకే ఆ సీటు అని మెల్లగా ఒక క్లారిటీ వస్తోంది. దాని కోసం పారిశ్రామికవేత్తల నుంచి చాలా మంది పేర్లు వస్తున్నాయి. అయితే బిల్డర్ కాశి విశ్వనాధం ప్రముఖంగా వినిపిస్తోంది. అర్ధబలం అంగబలం కలిగిన వారుగా కాశీ ఉన్నారు.

ఆయన టీడీపీలో చురుకుగా ఉండేవారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితులుగా పేరు పొందారు. ఆయన 2021 ప్రాంతంలో వైసీపీలోకి వచ్చారు. నాటి నుంచి పార్టీలో కీలకంగా మారారు. గవర సామాజిక వర్గానికి చెందిన కాశీ ఎంపీ సీటు కోసం చూస్తున్నారు అని అంటున్నారు.

ఆయన తన వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. అయితే వైసీపీ అధినాయకత్వం అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ వైపు చూస్తోందని అంటున్నారు. ఆయన పార్టీ కోసం దశాబ్దాల పాటు పని చేసి ఉన్నారు. విధేయతకు పెద్ద పీట వేస్తే ప్రసాద్ ఎంపీ క్యాండిడేట్ అవుతారు అని అంటున్నారు. గంటా అనుచరుడిగా ఒకనాడు ఉన్న కాశీ వైసీపీలో ఎంపీ టికెట్ ని సాధిస్తే అది రాజకీయంగా సంచలనం అవుతుందనే అంటున్నారు.