వైసీపీ వచ్చే ఎన్నికలలో ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు నిర్ణయించింది. దానికంటే ముందు పార్టీ క్యాడర్ ని ఆ వైపుగా నడిపించేందుకు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. ఏపీలో మొత్తం అయిదు రీజియన్లుగా విభజించి పార్టీ క్యాడర్ తో మీటింగ్స్ ని నిర్వహించేందుకు పార్టీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
ఏపీలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి. వాటిని అయిదు రీజియన్లుగా చేస్తోంది వైసీపీ. ప్రతీ అయిదు జిల్లాలకు కలిపి ఒక రీజియన్ గా చేసుకుని పార్టీ కార్యకర్తలతో భారీ సమావేశాలను నిర్వహించనుంది.
ఈ నెలలోనే ఈ సమావేశాలకు శ్రీకారం చుడుతున్నారు. తొలి సమావేశాన్ని ఈ నెల 25న విశాఖ జిల్లా భీమునిపట్నంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఉత్తరాంధ్రా నుంచే వైసీపీ తన ఎన్నికల సన్నాహాలను మొదలుపెడుతోంది అని అంటున్నారు.
విశాఖ లోని భీమునిపట్నం అంటే వైసీపీ ఈ ప్రాంతం మీద గురి బాగా పెట్టినట్లే అంటున్నారు. ఈ సమావేశాలలో రానున్న ఎన్నికల్లో వైసీపీ క్యాడర్ ఎలా పనిచేయాలి. ప్రజలలోకి ఎలా వెళ్లాలి, మరోసారి జగన్ ని సీఎం గా చేయాలంటే వారు రానున్న కాలంలో ఏ విధంగా జనంతో మమేకం కావాలన్న దాని మీద దిశా నిర్దేశం చేస్తారు
ఈ సమావేశాలకు ఆయా రీజియన్ల పరిధిలోని మంత్రులతో పాటు కీలక నేతలు రాష్ట్ర నేతలు హాజరై క్యాడర్ ని ఉత్తేజం చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ నేరుగా వస్తారా లేక వర్చువల్ విధానంలో ప్రసంగం చేస్తారా అన్నది ఇంకా తెలియలేదు అని పార్టీ వర్గాలు చెబుతున్నారు.
చాలా చోట్ల ఇంచార్జిలను నియమించిన వైసీపీ ఇక మీదట పూర్తి స్థాయిలో ప్రజలలో ఉండేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది అని అంటున్నారు. దానికి భీమిలీ నుంచే శుభారంభం పలకాలని నిర్ణయించడంతో వైసీపీకి ఉత్తరాంధ్రా సెంటిమెంట్ కలసి వస్తుందని భావిస్తున్నారు.