విజయవాడ ఎంపీగా బీజేపీ తరపున మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి పోటీ చేయనున్నారని గతంలో “గ్రేట్ ఆంధ్ర” రాసిందే నేడు నిజమైంది. విజయవాడ బరిలో నిలిచే విషయాన్ని శుక్రవారం ఆయనే బయట పెట్టడం గమనార్హం. సుజనాచౌదరి బీజేపీలో వుంటున్నప్పటికీ, ఆయన చంద్రబాబు శ్రేయోభిలాషి. చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలని ఆకాంక్షిస్తున్న బీజేపీ నేతల్లో ఆయన మొదటి వాడు.
ఇదే సందర్భంలో సుజనాచౌదరిని గెలిపించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్న వాదన లేకపోలేదు. ఒకవేళ బీజేపీతో పొత్తు వుంటే సుజనాచౌదరికి మద్దతు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఇంకా పొత్తుపై బీజేపీ తేల్చలేదు. కానీ విజయవాడలో తాను పోటీ చేస్తానని సుజనా చౌదరి ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే విజయవాడలో ప్రధాన పార్టీల అభ్యర్థులెవరో తేలిపోయింది.
వైసీపీ తరపున సిటింగ్ ఎంపీ కేశినేని నాని, అలాగే టీడీపీ పక్షాన ఆయన సొంత తమ్ముడు కేశినేని చిన్న తలపడనున్నారు. ఇక బరిలో బీజేపీ వుంటే సుజనాచౌదరి అభ్యర్థి అవుతారు. అంటే ముగ్గురు కమ్మ నేతల మధ్యే పోటీ ప్రధానంగా వుంటుంది. కమ్మ సామాజిక వర్గం ఎవరి పక్షాన వుంటుందనేది ఆసక్తిగా మారింది. సుజనా చౌదరికి కూడా తన సామాజిక వర్గంలో మంచి పట్టు వుంది.
ఈ నేపథ్యంలో సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. అమరావతి రాజధానికి తమ పార్టీ అనుకూలమన్నారు.