బాబు రాయలసీమను యీసడించి, దాన్ని జగన్ కంచుకోటగా మార్చారు. కోస్తా జిల్లాలకే ప్రాధాన్యం యిచ్చి ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసి, తన కంచుకోట బీటలు తీసేట్లు చేసుకుని జగన్‌కు ప్రవేశం కల్పించారు. కెసియార్ అలాటి పొరపాట్లు చేయలేదు. ఉత్తర తెలంగాణ యిలాగ, దక్షిణ తెలంగాణ అలాగ అనీ, మా అత్తవారిదే గొప్ప కల్చర్ అనీ.. యిలాటి మాటలు మాట్లాడలేదు. దాంతో దాడి ఎక్కణ్నుంచి ప్రారంభించాలో షర్మిలకు తెలియకుండా పోయింది. ఇంకో విషయమేమిటంటే బాబు చుట్టూ వున్నది వృద్ధనాయకత్వం కావడంతో, జగన్‌కు కలిసి వచ్చింది. యువత అటు చూశారు. కానీ కెసియార్ చుట్టూ వున్నది యువనాయకులే. బాబు శిబిరంలో వున్న యువకుడు లోకేశే. అతను కెటియార్‌కు, హరీశ్‌కు ఏ విషయంలోనూ పోటీ రాలేడు. కెసియార్ మాత్రమే కాదు, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు ముగ్గురూ కష్టపడి పనిచేయగలిగినవారు, జనాల్లో తిరగగలిగినవారు, మేధోసంపత్తి వున్నవారు, వాగ్ధాటి కలవారు. బాబుకి యీ భాగ్యం లేదు. అందువలన షర్మిల ముందున్నది జగన్ కంటె కష్టమైన లక్ష్యం.
జగన్‌కు సాక్షి మీడియా అండగా వుంది. బాబు పక్షపాత మీడియాకు ప్రతిగా, బలంగా పనిచేసింది. మరి షర్మిలకు ఏముంది? తెలంగాణలో మీడియా కెసియార్‌కు అనుకూలంగా వుంది. ‘‘సాక్షి’’ షర్మిలను భుజాన వేసుకుని, కెసియార్‌కు ఆగ్రహం తెప్పిస్తుందా? మహా అయితే ఆంధ్రజ్యోతి కొంత కవరేజి యివ్వవచ్చు. అది కూడా జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితేనే! లేకపోతే యీమెను భుజాన మోయవలసిన పని వాళ్లకు లేదు. షర్మిలకు వ్యాపారవర్గాల మద్దతు వున్నట్లు తోచదు. క్రైస్తవ మిషినరీలు ఆర్థికబలం సమకూర్చి, యీమెకు అనుకూల మీడియాను తయారుచేసినా, ఈమె తెలంగాణకు సేవ చేయడానికి వచ్చిందని ప్రజల్ని నమ్మించడం చాలా కష్టం.
మీ కన్నీళ్లు తెలుసు అంటూ వస్తున్న షర్మిలను తెలంగాణ ప్రజలు ‘కెసియార్ ఆరేడేళ్లగా అధ్వాన్నంగా పాలిస్తూవుంటే యిన్నాళ్లూ చూస్తూ వూరుకున్నావేం? మీ అన్నతో పేచీ వచ్చేదాకా, నువ్వాశించిన పదవి దక్కేదాకా మేం గుర్తుకు రాలేదా?’ అని అడిగితే ఏం చెప్తారు? పాదయాత్ర చేసినప్పుడు మా అవస్థలు గమనించావు కదా, వాటిల్లోంచి మమ్మల్ని బయటపడేయడానికి యిన్నాళ్లూ ఏం చేశావ్? పోనీ రాజకీయంగా వదిలేయ్, సాంస్కృతికపరంగా తెలంగాణాతో ఏదైనా మమేకమయ్యావా? కవిత లాగా బతకమ్మ అనో, బోనాలనో, లేకపోతే స్త్రీల సమస్యలనో, జానపదగేయాలనో.. ఏ విధంగానైనా తెలంగాణావైపు చూసినది లేదు కదా! ఎక్కడో పరరాష్ట్రంలో వున్నావు. మీ అన్న నీతో సఖ్యంగా వుండి వుంటే అందంబడే వుండేదానివి. వేరే వ్యాపకం ఏమీ లేదు కదాని, అక్కడ చెల్లక యిటు వచ్చావా? అని అడిగితే జవాబులు చెప్పడం కష్టం.
ఇక వైయస్ వారసత్వం గురించి. జగన్‌కు ఆ వారసత్వం ఉట్టినే దఖలు పడిందా? పడితే వైయస్ అనుచరులందరూ జగన్ పార్టీ పెట్టగానే వచ్చేశారా? అందరూ కాంగ్రెసుతోనే వున్నారుగా! బొత్స లాటి వాళ్లు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారు కదా! కిరణ్ కుమార్ రెడ్డి జగన్‌ని ఎంత కట్టడి చేశాడు! ప్రజల్లో తనకు పలుకుబడి వుందని నిరూపించుకునేదాకా జగన్ వైపు చాలామంది చూడలేదు. షర్మిలకు కూడా అలాగే జరుగుతుంది. పైగా వైయస్ ఆంధ్రకు చెందిన లీడరు. తెలంగాణాలో ఒకప్పుడు పాప్యులర్ లీడరే. ముఖ్యంగా ఉచిత విద్యుత్‌తో, సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ రైతులకు ఆత్మీయుడయ్యాడు. కానీ వైయస్ వెనక్కాల కాంగ్రెసు వంటి పెద్ద సంస్థ, కేంద్రం వున్నాయి. మొత్తం ఘనతను వైయస్‌కు కట్టబెట్టలేరు. ఆయన పోయి 11 ఏళ్ల తర్వాత కూడా వైయస్ ప్రాభవం అలాగే వుందని అనుకోవడం కరక్టు కాదు.
వైయస్ ప్రభావం ఎంత మిగిలింది? – ఎందుకంటే ఆయన తనను తాను సమైక్యవాదిగా చూపించుకున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని తొక్కిపెట్టాడు. తెలంగాణ ఏర్పడిపోయాక అప్పటి ఆదరణ అలాగే ఎందుకుంటుంది? పైగా తెలంగాణ క్రెడిట్ మొత్తమంతా కెసియార్ కొట్టేశారు. వైయస్‌ను తెలంగాణ కాంగ్రెసు వదిలేసుకుంది. తెలంగాణ ఏర్పాటుకి అడ్డుపడిన ద్రోహిగా చూశారు. జగన్‌తో పేచీ వచ్చాక అధిష్టానం వైయస్‌పై అవినీతిపరుడిగా ముద్ర వేస్తే కిమ్మనలేదు. వైయస్ చేసిన పనులు కూడా బాబు ఖాతాలో వేసేస్తూ రాహుల్ 2018లో ప్రసంగిస్తే యిదెక్కడి అన్యాయం అంటూ అభ్యంతర పెట్టలేదు. అందువలన వైయస్ యిమేజి 11 ఏళ్ల క్రితంలాగానే వుందనలేం. పైగా ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులలో కెసియార్ వైయస్‌ను మరిపించారనే చెప్పాలి.
జగన్‌ను తెలంగాణలోకి రానీయకుండా చూసింది కాంగ్రెసు ప్రభుత్వం. తర్వాత జగన్ ఆంధ్రమీదే ఫోకస్ చేసి అక్కడ వైయస్ జ్ఞాపకాలను సజీవంగా వుంచాడు. తెలంగాణలో ఆ పని ఎవరూ చేయలేదు. ఏడేళ్ల తర్వాత ఆ కొడిగట్టిన ఆ జ్యోతిని షర్మిల వెలిగించగలదా? వైయస్ కూతురు అన్నంత మాత్రాన జనాలు ఆదరించేయరు. ఇందిరా గాంధీ 1966లో తొలిసారి ప్రధాని అయింది. 1967 ఎన్నికలలో కాంగ్రెసు చాలా రాష్ట్రాలలో దెబ్బ తినేసింది. నెహ్రూ కూతుర్ని ప్రధాని చేశారు కదాని జనాలు ఓట్లేయలేదు. తన సొంత పథకాలతో వారి మనసు గెలుచుకున్న తర్వాతనే ఇందిర బలపడింది.
ఆంధ్రమూలాల వారు ఆదరిస్తారా? – ఆంధ్రమూలాల వారికి మద్దతుగా ఏదైనా పార్టీ వుంటే వాళ్లంతా అటు ఓటేస్తారు అనే వాదన ఒకటుంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అయితే అది సాధ్యపడేది. తెరాస ఆంధ్రులను బాధిస్తే అండగా టిడిపి వుంటుందనుకుని ఓట్లేస్తే అది పారిపోయింది. బాబు, లోకేశ్‌లకు తెలంగాణ అనేది సోదిలోకి లేకుండా పోయింది. తెరాస ఉద్యమసమయం నాటి నినాదాలు అటక మీద పెట్టి, ఉమ్మడి రాష్ట్రంలో వున్న మాదిరే నడిపిస్తోంది. డబ్బున్న ఆంధ్రులకు ఎప్పటిలాగానే పనులు జరిగిపోతున్నాయి. ప్రయివేటు ఉద్యోగాలు స్థానికులకే అనే నినాదాన్ని అమలు చేయలేదు. అందువలన ఆంధ్రమూలాల వారు తమకు నచ్చిన పార్టీకి వేస్తున్నారు తప్ప ప్రాంతీయభావాలతో ఓటేయడం లేదు.
కానీ ఎప్పటికైనా తెరాసలో చీలిక వచ్చినా, లేక తెరాస ఓడిపోయినా, మళ్లీ ఆంధ్రద్వేషం పురి విప్పుకుంటుంది. ఆంధ్రులతో చేతులు కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని, ఒకరినొకరు నిందించుకుని ఆంధ్రమూలాల వారిలో అభద్రతా భావం కలగచేయవచ్చు. అప్పటిదాకా షర్మిలకు ఆ కోణంలో మద్దతు వుండదు. అప్పుడు కూడా ఆమె బలమైన ప్రత్యామ్నాయంగా తోస్తేనే! ఇక్కడో కాచ్ 22 పరిస్థితి వుంది. వివాదాస్పదమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎటు మాట్లాడతావని తెలంగాణ ప్రజలు ఆమెను అడుగుతారు. ఆంధ్రతో ఆమె సంబంధాలు పూర్తిగా కట్ చేసుకుని, తెలంగాణ తరఫున మాట్లాడితేనే యిక్కడ ఎదగగలదు. అలాటి పరిస్థితిలో ఆంధ్రమూలాల వారు ఆమెను మన మనిషి అని ఎలా అనుకోగలరు?
షర్మిల రాగానే రెడ్డి కమ్యూనిటీ వెంట నిలుస్తుంది, షర్మిలను చూసి క్రైస్తవులు, వారి వెంట దళితులు నిలబడతారు అని అనుకోవడం సరి కాదు. రెడ్లే కాదు, పలుకుబడి ఉన్న కులాల వారందరూ అధికారంలో వున్న వారి వైపే చూస్తారు తప్ప, ప్రతిపక్షంలో వున్నవారిని పట్టించుకోరు. వీళ్లని పెంచి పోషించడం వారి పని కాదు. ప్రస్తుతం యీమె ప్రభావం 3, 4 జిల్లాలలో మాత్రమే వుంటుందనుకుంటే యీమెను విన్నింగ్ హార్స్ అనుకోరు కదా! ఇక దళితులు, మైనారిటీలు వగైరా.. వారికి తెరాస పట్ల అసంతృప్తి వున్నపుడు కదా, ప్రత్యామ్నాయం కేసి చూసేది. ఆటోమెటిక్‌గా ఏదీ వచ్చి ఒళ్లో పడదు. షీ హేజ్ టు గో ఎ లాంగ్ వే అండ్ ప్రూవ్ ఏ లాట్. ప్రూవ్ చేసుకోగలదా లేదా అనేది యిప్పుడే చెప్పలేం. ఆమెలో నాయకత్వ లక్షణాలు ఏ మేరకు ఉన్నాయో, ఎటువంటి తరహా మనిషో యింకా బయటపడలేదు. ఫలానావారి కూతురనో, ఫలానావారి చెల్లెలనో అంచనాలు వేయలేం కదా! (సమాప్తం)
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)