భార్యాభర్తలన్న తర్వాత చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయని మెగాస్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన అన్నారు. రామ్‌చరణ్‌తో తన ప్రేమ, పెళ్లి గురించి ఉపాసన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను సమాజంతో పంచుకోవడంలో ఉపాసన ముందు వరుసలో ఉండే విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌తో ఆమె వివాహ బంధానికి ఎనిమిదేళ్లు. ఈ నేపథ్యంలో తమ మధ్య పెనవేసుకున్న ప్రేమ బంధం గురించి మనసులో మాటను బయట పెట్టారు.
పెళ్లి తర్వాత వచ్చిన మొదటి వాలంటైన్స్ డేని పురస్కరించుకుని చెర్రీ తనకు అపురూపమైన కానుక ఇచ్చారన్నారు. హృదయాకారంలో ఉన్న చెవి రింగులను తయారు చేయించి తనకు చెర్రీ కానుకగా ఇచ్చారన్నారు. అవి తనకెంతో ప్రత్యేకమన్నారు.
తమ ఎనిమిదేళ్ల వైవాహిక బంధం చాలా సంతోషంగా గడిచిందన్నారు. తమ మధ్య ఎన్నో అపురూప క్షణాలున్నాయన్నారు. అలాగే అప్పుడప్పుడు తమిద్దరి మధ్య విభేదాలు వస్తుంటాయన్నారు. గొడవలు కూడా జరుగుతుంటాయన్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే ఆ బంధం మరింత బలోపేతమవుతుందని ఉపాసన చెప్పుకొచ్చారు.
జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొంటూ విజయవంతంగా ముందడుగు వేస్తున్నట్టు ఉపాసన పేర్కొన్నారు. ఇతరుల కోసం ఉపాసన తన అంతరాత్మకు విరుద్ధంగా అభిప్రాయాలు చెప్పరని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండడం గమనార్హం.