ఉప్పెన సినిమా గురించి మెగా ఫ్యామీలీ మెంబర్లు, హీరో అందరూ సినిమా విడుదలకు ముందు, తరువాత కూడా స్పందించారు. అభినందలు కురిపించారు. శుభాకాంక్షలు చెప్పారు. ఇంతమందిని సినిమా కదిలించింది. లేదా హీరో తో వున్న బంధం, బాంధవ్యం కదిలించింది. కానీ హీరో బన్నీ నుంచి మాత్రం స్పందన కరువైంది.
సినిమా విడుదలకు ముందు కనీసపు కర్టెసీ అభినందన లేదు. విడుదలయిన తరువాత అంతకన్నా లేదు. పైగా ఉప్పెన బ్యానర్ లోనే పుష్ప సినిమా చేస్తున్నాడు బన్నీ. అంతే కాదు, ఆ సినిమా డైరక్టర్ సుకుమార్ ఈ ఉప్పెన సినిమా నిర్మాణ భాగస్వామి. అదే సుకుమార్ రైటింగ్స్ లో బన్నీ మాతృసంస్థ గీతా ఆర్ట్స్ 18 పేజెస్ అనే సినిమా నిర్మిస్తోంది.
ఇన్ని వ్యవహారాలు వున్నా బన్నీ మాత్రం ఓ ట్వీటు లేదు..ఓ ప్రకటన లేదు. అయితే బన్నీ సన్నిహిత వర్గాలు వేరుగా చెబుతున్నాయి. ఇప్పుడు ఏం చేసినా గుంపులో గోవిందా అన్నట్లు వుంటుంది. అదే అందరూ అయిపోయాక, బన్నీ ప్రత్యేకంగా పిలిచి ఓ బొకే చేతిలో పెడితే, దానికి కవరేజ్ వేరుగా వుంటుంది.
అందుకే ఇప్పుడు చెప్పడం లేదు అని సర్ది చెబుతున్నారు. కానీ తను అభినందించాలంటే దానికి కూడా స్పెషల్ అట్రాక్షన్ వుండాలనుకోవడం, అందరూ ఆ రోజు తన గురించే మాట్లాడుకోవడం అని అనుకోవడం ఏమిటి? సమయానికి స్పందిస్తే దాని అందమే వేరు కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.