ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తాయా?

జమిలిలో అంత నియంతృత్వం ఉన్నదా? ఇప్పుడు ఈ కొత్త సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అనే నినాదంతో దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి అయిదేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేలాగా పార్లమెంటుకు-…

జమిలిలో అంత నియంతృత్వం ఉన్నదా? ఇప్పుడు ఈ కొత్త సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అనే నినాదంతో దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి అయిదేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేలాగా పార్లమెంటుకు- అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే కొత్త విధానం తీసుకురావడానికి మోడీ సర్కారు కసరత్తు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటుచేసి.. వారి ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల, నిపుణుల అభిప్రాయాలను సేకరించి అధ్యయనం చేసే బాధ్యతను అప్పగించారు. ఈ కమిటీ తమ పని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కోవింద్ కమిటీని కలిసిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీచెప్పిన అభిప్రాయం ఇప్పుడు చర్చనీయాంశమే.

ఒకేదేశం- ఒకే ఎన్నిక అనే విధానంతో తాము ఏకీభవించబోమని మమతా దీదీ తేల్చి చెప్పారు. భారత రాజ్యాంగస్ఫూర్తికి అది విరుద్ధం అని కూడా ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే దేశంలోని ప్రాంతీయ పార్టీలు అన్నీ మమత బాటనే అనుసరిస్తాయా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే.. జమిలి ఎన్నికలు జరగడం వలన జాతీయ పార్టీలకు ఎడ్వాంటేజీ ఉంటుందనే అభిప్రాయం పలువురిలో ఉంది. అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి గనుక.. సహజంగా ప్రాంతీయ పార్టీలకు పడే ఓట్లు తగ్గుతాయనేది ఒక నమ్మకం.

నిజానికి, ఒకే దేశం- ఒకే ఎన్నిక అనే పేరుతో భారతీయ జనతా పార్టీ జమిలి ఎన్నికల ప్రయత్నం చేస్తున్నది గానీ.. వాస్తవంలో వారు ‘ఒకే దేశం- ఒకే పార్టీ- అది బిజెపి’ అనే హిడెన్ ఎజెండాతో ఈ కసరత్తు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ప్రాంతీయ పార్టీలను పూర్తిగా కబళించేయడానికే బిజెపి వ్యూహాలు అన్నీ సాగుతున్నాయనే విమర్శలూ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో కమలదళాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రాంతీయ పార్టీలను చీలుస్తున్న వైఖరిని మరోలా అర్థం చేసుకోవడం కూడా కష్టం అనేది పలువురి అభిప్రాయం. అలాంటి క్రమంలో.. జమిలి ఎన్నికలు అనే ప్రక్రియ కూడా నెమ్మదిగా ప్రాంతీయ పార్టీలను కబళించేస్తుందనే భయం పలువురిలో ఉంది.

జమిలి ఎన్నికల కాన్సెప్టును ముందుకు తీసుకువెళ్లాలంటే.. ప్రాంతీయ పార్టీలలో ఉన్న భయాలను నివృత్తి చేయడానికి మోడీ సర్కారు ఏం చేస్తుందో వేచిచూడాలి.