సంక్రాంతికి భారీ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఫిలింఛాంబర్ రంగంలోకి దిగింది. సంక్రాంతి నుంచి ఎవరైనా తప్పుకుంటే, ఆ సినిమాకు రాబోయే రోజుల్లో సోలో రిలీజ్ డేట్ ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. అదే కోణంలో చర్చలు కూడా జరిపారు.
ఫిలింఛాంబర్ పెద్దల మాటలు నమ్మి, సంక్రాంతి బరి నుంచి ఈగల్ సినిమాను తప్పించారు పీపుల్ మీడియా నిర్మాతలు. ఆ వెంటనే ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 9న ఈగల్ సినిమా మాత్రమే విడుదలయ్యేలా ఏర్పాట్లు చేస్తామని స్వయంగా దిల్ రాజు ప్రకటించారు.
అదే టైమ్ లో నిర్మాత నాగవంశీ, తను తీసిన టిల్లూ స్క్వేర్ సినిమాను ఫిబ్రవరి 9 నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించారు. యాత్ర2 కూడా ఆ తేదీ నుంచి దాదాపు వాయిదా పడినట్టే. ఇలా ఈగల్ సినిమాకు అనుకున్నట్టుగానే గ్రౌండ్ క్లియర్ అవుతుందనుకుంటే, ఇప్పుడు మరికొన్ని అడ్డంకులు వచ్చి పడ్డాయి.
సంక్రాంతి నుంచి వాయిదా పడిన రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాను ఫిబ్రవరి 9కి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అటు అనీల్ సుంకర కూడా తను తీస్తున్న ఊరు పేరు భైరవకోన అనే సినిమాను ఫిబ్రవరి 9కి విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు.. మరో 2 చిన్న సినిమాలు కూడా అదే డేట్ కు రావాలని చూస్తున్నాయి. ఎందుకంటే, ఫిబ్రవరి 9 అనేది వాలంటైన్స్ డే వీక్. దాదాపు ఆ వారమంతా కుర్రాళ్లు థియేటర్లకు వచ్చే సీజన్. అందుకే ఆ తేదీకి అంత డిమాండ్. సో, ఇచ్చిన మాట ప్రకారం, ఈగల్ కు సోలో రిలీజ్ కల్పించేందుకు.. ఛాంబర్ పెద్దలు మరోసారి రంగంలోకి దిగక తప్పేలా లేదు.