Advertisement

Advertisement


Home > Movies - Reviews

Hanu-Man Review: మూవీ రివ్యూ: హను మాన్

Hanu-Man Review: మూవీ రివ్యూ: హను మాన్

చిత్రం: హను మాన్
రేటింగ్: 3/5
తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ సీను తదితరులు
కెమెరా: దాశరథి శివేంద్ర
ఎడిటింగ్: సాయిబాబు తలారి
సంగీతం: అనుదీప్ దేవ్, గౌరా హరి, కృష్ణ సౌరభ్
నిర్మాత: నిరంజన్ రెడ్డి
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
విడుదల తేదీ: 12 జనవరి 2024

హనుమంతుడు పేరు చెబితేనే పిల్లల్లో ఒక అనందం, పెద్దల్లో ధైర్యం కలుగుతాయి. భక్తికి, బలానికి, నిర్భయానికి అధిదేవత హనుమంతుడు. మొన్న "ఆదిపురుష్" వచ్చినప్పుడు కూడా సినిమా హాల్స్ లో ఒక సీటుని ఆయనకి కేటాయించిన వీరాభిమానభక్తి మన జాతిది. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా ఈ మధ్యకాలంలో ఈ డివోషనల్ హిస్టీరియా యువ ప్రేక్షకుల్లో కూడా పెరిగింది. ఇక "హనుమాన్" టైటిలుతో హనుమంతుడి నేపథ్యంలో సినిమా వస్తే ఎలా  ఉంటుంది? ఆ అంచనాలు ఎలా ఉంటాయి? కచ్చితంగా ఆకాశాన్ని అంటుతాయి. మరి ఆ అంచనాలకి తగ్గట్టుగా ఉందా ఈ చిత్రం? 

కథలోకి వెళ్లితే... అంజనాద్రి అనే మారుమూల పల్లెటూరు. అక్కడ హనుమంతు (తేజ సజ్జ) అనే యువకుడు. అతనొక చిరు దొంగ, శరీరకంగా బలహీనుడు. అతనికొక అక్క (వరలక్ష్మి శరత్ కుమార్). తల్లితండ్రిలేని తమ్ముడిని తల్లిలా చూసుకుంటూ ఉంటుంది.

ఆ ఊళ్లో పాలెగాడు (రాజ్ దీపక్ శెట్టి) ప్రజల్ని పీడిస్తూ ఉంటాడు.

ఈ నేపథ్యంలో కొన్ని సంఘటనల అనంతరం హనుమంతుకి ఒక మణి దొరుకుతుంది. దాని శక్తివల్ల హనుమత్ శక్తి అతనిలో ప్రవేశిస్తుంది.

బలిష్టుడైన పాలెగాడిని, అతని వస్తాదుల్ని ఆ ఆంజనేయ శక్తితో ఆడుకుంటాడు.

ఇదిలా ఉంటే సూపర్ హీరో లాంటి శక్తికోసం బాల్యం నుంచీ పిచ్చి కలలు కంటూ కౄరంగా మారిన మైకేల్ (వినయ్ రాయ్) అని ఒకడుంటాడు. అతను ఈ మణిని లాక్కోవాలని పన్నాగాలు పన్నుతాడు. అక్కడినుంచి ఏమౌతుందనేది కథ. 

కథనంగా చూస్తే ఎక్కడా మెదడుకి పని పెట్టే ట్విస్టులు లేవు. తర్వాతి సన్నివేశమేంటో ఊహించే విధంగానే సాగుతుంటుంది. "ఆవ్" లాంటి బ్రెయిన్ టీజింగ్ చిత్రం తీసిన ప్రశాంత్ వర్మేనా ఈ ఫ్లాట్ నెరేటివ్ తీసింది అని అనిపిస్తుంది. ఇన్ని చెప్పుకున్నా కూడా అసలెక్కడా బోర్ కొట్టని విధంగా సాగింది. మరీ ముఖ్యంగా చూసున్నంతసేపూ ఇది పిల్లలకి మరింత నచ్చుతుందనే భావన కలుగుతుంది.  

ఇలాంటి సినిమాల్లో ప్రేక్షకులు ప్రధానంగా కోరుకునేది నాలుగైదు రోమాంచితమైన సన్నివేశాలు. వాటినే సినీ పరిభాషలో "పీక్స్" అంటారు. అవి ఉన్నాయి. హనుమంతుడికి సంబంధించిన ఆ సన్నివేశాలాకి హాలు దద్దరిల్లిందంటే యంగ్ ఆడియన్స్ ఎంతెలా పూనకాలు వచ్చి ఊగారో అర్ధం చేసుకోవచ్చు. 

అయితే ఇది పూర్తిగా ఒరిజినల్ అనిపించే కథావస్తువు కాదు. 2004లో కృష్ణ వంశీ తీసిన "శ్రీ ఆంజనేయం"లోని ప్లాట్ పాయింటుని రీమిక్స్ చేసినట్టుగా ఉంది. ఆ చిత్రం పూర్తి సీరియస్ టోన్ లో, కొద్దిపాటి హారర్ ఎలిమెంటుతో సాగుతుంది. ఈ "హనుమాన్" మాత్రం కామెడీ కూడా ఉండడం వల్ల ఎంగేజింగ్ గా ఉంది.

అదే విధంగా ఇందులో మణి ట్రాక్ ని చూస్తుంటే "జగదేక వీరుడు అతిలోక సుందరి"లోని ఉంగరం, "పాతళభైరవి"లో బొమ్మ గుర్తొస్తాయి.

అలా పాత సినిమాల్లోని ప్లాట్ పాయింటుని, ఎలిమెంటుని తీసుకుని రాసుకున్న కథ ఈ "హనుమాన్". 

ఇక మేకింగులో కూడా కొన్ని ఇతర చిత్రాల్లోని పోకడలు కనిపిస్తాయి. "అల వైకుంఠపురములో" లోని "సిత్తరాల సిరపడు.." టైపులో "ఆవకాయ ఆంజనేయ..." అనే ఫైటింగ్ సాంగ్, "రంగస్థలం"లో "ఓరయ్యో..." ని పోలిన ఒక పాట కనిపిస్తాయి. 

సాంకేతిక అంశాల విషయానికి వస్తే పాటల్లోనూ నేపథ్యంలోనూ సంగీతం బాగుంది. అంజనాద్రి గ్రాఫిక్స్ బాగున్నాయి. కెమెరా, ఎడిటింగులు సినిమాని నిలబెట్టాయి. 

నటీనటుల్లో గెటప్ శీను ఈ చిత్రానికి ప్రధానమైన ఎసెట్. వేరు వేరు హీరోల్ని అనుకరిస్తూ చెప్పే డయలాగ్స్ నవ్విస్తాయి.

సత్య కామెడీ కూడా సరదాగా ఉంది. వీళ్లిద్దరూ ఈ సినిమాకి పెద్ద రిలీఫ్. వెన్నెల కిషోర్ నటుడిగా కమెడియనే అయినా, ఇందులో అతనికిచ్చిన పాత్ర వేరు.

వినయ్ రాయ్ విలనీ ఆకట్టుకుంటుంది.

వరలక్ష్మి సెంటిమెంటుని,కాస్తంత యాక్షన్ ని రంగరించి ఎప్పటిలాగానే తన మార్క్ క్యారెక్టర్ చేసింది.

ఒక సన్నివేశంలో యూట్యూబ్ చానళ్ళ పుణ్యమా అని పాపులరైన సునిసిత్ కూడా కనిపించి హాలుని గొల్లుమనిపించాడు.

హీరో హీరోయిన్స్ విషయాని కొస్తే ఇందులో హీరో తేజ సజ్జా అయినప్పటికీ అసలు హీరో హనుమంతుడే. తేజ నటన ఎంతవరకూ ఉండాలో అంతవరకూ ఉంది. ఎక్కడా ఓవర్ చెయ్యలేదు, అండర్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వలేదు.

హీరోయిన్ గా అమృతా అయ్యర్ పాత్ర జస్ట్ ఓకే. సదరు సినిమాలో సగటు హీరోయిన్ గా ఉంది తప్ప ఆమె పాత్రకు ప్రత్యేకమైన డైనమిక్స్ ఏవీ లేవు.

ప్రధమార్ధం నెమ్మదిగా నడిచి ద్వితీయార్ధం బలం పుంజుకుంది. అయితే అక్కడక్కడ కథలో డివోషనల్ హిస్టీరియా తెప్పించాల్సిన చోట కొన్ని సీన్లు అనవసరంగా వస్తున్నాయనిపిస్తుంది. మళ్లీ క్లైమాక్స్ మాత్రం పీక్ అందుకుంది. సీక్వెల్ ప్రకటన కూడా జరిగింది.

ఇందులో సూపర్నేచురల్, సూపర్ హీరోయిక్, వాస్తవదూరంగా ఉండే సినిమాటిక్ లిబర్టీస్ చాలానే ఉన్నాయి. కథాంశమే సూపర్నేచురల్ కాబట్టి ఇందులో లాజిక్కుల్ని విస్మరించదగ్గ మేజిక్ వర్కౌట్ కావాలి. అది చాలా వరకు జరిగినట్టే. అదొక ప్లస్ పాయింట్. 

పాశ్చాత్య కామిక్స్ లో స్పైడర్-మ్యాన్, సూపర్-మ్యాన్ లాగ మనకి అంతకంటే పెద్ద సూపర్ హీరో హను-మాన్ కనుక ఆ దిశగా నేటి తరం యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తీసిన చిత్రమిది. అలాగని పూర్తిగా ఆధునిక పోకడలకి పోకుండా, ఒక గ్రామం చుట్టూ కథ నడిపించి బేసిక్ ఎమోషన్ ని పండించాడు దర్శకుడు. 

పండగ సీజన్లో మరో ఆలోచన లేకుండా హాల్లో కూర్చుని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ చూడదగ్గ చిత్రం ఈ "హనుమాన్"... అందులో అనుమానం లేదు. 

బాటం లైన్: "హనుమానం" లేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?