చిత్రం: గుంటూరు కారం
రేటింగ్: 2.25/5
తారాగణం: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావు, మురళి శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు
కెమెరా: మనోజ్ పరమహంస, పి.ఎస్.వినోద్
సంగీతం: తమన్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్
విడుదల: 12 జనవరి 2024
“అలవైకుంఠపురములో” తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చింది ఈ “గుంటూరు కారం” తోనే. పండగ సీజన్లో నెంబర్ వన్ చాయిస్ గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలున్నాయి. ఎంతవరకు అందుకుందో చూద్దాం.
రమణ (మహేష్ బాబు) గుంటూరులో ఒక మిల్లు ఓనర్. అతని తండ్రి (జయరాం). తల్లి (రమ్యకృష్ణ) మాత్రం తనని, తన భర్తని వదిలేసి వేరేవ్యక్తిని (రావు రమేష్) పెళ్లి చేసుకుంటుంది. ఆమెకి అక్కడొక కొడుకు (రాహుల్ రవీంద్రన్) కూడా ఉంటాడు. దానికి కారణమేంటో కథాగమనంలో తెలుస్తుంటుంది.
ఇదిలా ఉంటే రమణ తల్లికి తండ్రి అయిన వైరా వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి, తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదనేది ఆ కాగితాల్లోని సారాంశం.
ఈ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి (మురళీశర్మ) అనే తన సొంత లాయర్ కి అప్పగిస్తాడు వెంకటస్వామి ఈ సారంగపాణి కూతురు ఆముక్తమాల్యద (శ్రీలీల). ఈ క్రమంలో రమణ, ఆముక్తమాల్యద మధ్యలో రొమాన్స్ నడుస్తుంటుంది.
అసలు రమణకి, తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకొచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెడతాడా? పెడితే ఏవిటి? ఎక్కడా ఉత్కంఠత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ? ఈ ప్రశ్నలకి సమధానమే తక్కిన కథనం.
సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక తేడా కొట్టబోతోందా అనే సూచన సుమారు ఇరవై నిమిషాలు చూస్తే తెలుస్తుంటుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి “తేడా” సూచన వచ్చినా మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఏ మలుపులోనో అద్భుతం కోసం వేచి చూడడం ఆయన మీద నమ్మకమున్న సగటు ప్రేక్షకుడు చేసే పని.
అయితే ఎంత సేపైనా తెర మీద జరుగుతున్న కథేంటో, ఆ పాత్రలేంటో, వాళ్ల ఎమోషన్స్ ఏంటో అర్ధమయ్యీ అవ్వకుండా సాగుతుంటాయి. దీనికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నాడో అర్ధం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్లు అంతలా తన్నులు తినేంతగా ఏం చేసారో ఆడియన్స్ కి సింకవ్వదు.
ఫస్టాఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలీక, కథ ముందుకి నడవక, ఒక దశలో తెరలోకి వెళ్లి హీరో కాళ్లు పట్టుకునైనా “ఆ సంతకమేదో పెట్టేయవయ్యా…దాదాపు ఇంటర్వల్ టైమొచ్చేసింది” అని ప్రాధేయపడాలనిపిస్తుంది సగటు ప్రేక్షకుడికి.
సెకండాఫైనా గ్రిప్పింగ్ గా ఉంటుందా అంటే అదీ అంతే. తల్లీకొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికే సరిపోయిందంతా. ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. ఆఖరి 10 నిమిషాల్లోనైనా విషయముందా అంటే అక్కడా ఏమీ కనపడదు.
త్రివిక్రమ్ అంటే కేవలం దర్శకుడు కాదు. మాటల మాంత్రికుడని బ్రాండ్. అసలిందులో మాటలు రాసింది ఈయనేనా లేక ఈయన బద్ధకిస్తే ఇంకెవ్వరో రాసారా అనే డౌటొస్తుంది. ఒక్కటంటే ఒక్క మెరుపులాంటి డైలాగ్ కూడా లేదు.
“ఈ ఇంట్లో గుడ్లు మీరు పెడుతున్నారో కోళ్లు పెడుతున్నాయో తెలీడం లేదు” లాంటి డైలాగ్ ఎందుకు రాసాడో కూడా అర్ధం కాదు.
“అతను రాయల్ సత్యం.. బ్లాక్ అండ్ వైటు.. వీడు కలరు. సినిమా స్కోపు.. సెవెంటి ఎం ఎం” అనే డైలాగొచ్చినప్పుడు ప్రేక్షకులు కుక్కినపేనుల్లా సైలెంటుగా ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఎంత బ్యాడ్ టైమింగులో ఉన్నాయో మాటలు.
అస్సలు విషయం లేని డైలాగ్స్ కి కూడా పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టి పెట్టాడు తమన్. భాష రాని ప్రేక్షకుడు చూస్తే ఆ సౌండుకి నిజంగానే అందులే ఏదో పవర్ఫుల్ డైలాగ్ ఉందనుకుంటాడు పాపం.
తమన్ అందించిన నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. పాటల్లో బాగా ప్రాచుర్యం పొందిన “కుర్చీ మడతపెట్టి…” మంచి ఊపునిచ్చింది. అప్పటికే నీరసించిన కథనంతో నిట్టూరుస్తున్న ప్రేక్షకులకి కాస్త టానిక్ ఇచ్చినట్టయ్యింది. “మామా ఎంతైనా…” పాట రాంగ్ టైములో వచ్చి అనవసరమనిపిస్తుంది. సాంకేతికంగా ఏ ఇతర విభాగమూ వంకపెట్టేలా లేదు. అన్ని సక్రమంగా పని చేసాయి ఒక్క కథ, కథనం తప్ప.
మహేష్ బాబు కొత్త లుక్ పరంగా పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఎక్కడా రిజర్వ్డ్ గా కనపడకుండా మంచి ఈజ్ తో యాక్టివ్ గా చేసాడు. ఇతని కమిట్మెంటుకి సరైన స్క్రిప్ట్ కూడా తోడయ్యుంటే బాగుండేది.
శ్రీలీల అందంగా కనిపిస్తూనే డాన్సింగ్ స్టార్ అనిపించుకుంది. అయితే ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుని పెట్టుకోకపోతే కష్టం. ఈమెకి డ్యాన్స్ ఎంత ప్లస్సో, వాయిస్ అంత మైనస్. సమంత కెరీర్ కి చిన్మయి వాయిస్ ప్లస్ అయినట్టు శ్రీలీలకి కూడా ప్రొఫెషనల్ డబ్బింగ్ అర్టిష్ట్ అవసరముంది.
మీనాక్షి కూడా చూడ్డానికి బాగుంది కానీ ఆమె పాత్రకి దశ, దిశ లేవు. హీరోకి మందు ఇవ్వడానికి, అన్నం వడ్డించడానికి, ఒక సీన్లో ఒళ్లు పట్టడానికి ఉందంతే.
ప్రకాష్ రాజ్ ఎనభై ఏళ్ల వృద్ధుడి పాత్రలో “ది బెస్ట్” అనిపించున్నాడు. ఈ తరహా మెథడ్ యాక్టింగ్ ఆయనకి కొత్తకాదు.
రమ్యకృష్ణ పాత్రకి బిల్డప్ ఉందికానీ డెప్త్ లేదు. పైగా కథంతా నడిపింది ఆమెనే అన్నట్టుగా ఉంటుంది. ఆమె ఎమోషన్ ఏంటో, చేసిందేంటో ఆడియన్స్ ని అంతగా తాకదు.
జయరాం పాత్రంతా ఒక ఇంటికి, గదికి పరిమితమయినట్టుగా ఉంది.
మురళీశర్మ చాలా సినిమాల్లోలాగానే ఇందులో కూడా తనవైన మ్యానరిజం తో కనిపించాడు.
ఈశ్వరీరావు ఓకే. వెన్నెల కిషోర్ ట్రాక్ బాగానే ఉంది. అజయ్ క్యారెక్టర్ చిన్నదే అయినా కాసేపు నవ్వించేలా ఉంది. అజయ్ ఘోష్, రవిశంకర్ తమ తమ పాత్రల్లో ఓకే అనిపించారు. సునీల్ సినిమా మొదట్లో ఒక్కటంటే ఒక్క సీన్లో కనిపించి మాయమయ్యాడు.
ఇది త్రివిక్రమ్ సినిమాలా అనిపించదు. ఏదో ఫ్లాపైన శ్రీకాంత్ అడ్డాల చిత్రంలో డైలాగ్స్ లాగ, ఏదో సరిగ్గా ఆడని బోయపాటి సినిమాలో ఫైట్స్ లాగ, ఎవరో ఎమెచ్యూర్ దర్శకుడి సినిమాల్లో అర్ధాంతరంగా వచ్చే పాటల్లాగ అనిపిస్తూ త్రివిక్రమ్ ఒరిజినల్ పనితనం ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి.
తలలో సరుకు లేని విద్యార్థి ఫెయిలైనా మాస్టర్లకి అంత కోపం రాకపోవచ్చు. కానీ ఫస్ట్ ర్యాంక్ కొట్టే సత్తా ఉన్నవాడు సరిగ్గా స్కోర్ చేయకపోతే మాత్రం చాలా చిరాకుగా ఉంటుంది. ఇక్కడ త్రివిక్రమ్ ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి, ప్రేక్షకులు మాస్టర్లు. ఇంతకంటే చెప్పడానికేం లేదు దర్శకుడి గురించి.
తల-తోక లేకుండా అమ్మ-కొడుకు సెంటిమెంటు పెట్టుకుని క్లైమాక్స్ “అత్తారింటికి దారేది” లో అత్త-మేనల్లుడు ట్రాకులాగ పాసైపోతుందని అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ఒకసారి తీసేసింది ఎంత గొప్పగా ఉన్నా మళ్లీ తీస్తే కాలం చెల్లిన సరుకు లాగ, భావదారిద్ర్యం లాగ కొడుతుంది తప్ప ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడవు.
సినిమా ఇంకా అరగంట ఉందనగా “ఎప్పుడవ్వుద్దిరా బాబూ” అని హాల్లో వెనుకనుంచి ఒక ప్రేక్షకుడు అరుస్తూ నిట్టూర్చాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
పండగ సీజన్లో ఫుల్ డోస్ వినోదం లభిస్తుందని వేచి చూసిన అన్ని వర్గాల ప్రేక్షకులకి నిరాశని మిగిల్చే చిత్రమిది. గుంటూరు కారం మంచి స్పైసీగా ఉంటుందని వెళితే అది కళ్లల్లో పడినట్టయ్యింది.
బాటం లైన్: కారం కళ్లల్లో…