రాముడిబాణంతో రెండు పిట్టలు కొడ్తున్న బిజెపి!

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనేది మామూలుగా మనకు తెలిసిన సామెత. ఇప్పుడు బిజెపి అదే సిద్ధాంతాన్ని అవలంబిస్తోంది. ఒక్కబాణంతో రెండు పిట్టలు కొట్టాలని చూస్తోంది. అయితే ఆ బాణం కూడా తమది కాదు.. రాముడిది!…

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనేది మామూలుగా మనకు తెలిసిన సామెత. ఇప్పుడు బిజెపి అదే సిద్ధాంతాన్ని అవలంబిస్తోంది. ఒక్కబాణంతో రెండు పిట్టలు కొట్టాలని చూస్తోంది. అయితే ఆ బాణం కూడా తమది కాదు.. రాముడిది! అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరగబోతున్న నేపథ్యంలో ఈ సందర్భాన్ని రాజకీయం వాడుకోవడంలో రెండు రకాల ప్రయోజనాలను బిజెపి లక్ష్యిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రామబాణం వారికి అలా కలిసి వస్తోంది.

అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది ఒక పార్టీ వ్యవహారంగా మారిపోవడం అనేది ఇవాళ్టి పరిణామం కాదు. కొన్ని దశాబ్దాలుగా అది భారతీయ జనతాపార్టీకి ఎన్నికల్లో ఓట్లు రాల్చే అంశంగానే ఉపయోగపడుతూ వస్తోంది. అయోధ్య రాముడి పేరు చెప్పుకునే దేశవ్యాప్తంగా హిందూ ఓటు బ్యాంకును పోలరైజ్ చేయడం ద్వారా.. బిజెపి బలపడింది.

ఇప్పుడు రామాలయం నిర్మాణం కూడా జరుగుతున్న సమయంలో.. రాముడిని ఓట్లకోసం ఒక తురుపుముక్కగా వాడుకోవడం అనేది వారికి చివరి అవకాశం కావొచ్చు. ఆలయం పూర్తయిపోయాక ఇంకా రాముడిగురించి ఏం చెప్పుకోగలరు? అందుకే.. ఆలయం ప్రతిపాదిత దశకు ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ.. ఈనెల 22న ప్రాణప్రతిష్ఠ చేసేస్తూ.. మాట ప్రకారం మా ప్రభుత్వ హయాంలోనే రాముడి ఆలయం నిర్మించాం అంటూ ఎన్నికల్లో ఓట్లకోసం వెళ్లడానికి వారు ప్లాన్ చేస్తున్నారనే విమర్శ కూడా ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్వయంగా కాంగ్రెస్ పార్టీ వారికి మరో ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ ను ఒక పార్టీ కార్యక్రమంలాగా నిర్వహిస్తున్నందుకు నిరసనగా తాము వెళ్లడం లేదని ఆ పార్టీ తరఫున ఆహ్వానాలు అందుకున్న ఖర్గే, సోనియా, చౌధురి ప్రకటించేశారు. వారు కార్యక్రమాన్ని దూరం పెట్టారు సరే.. ఆ వ్యవహారాన్ని బిజెపి తమ రాజకీయ ప్రయోజనానికి బాగా వాడుకుంటోంది. 

రామాలయం ద్వారా.. హిందూఓటు బ్యాంకును తమకు అనుకూలంగా పటిష్టంగా మలచుకోవడం ప్రధాన ప్రయోజనం అయితే.. కాంగ్రెసుకు హిందూ ఓట్లను దూరం చేయడం అనేది బిజెపి లక్ష్యిస్తున్న రెండో ప్రయోజనంగా కనిపిస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యేది లేదని కాంగ్రెస్ ప్రకటించిన నాటినుంచి.. కాంగ్రెస్ అంటేనే హిందూ వ్యతిరేక పార్టీ అని, వారి డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉన్నదని బిజెపి విమర్శలు చేస్తోంది.

రామాలయమే కట్టకుండా అడ్డుపడడానికి కాంగ్రెస్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం ద్వారా అడ్డుపడిందని వక్రీకరణ డైలాగులు కూడా చెబుతోంది. మొత్తానికి ఈ రామాలయం ప్రారంభం అనే రామబాణం ద్వారా ఒకేసారి రెండుపిట్టలు కొట్టబోతున్నట్టు కనిపిస్తోంది.