రాచమల్లూ.. మీకు ధైర్యముంటే ఆ పని చేయొచ్చుగా!

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా అధికారుల మీద తన దాష్టీకం చూపించారు. తాను ప్రజల మనిషిగా ప్రొజెక్టు కావడానికి ప్రయత్నించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ప్రజల కోసం నిలబడే…

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా అధికారుల మీద తన దాష్టీకం చూపించారు. తాను ప్రజల మనిషిగా ప్రొజెక్టు కావడానికి ప్రయత్నించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ప్రజల కోసం నిలబడే వ్యక్తిగా అవసరమైతే అధికారులతో పోరాడే వ్యక్తిగా గుర్తింపు కోసం తపన పడడం ఏ నాయకుడికైనా అవసరమే. అయితే రాచమల్లు అందుకు ఎంచుకున్న మార్గమే, మాట్లాడిన మాటలే అభ్యంతరకరంగా ఉన్నాయి.

ఇంతకూ ఏం జరిగిందంటే.. ప్రొద్దుటూరులో పుల్లయ్య అనే వ్యక్తి పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకువెళుతుండగా ఎక్సయిజ్, ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. అదేం పెద్ద కేసు కూడా కాదు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి పూనుకుని కాగితాలపై సంతకం పెట్టమంటే పుల్లయ్య పెట్టకుండా నిరాకరించారు. ఈలోగా పుల్లయ్య అరెస్టు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దాకా వెళ్లింది. ఆయన తన అనుచరులను బలగాన్ని వెంటబెట్టుకుని స్టేషన్ కు వచ్చేశారు.

ఎస్ఐ ఆలీబేగ్ మీద నిప్పులు చెరిగారు. ‘మద్యం కేసులు నమోదు చేస్తే రోజూ స్టేషనుకు వస్తా. ఎస్పీకి కాదు వాళ్ల బాబుకి చెప్పుకో. భయపడను. మీ చట్టాన్ని మార్చుకుంటావో లేదా ప్రభుత్వాన్ని మార్చుకుంటావో తేల్చుకో.. కేసులు పెట్టడానికి మాత్రం వీల్లేదు’’ అంటూ ఆగ్రహించారు.

చట్టం ప్రకారం ఒక వ్యక్తి మూడుకు మించి మద్యం సీసాలు తీసుకెళ్లడానికి వీల్లేదని ఎస్ఐ చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు. అదే స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఆరు మద్యం సీసాలు తీసుకెళ్లడం నేరం అంటూ కేసులు పెడుతున్నారని రెచ్చిపోయారు. ఇద్దరు ముగ్గురికి చెందిన మద్యం సీసాలను ఒకే వ్యక్తి తీసుకెళ్తే నేరమా అని ఆయన ఎస్ఐను ప్రశ్నించారు.

అంతా బాగానే ఉంది. అయితే ఎమ్మెల్యే రాచమల్లు గారు సెలవిచ్చిన కొన్ని మాటలను ప్రత్యేకంగా పట్టించుకోవాల్సి ఉంది. ‘‘మీ చట్టాన్ని మార్చుకుంటావో.. ప్రభుత్వాన్ని మార్చుకుంటావో మీ యిష్టం’’ అనడం ఏంటో అర్థం కావడం లేదు.

ప్రభుత్వాన్ని మార్చడం అనే పని ప్రజల చేతిలో ఉంటుంది గానీ.. చట్టాన్ని మార్చే పని ఎమ్మెల్యే చేతిలో ఉంటుందా? అసలు చట్టం తయారు చేయడం లేదా చట్టాన్ని మార్చడం అనేది ఎమ్మెల్యేగా తన పని అనే సంగతైనా రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి తెలుసా? అని విస్మయం కలుగుతోంది. ఎమ్మెల్యే అంటే శాసనకర్త అని.. చట్టాలను రూపొందించడానికే ప్రజలు తనను ఎన్నుకున్నారు తప్ప.. రూపొందిన చట్టాలు అమలు చేస్తున్న అధికారుల మీద దాష్టీకం చేయడానికి కాదని ఆయన తెలుసుకోవాలి.

ఎమ్మెల్యేకు అంతగా ప్రజలు అధికసంఖ్యలో మద్యం సీసాలు తీసుకెళ్లడం గురించిన శ్రద్ధ ఉంటే.. ఆయన ఎటూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే గనుక.. శాసనసభ సభ్యుడే గనుక.. సభలో ఆ పాయింట్ లేవనెత్తాలి. మూడు సీసాలకు మించి తీసుకెళ్లగూడదనే నిబంధన వల్ల అన్యాయం జరుగుతోందని ధైర్యముంటే సభలో  చెప్పాలి. ఆ చట్టాన్ని మార్పించాలి.

అది చేతకాకుండా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ రూపొందించిన చట్టాలనే అమలు చేస్తున్న అధికారుల మీద ఎగిరితే ఎలాగ? తమ అనుచరులైన వారి మీద కేసులు నమోదు కాకుండా కాపాడుకుంటున్నాం అని ఆయన అనుకోవచ్చు గానీ.. ఇలాంటి దందాల వల్ల ప్రజల్లో తన పరువు పోతుందని ఆయన తెలుసుకోకపోతే ఎలాగ?