అచ్చెన్నకు ప్రత్యర్ధి ఆయనే….!

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడుకు ప్రత్యర్ధిగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెడీ అయిపోయారు. ఆయన పేరుని వైసీపీ మూడవ విడత జాబితాలో ప్రకటించింది. ఇప్పటిదాకా చూస్తే దువ్వాడ సతీమణి వాణి టెక్కలి…

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడుకు ప్రత్యర్ధిగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెడీ అయిపోయారు. ఆయన పేరుని వైసీపీ మూడవ విడత జాబితాలో ప్రకటించింది. ఇప్పటిదాకా చూస్తే దువ్వాడ సతీమణి వాణి టెక్కలి ఇంచార్జిగా ఉన్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ శ్రీనివాస్ ని వ్యూహాత్మకంగా వైసీపీ రంగంలోకి తెచ్చింది.

కింజరాపు కుటుంబం మీద ఒంటికాలు మీద లేచే దువ్వాడ మాత్రమే అచ్చెన్న మీద పోటీకి కరెక్ట్ అని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది. టెక్కలిలో వర్గ పోరు ఉంది. పేరాడ తిలక్ ప్రత్యేక వర్గంగా ఉంటున్నారు. ఈ సమస్యను తీర్చేందుకు ఆయనకు శ్రీకాకుళం ఎంపీ సీటు ఇచ్చారు. అక్కడ నుంచి ఆయన పోటీకి సిద్ధంగా ఉంటారని తెలుస్తోంది. అలా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా అచ్చెన్న విజయాన్ని ఈసారి బ్రేక్ చేసి టెక్కలిలో గెలుపు బావుటా ఎగరవేయాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

టెక్కలిలో ఎక్కువగా కాళింగ సామాజిక వర్గం ఉంది. అనేక సార్లు వారి నుంచే ఎమ్మెల్యేలు వచ్చారు అయితే 2009 తరువాత పరిస్థితి మారింది. అచ్చెన్న పాత నియోజకవర్గంలో కొంత భాగం టెక్కలిలో కలవడంతో కింజరాపు కుటుంబం హవా కనిపిస్తోంది.

దానికి తోడు వైసీపీ వర్గ పోరు వల్ల కూడా టీడీపీ గెలుస్తోంది. 2019లో అచ్చెన్న కేవలం ఎనిమిది వేల ఓట్ల తేడాతోనే గెలిచారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా వైసీపీ వర్గ పోరుకు స్వస్తి పలికేలా పేరాడ, దువ్వాడ వర్గాలను ఏకం చేసింది ఆ పార్టీ అధినాయకత్వం. దాంతో టెక్కలిలో అచ్చెన్నకు దువ్వాడ బలమైన ప్రత్యర్ధిగా ముందుకు రాబోతున్నారు.