వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. ఇందులో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు. ముఖ్యంగా ఒకే ఒక్క వైసీపీ అభ్యర్థి మార్పు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యేగా బదిలీ చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం వైసీపీ శ్రేణులకు షాక్ నుంచి బయట పడడానికి కొంత సమయం పట్టొచ్చు.
తిరుపతి లోక్‌సభ పరిధిలో సత్యవేడు నియోజకవర్గం వుంటుంది. సత్యవేడులో ఆదిమూలానికి వ్యతిరేకత వుందనే ఉద్దేశంతో ఆయనకు జగన్ ప్రమోషన్ కల్పించారని సొంత పార్టీ శ్రేణులు సెటైర్ విసురుతున్నాయి. సత్యవేడు నుంచి తప్పించకండి మహాప్రభూ అని ఆదిమూలం కొంత కాలంగా సీఎం జగన్ మొదలుకుని, ఆ పార్టీ చిన్నాపెద్దా నాయకులను వేడుకుంటున్నారు. కానీ ఆయన్ని తప్పించి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.
ఇక తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి విషయానికి వద్దాం. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తి రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికలో తిరుపతి ఎంపీగా గురుమూర్తి గెలుపొందారు. తక్కువ సమయంలోనే గతంలో ఏ ఎంపీ చేయని విధంగా తన లోక్‌సభ పరిధిలో అభివృద్ధి పనులు చేశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా పనులు చేసేందుకు శ్రమించారు.
తిరుపతి అనేది ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు సుమారు రూ.400 కోట్లు కేంద్రం ద్వారా మంజూరు చేయించారు. ప్రస్తుతం తిరుపతి రైల్వేస్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే తిరుపతి బస్టాండ్‌ను రూ.400 కోట్లతో ఇంటర్ మోడల్ బస్టాండ్‌గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయించారు. టెండర్లు కూడా పూర్తయ్యాయి. పనులు మొదలు పెట్టాల్సి వుంది. ఇటీవల దేశంలోనే సెమీ కండక్టర్స్ తయారు చేసే ఏకైక కేంద్రం నైలెట్ కేంద్రం మంజూరుకు నిధులు మంజూరు చేయించారు.
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ఎమ్మార్వో (మెయిన్‌టెన్స్ రిపేర్ అండ్ ఓవరాలింగ్) ఏర్పాటుకు కృషి చేశారు. ప్రస్తుతం ఇది టెండర్ల వరకూ వచ్చింది. అలాగే తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పులికాట్ ముఖద్వారం పూడికతీతకు కేంద్రం నుంచి రూ.100 కోట్లు నిధులు మంజూరు చేయించారు. దీనివల్ల మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం, వెంకటగిరి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించారు.
వెంకటగిరి మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు టెండర్ల దశ వరకూ తీసుకొచ్చారు. తిరుపతిలో హీరోహోండా షో రూం సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు, సీఆర్ఎస్ వద్ద అండర్ బ్రిడ్జి, తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రూ.80 లక్షల నిధులు మంజూరు చేయించారు. అలాగే తిరుపతి ఎయిర్‌పోర్టులో తిరుమలకు వెళ్లే భక్తుల కోసం శ్రీవాణి కౌంటర్ ఏర్పాటు చేయించారు. ఇటీవల దీన్ని టీటీడీ అధికారులు తిరిగి తిరుమలకు తరలించారు. అలాగే విశ్వ విద్యాలయాల అభివృద్ధికి కేంద్ర నుంచి నిధులు మంజూరు చేయించారు.
వివాద రహితుడిగా, అభివృద్ధి కోసం నిత్యం పరితపించే వైసీపీ ఎంపీగా గురుమూర్తికి మంచి పేరు వుంది. ప్రజాహిత పనుల కోసం ఎవరు వెళ్లినా అభిమానంతో అక్కున చేర్చుకుని, వారిని సంతృప్తిపరిచేలా వ్యవహరిస్తారనే పేరు ఆయన సొంతం. మంచి పనిమంతుడిగా పేరున్న గురుమూర్తిని తప్పించి, సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం అంటే… ఏనుగును గాటికి కట్టేయడం లాంటిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తిరుపతి ఎంపీని సత్యవేడుకు పంపాలన్న వైసీపీ నిర్ణయంతో …ఆ నియోజక వర్గ ప్రజలు త్రివిక్రమ్ డైలాగ్స్‌ను గుర్తు తెచ్చుకుంటున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం గురించి ఒక సభలో త్రివిక్రమ్ ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పారు.
“అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా? అనే ఒక్క మాటతో లేచి రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నాను. ఎక్కడికి వెళుతున్నానో కూడా నాకు తెలియదు” అని త్రివిక్రమ్ భావావేశంతో చెప్పడం తెలిసిందే. వైసీపీ తాజాగా 21 మంది అభ్యర్థులతో మూడో జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆ ఒక్క వైసీపీ అభ్యర్థి ప్రకటనతో రెండు చేతులూ జేబులో పెట్టుకుని ఎటూ నడుచుకుంటూ వెళ్లిపోతున్నట్టుగా ఉందని అక్కడి ప్రజానీకం అంటున్నారు.
ఇంత పనికి మాలిన మార్పు చూసిన తర్వాత వైసీపీ గురించి ఏం మాట్లాడాలో, అసలు ఆ పార్టీ ఎటు పయనిస్తున్నదో, చివరికి ఏ గమ్యం చేరుతుందో తెలియకుండా వుందని అధికార పార్టీ శ్రేణులతో పాటు తటస్థులు కూడా వాపోతున్నారు. ఒక మంచి ఎంపీని అన్యాయంగా బలి చేశారన్న భావన, ఆవేదన తిరుపతి ప్రజానీకంలో వుందంటే అతిశయోక్తి కాదు.