విశాఖ ఎంపీ సీటు అంటే అయితే కమ్మ లేకపోతే రెడ్డి అన్నట్లుగా ఫిక్స్ అయింది. దాదాపుగా మూడున్నర దశాబ్దాల కాలం పాటు చూస్తే అందులో ఎనిమిదేళ్ళ పాటు రెడ్లు ఎంపీలుగా ఉంటే మిగిలిన కాలమంతా కమ్మ వారే ఎంపీలుగా ఉన్నారు. పైగా విశాఖ ఎంపీ సీటు నాన్ లోకల్ కోసం అన్నట్లుగా అనధికారికంగా రిజర్వ్ చేయబడింది. ఎక్కడ నుంచో వచ్చిన వారు కూడా విశాఖ ఎంపీ సీటు కోసం ట్రై చేయడం రాజకీయ విడ్డూరంగా మారిపోయింది.
దాన్ని బ్రేక్ చేయడానికి వైసీపీ సామాజిక అస్త్రాన్ని ప్రయోగించింది. పైగా పక్కా లోకల్ క్యాండిడేట్ ని కూడా విశాఖ నుంచి ఈసారి ఎంపీగా పోటీకి దించుతోంది. ఆమె బొత్స ఝాన్సీలక్ష్మి. ఆమె మాజీ ఎంపీ. ఒకసారి బొబ్బిలి నుంచి మరోసారి విజయనగరం నుంచి ఎంపీగా గెలిచిన ఝాన్సీ 2001 నుంచి 2006 వరకూ అయిదేళ్ల పాటు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు.
ఆమె విజయనగరం ఎంపీగా ఉన్నపుడు ఉత్తర పార్లమెంటేరియన్ అవార్డుని అందుకున్నారు. ఏయూ నుంచి డాక్టరేట్ పట్టాను అందుకున్న ఝాన్సీలక్ష్మి విశాఖ వాస్తవ్యురాలు. విశాఖ సీటు కోసం ఎక్కడ నుంచో వచ్చిన వారికి ఆమె పోటీ ఒక సమాధానం అవుతుంది అని వైసీపీ భావిస్తోంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా ఆమె విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేయడం వైసీపీ మరో వ్యూహం. 1980లో కొమ్మూరు అప్పలస్వామి విశాఖ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన తొలి చివరి బీసీ నేత. ఆ తరువాత మళ్లీ ఎవరూ నెగ్గలేదు. సీటు కూడా రాజకీయ పార్టీలు బీసీ నేతలు ఎవరికీ ఇవ్వలేదు. ఇపుడు బొత్స ఝాన్సీలక్ష్మిని అభ్యర్థిగా నిలబెట్టి వైసీపీ అన్ని పార్టీలకు సరికొత్త దారిని చూపించింది. సవాల్ ని కూడా విసిరింది.