ఏపీ కాంగ్రెస్-షర్మిల గురించి ఆయనకెందుకు?

వైఎస్ షర్మిలకు అసలు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడమే కరెక్టు కాదట. ఎందుకంటే- ఆమె తెలంగాణ బిడ్డ అట. తాను తెలంగాణ బిడ్డని అని చెప్పుకుని తెలంగాణలో తిరిగినందున.. ఆమె ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో…

వైఎస్ షర్మిలకు అసలు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడమే కరెక్టు కాదట. ఎందుకంటే- ఆమె తెలంగాణ బిడ్డ అట. తాను తెలంగాణ బిడ్డని అని చెప్పుకుని తెలంగాణలో తిరిగినందున.. ఆమె ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పనిచేయడానికి పనికిరారని మాజీ ఎంపీ హర్షకుమార్ అంటున్నారు.

తెలంగాణలో నిరాదరణకు గురైన షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాలకు ఎలా పనికివస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నలు, కోరికలు సబబో కాదో తర్వాతి సంగతి.. అసలు ఏపీ కాంగ్రెస్ పార్టీ గురించి, షర్మిల ఆ పార్టీలో చేరి సాగించబోతున్న కొత్త ప్రస్థానం గురించి.. ఈ మాజీ ఎంపీ హర్షకుమార్ కు ఎందుకు? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

హర్షకుమార్ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని అడిగితే తటాల్న సమాధానం చెప్పడం కష్టం. 2004, 2009 లలో రెండుసార్లు వైఎస్ హయాంలో అమలాపురం నుంచి ఎంపీగా గెలిచిన హర్షకుమార్.. చాలామంది లాగానే అప్పట్లో సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరించారు. కానీ రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలం అయ్యారు. అప్పటికి వేరే గతిలేదు.

కాంగ్రెస్ టికెట్ మీద ఏపీలో పోటీచేస్తే పుట్టగతులు ఉండవని ఆయనకు తెలుసు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన సమైక్యాంద్ర పార్టీ తరఫున చెప్పు గుర్తుపై ఎంపీగా పోటీచేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరించిన నాయకుడిగా పేరున్నా.. సిటింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా.. ఆయనకు కేవలం 9వేల ఓట్లు వచ్చాయి. అప్పటినుంచి ఆయన రాజకీయ జీవితం అస్థిరంగానే ఉంది.

హర్షకుమార్.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతారని కొంతకాలం పుకార్లు వచ్చాయి. తర్వాత తెలుగుదేశం వైపు మొగ్గుతున్నట్టు కూడా పుకార్లు వచ్చాయి. చంద్రబాబుతో మంతనాలు కూడా సాగించినట్టుగా.. అయితే అమలాపురం ఎంపీ టికెట్ 2019 ఎన్నికల నాటికి ఇవ్వలేం అని చంద్రబాబు చెప్పినట్టుగా వినిపించింది. దాంతో ఆయన తెలుగుదేశంలో చేరడం అనే లాంఛనం జరగలేదు. అలాగని కాంగ్రెస్ లో చేరిన దాఖలాలు కూడా లేవు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడిగా ముద్ర మిగిలిపోయింది అంతే!

అలా తనకంటూ ఒక పార్టీ కూడా లేని ఈ హర్షకుమార్.. అసలు ఏపీ కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? అధిష్ఠానానికి ఎందుకు సలహాలు ఇస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఆ పార్టీకి సారథిగా షర్మిల అయితే ఏంటి? మరొకరు అయితే ఏంటి? ఆయన కెందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా మళ్లీ పోటీచేస్తానని అంటున్న హర్షకుమార్.. ‘ఏ పార్టీ తరఫున?’ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.