చట్టసభలలో నికార్సయిన ప్రజాగళం వినిపించాల్సిన అవసరం చాలా ఉంటుంది. రాజకీయ పార్టీల సమీకరణాలే కొలబద్ధలుగా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యే వాతావరణంలో ఎక్కువ మంది నుంచి అలాంటి ఫలితం ఆశించలేం. శాసనమండలిలో అప్పుడప్పుడూ అయినా ఇలాంటి నేతలు కనిపించాలనే ఆశ సాధారణంగా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ శాసనమండలికి రెండుస్థానాలకు ఎమ్మెల్యేల కోటాలో జరగబోతున్న ఎన్నికల్లో అలాంటి అవకాశం వస్తుందని, ప్రొఫెసర్ కోదండరాం మండలిలో అడుగుపెట్టవచ్చునని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయకుల్లో ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. అప్పటి తెరాస సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కేవలం సొంత రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమాన్ని కూడా హైజాక్ చేస్తున్న సమయంలో.. ప్రొఫెసర్ కోదండరాం ఐకాస సారధిగా ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు.
అప్పట్లో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కూడా అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీతో కూడా సమన్వయం చేసుకుంటూ, ఉద్యమకారుల సంఘాలన్నింటితో కూడా నిరంతరం టచ్ లో ఉంటూ కాంగ్రెస్ నుంచి అనుకూల నిర్ణయం వచ్చేలా ఎంతో పాటుపడ్డారు. వ్యూహాత్మక ఒత్తిడి, కాంగ్రెస్ ను ఒప్పించడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది.
అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఆయనకు తెరాస సర్కారు నుంచి ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. కేసీఆర్, కోదండరాంను పూర్తిగా పక్కన పెట్టారు. రిటైరైన తర్వాత కోదండరాం తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి కొంత పోరాడారు గానీ.. సాధించిన ప్రజాదరణ మాత్రం శూన్యం. కాంగ్రెసు మద్దతుతో పోటీచేసిన సందర్భంలో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. అయితే తెలంగాణ పట్ల ఆయన శ్రద్ధ, కమిట్మెంట్ మాత్రం మారలేదు. గత ఎన్నికల్లో ఆయన తన పార్టీని పూర్తిగా పోటీచేయించకుండా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక దానిని ప్రొఫెసర్ కు కేటాయించవచ్చునని ప్రచారం జరుగుతోంది. పైగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న రెండు స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ అయినందున.. రెండింటినీ కూడా కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఏకగ్రీవం అయినా కూడా ఆశ్చర్యం లేదు. అందువల్ల ఒకటి ప్రొఫెసర్ కు ఇవ్వడం ఇబ్బంది కాదు. ఆయన రెండు రోజుల కిందట తెలంగాణ పీసీసీ వ్యవహారాల ఇన్చార్జి దీప్దాస్ మున్షీని కూడా కలిశారు. ఆయనకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టడం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
నిజానికి ఎమ్మెల్సీ పదవి అనేది కోదండరాం విషయంలో పెద్ద ఆఫరేమీ కాదు గానీ.. ఆయన సభాప్రవేశం చేసిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెడతారా? ఆయన సేవల్ని ప్రభుత్వానికి వినియోగించుకుంటారా? లేదా? అనేది వేచిచూడాలి.