తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని పెద్దలు చెప్పారు. ఆలస్యంగా అయినా కాపులంతా మేల్కొంటున్నారు. కలిసి వుంటే కలదు సుఖం.. విడిపోతే దుఃఖం అని వారు గ్రహించారు. అందుకే తమలో విభేదాలను మరిచి రాజకీయంగా చేతులు కలపడానికి కాపు నాయకులంతా ముందుకు రావడం ఆ సామాజిక వర్గానికి సంతోషం కలిగించే అంశం. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కాపులంతా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. అయినా అధికారాన్ని దక్కించుకోలేకపోయారు.
తెలుగు సమాజంలో తక్కువ జనాభా కలిగిన రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. బీసీల తర్వాత తెలుగు రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా తమకుందని కాపు, బలిజ, వాటి అనుబంధ కులాల నాయకుల వాదన. ఇందులో నిజం లేకపోలేదు. అయితే ఇదంతా ఐక్యంగా ఉంటేనే సాధ్యం. రకరకాల కారణాల వల్ల కాపులు రాజకీయంగా విడిపోయి వున్నారు. ఉదాహరణకు రాయలసీమలో బలిజలు మొదటి నుంచి టీడీపీతో ఉన్నారు. ఇప్పుడూ అదే పరంపర సాగుతోంది. నాడు కాంగ్రెస్‌కు, నేడు వైసీపీకి రాయలసీమలో మెజార్టీ బలిజలు వ్యతిరేకమే. సీమలో వైసీపీని నిలువరించే సత్తా బలిజలకు లేదు.
ఇదే కోస్తా ప్రాంతానికి వెళితే టీడీపీకి కాపులు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. రంగా హత్యతో కమ్మ సామాజిక వర్గంపై కాపులు రగిలిపోతున్నారు. కాలం మారినా, వారి గాయాల్ని మాత్రం మాన్పలేకపోతోంది. ఈ నేపథ్యంలో కమ్మలపై కాపుల ఆగ్రాహవేశాల్ని చల్లార్చి, టీడీపీకి కొమ్ము కాసేలా చేయడానికి జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా 2014లో కాపులపై రిజర్వేషన్ వలను వేశారు.
చంద్రబాబు కథ తెలిసిందే. కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేదు. 2014లో తమకు రిజర్వేషన్ ఇస్తామన్న హామీని నెరవేర్చాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఆ సామాజిక వర్గం రాష్ట్రమంతా ఉద్యమించింది. ఆమరణ దీక్ష చేపట్టిన ముద్రగడపై టీడీపీ ప్రభుత్వం కర్కశంగా ప్రవర్తించింది. తన భార్య, కోడల్ని లం…అంటూ చంద్రబాబు ప్రభుత్వం తిట్టిందని అనేక సందర్భాల్లో ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీకి ముద్రగడ మద్దతు ఇస్తే కాపుల్లో చీలిక వచ్చి రాజకీయంగా నష్టం వస్తుందని ఆ సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న పవన్‌కల్యాణ్ ఆందోళన చెందారు. ఎలాగైతేనేం ముద్రగడ మనసు నుంచి వైసీపీని తీసేయించారనే వార్తలొస్తున్నాయి. కాపుల పార్టీగా గుర్తింపు పొందిన జనసేనలోకి ముద్రగడ చేరేందుకు రంగం సిద్ధమైంది. కాపులకు ఇంత కాలం పెద్ద దిక్కుగా ఉన్న ముద్రగడను నేరుగా కలిసేందుకు పవన్‌కల్యాణ్ ఒకట్రెండు రోజుల్లో వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.
రాజకీయంగా కాపుల కోణంలో చూస్తే… ఈ పరిణామాలు ఆ సామాజిక వర్గానికి మేలు చేసేవే. ఇదే సందర్భంలో టీడీపీకి ప్రమాదం పొంచి వుందనే చర్చకు తెరలేచింది. కాపులంతా టీడీపీ, జనసేన వెంట నడుస్తున్నారంటే, బీసీలు వైసీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు ఎటూ వైసీపీ వైపే ఉన్నారు. టీడీపీకి బీసీలు వెన్నెముక అంటుంటారు.
రాజకీయాల్లో ఎప్పుడూ 1+1=2 కాదనే సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. కాపులకు రాజ్యాధికారం కావాలనే కోరిక వారిలో చాలా బలంగా వుంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబే సీఎం అవుతారని ఆయన తనయుడు లోకేశ్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. లోకేశ్ మాటలు కాపుల మనసుల్లో అగ్గి రగిల్చాయి. కానీ వారంతా ప్రస్తుతానికి వ్యూహాత్మకంగా వున్నట్టు కనిపిస్తోంది.
కాపులంతా చేతులు కలుపుతున్నది చంద్రబాబును సీఎం చేయడానికే అని అనుకోలేం. ఎందుకంటే బాబుపై పవన్‌కు ప్రేమ వుండొచ్చు. కానీ ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య, ఇలా ఏ కాపు నాయకుడిని అడిగినా తమ కులపోడైన పవనే సీఎం కావాలని చెబుతున్నారు. తాజా కాపుల ఐక్యతను చూస్తే, రాజకీయంగా పద్యవ్యూహం రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది.
కాపులంతా ఐక్యతను చాటి, పవన్ బలాన్ని పెంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కోరుకున్నన్ని సీట్లు ఇవ్వకపోతే, కాపులంతా ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసినా, ఒంటరిగానే 20కి గెలుచుకోవచ్చనే చర్చ తెరపైకి వచ్చింది. అప్పుడు చంద్రబాబు చచ్చినట్టు జనసేనకు మద్దతు ఇవ్వక తప్పని సరి పరిస్థితి ఏర్పడుతుందనే ఆలోచన కాపు నేతల్లో వుంది.
పొత్తులో చూసుకున్నా ఇరుపార్టీల నుంచి కాపులకు ఎక్కువ సీట్లు సాధించుకుని, చట్టసభలో అడుగు పెడితే పవన్‌ను సీఎం చేసుకోవచ్చని వారు అంటున్నారు. ఏది ఏమైనా ఎక్కువ మంది కాపులను గెలిపించుకుంటే, రాజ్యాధికారాన్ని దక్కించుకోవచ్చనే స్పష్టమైన వ్యూహంతో ఆ సామాజిక వర్గం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని చెప్పొచ్చు. మరోవైపు కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబుకు పట్టు తగ్గుతోంది. ఎన్టీఆర్ కుటుంబం నుంచి కూడా ఆయనకు తగిన మద్దతు లేదు.
ప్రజాకర్షణ కలిగిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. అలాగే కమ్మ రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా ఆయనకు దూరమవుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు గల్లా జయదేవ్ ఏకంగా రాజకీయాల నుంచి విరమించగా, కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకున్నారు. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి ఆయన బరిలో దిగడం గమనార్హం.
పవన్‌తో విభేదాలు పక్కన పెట్టి కాపులంతా ఏకం కావడం రాజకీయంగా చంద్రబాబుకు ప్రమాద సంకేతాలే. ఒకప్పటిలా చంద్రబాబు ఎవరినైనా మోసగిస్తారనుకుంటే అది పొరపాటే. బాబు కుట్రలు, కుతంత్రాలు అందరికీ తెలిసిపోయాయి. ఆయనతో రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలుపుతున్నారు. ఇందుకు ముద్రగడ పద్మనాభమే ఉదాహరణ.
రానున్న రోజుల్లో కాపులను అత్యధికంగా గెలిపించుకునే ఎత్తుగడలో భాగంగానే చంద్రబాబుతో జత కడుతున్నారు. ఇదంతా గెలిచే వరకే. ఆ తర్వాత నిర్ణయాలు వేరే వుంటాయి. కాపులంతా ఏకమవుతుంటే, రాజకీయంగా తమకు లాభిస్తుందని టీడీపీ శ్రేణులు సంబరపడుతుండొచ్చు. కానీ జరగబోయే ప్రమాదం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే కాపుల పద్మ వ్యూహంలో చంద్రబాబు ఇరుక్కున్నారు. ఇప్పుడు బయట పడడం అంత సులువుకాదు.