ఏ పార్టీకైనా అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకం. ఈ విషయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో గెలవడమే ఏకైక లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు. కానీ టీడీపీ-జనసేన కూటమి మాత్రం అభ్యర్థుల ఎంపికలో తీవ్రమైన నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తోంది. ఎందుకిలా జరుగుతున్నదో కనీసం ఆ పార్టీల నేతలకైనా అర్థమవుతున్నదో, లేదో తెలియడం లేదు.
సంక్రాంతికి టీడీపీ జాబితా వెలువడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే సంక్రాంతికి కేవలం 25 మందితో తొలి జాబితా వెలువడుతుందని ఎల్లో మీడియా చావు కబురు చల్లగా చెప్పడం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేస్తే ప్రచారం చేసుకోడానికి సమయం దొరుకుతుంది.
అలా కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజు అభ్యర్థులను ప్రకటిస్తే రాజకీయంగా నష్టం తప్ప, ఒరిగేదేమీ వుండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం 25 మందితో సంక్రాంతికి తొలి జాబితా వెలువడితే, ఇక జనసేన టికెట్లు, సీట్ల సంగతి తేల్చెదెప్పుడు? పవన్‌కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించేదెన్నడు? అనే చర్చకు తెరలేచింది. ఇలాగైతే జనసేన అభ్యర్థుల జాబితా ఉగాదికి వెలువడే అవకాశాలున్నాయనే సెటైర్స్ వెల్లువెత్తడం గమనార్హం. జనసేన సీట్లు, నియోజక వర్గాల విషయమై పవన్‌కు చంద్రబాబు సినిమా చూపుతున్నారనే చర్చకు తెరలేచింది.
సరైన అభ్యర్థులు లేకపోవడం, వైసీపీ నుంచి ఎవరైనా వస్తారనే ఆశతో ఎదురు చూడడం వల్లే టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా వెల్లడి ఆలస్యం అవుతోందన్న అనుమానం లేకపోలేదు. చంద్రబాబు నాన్చివేత ధోరణే టీడీపీకి ప్రధాన శత్రువనే భావన ఆ పార్టీ నేతల్లో వుంది. ఎప్పట్లాగే అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు తీవ్ర జాప్యం చేస్తున్నారు.
నామినేషన్ల వరకూ సీట్ల సంగతి తేల్చకుండా, చివరల్లో ఎన్నోకొన్ని ఇచ్చి పవన్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తారనే ఆందోళన జనసేన నేతల్లో లేకపోలేదు ఇక్కడే జనసేనలో ఓ అనుమానం. లోలోపల తన పార్టీ అభ్యర్థులపై బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, కేవలం జనసేనకు అరకొరా సీట్లు ఇచ్చేందుకే డ్రామా ఆడుతున్నారని ఆ పార్టీ నేతలు సందేహిస్తున్నారు. సీట్ల సంగతి తేల్చాలని పవన్ పట్టు పట్టకపోతే మాత్రం, చివరికి మోసపోయామని ఏడ్వాల్సి వస్తుందని జనసేన నేతలు అంటున్నారు.
నామినేషన్ల సమయం వరకూ జనసేనకు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇస్తారో తేల్చకపోతే, పవన్‌కల్యాణ్ తక్కువ సమయంలో ఏం చేస్తారనే ప్రశ్న ఆందోళన ఆ పార్టీలో మొదలైంది. ఇంకా తమ పార్టీ సీట్లు, అభ్యర్థులపై కూడా క్లారిటీ లేదని, రెండింటివి ఒకేసారి చేద్దామనే మాయ మాటలతో తమను మభ్యపెడుతున్నారని జనసేన వాపోతోంది. ఏది ఏమైనా సీట్ల విషయంలో పవన్‌కు చివరికి మిగిలేది కన్నీళ్లే అనే చర్చకు తెరలేచింది.