కేసీఆర్ అంటేనే మోనార్క్ వైఖరికి నిదర్శనం. పదేళ్ల పాలనను ఆయన అదేరీతిలోనే సాగించారు. వారసుడిగా కొడుకును సీఎం పీఠం మీద ప్రతిష్ఠించేసి.. హస్తిన రాజకీయాల్లో చక్రం తిప్పాలనే అతిపెద్ద కలతో ఆయన తన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్రసమితిగా మార్చేశారు.
నిజానికి భారాస పేరుతో కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన సాగినప్పటికీ, చివరికి తెలంగాణ రాష్ట్ర సమితి పేరే అలా మారింది. ఈ నిర్ణయం వల్ల పార్టీ పేరులో ఉండే తెలంగాణ స్ఫూర్తి దెబ్బతిన్నదని కార్యకర్తలు అనేకమంది అనుకున్నారు.
కానీ.. కేసీఆర్ పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత.. పోస్టుమార్టంతో పాటు, లోక్ సభ ఎన్నికలకు సిద్ధం చేసే సన్నాహక సమావేశాల్లో కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కార్యకర్తలు అనేక మంది పార్టీ పేరును తిరిగి తెరాసగా మార్చాలని అంటున్నారు. మరి ఈ హితవాక్యములను కేసీఆర్ చెవికి ఎక్కించుకుంటారా? అనేది పెద్ద ప్రశ్న.
లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కేసీఆర్ సమకాలికుడు, సీనియర్ నాయకుడు.. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలిచిన కడియం శ్రీహరి ఇదే సలహాను చాలా ఘాటుగానే వినిపించారు. తెలంగాణ అనే పదాన్ని పార్టీ పేరులోంచి తొలగించడం ద్వారా.. పార్టీ అస్తిత్వానే తామే నాశనం చేసుకున్నట్టుగా ఆయన వేదిక మీద నుంచే అభిప్రాయం వెల్లడించినట్టు తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండే 1-2 శాతం ఓటుబ్యాంకు తమకు దూరమైనా సరే.. అది ఫలితం మీద ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు.
నిజానికి ఇది కడియం ఒక్కరి మాట కాదు. ఇన్నాళ్లూ కేసీఆర్ వైఖరి తెలిసిన వారెవ్వరూ కనీసం తమ తమ అభిప్రాయాలను వినిపించడానికైనా అంతగా ఉత్సాహం చూపించే వారు కాదేమో. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత.. ముందుకు వచ్చి ధైర్యంగానే అభిప్రాయం చెబుతున్నారు. కావాలంటే జాతీయ రాజకీయాల కోసం కొత్తగా ఒక పార్టీ పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఒక సారి కేంద్రమంత్రిగా వైభవం వెలగబెట్టిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో తన ముద్ర చూపించాలనే తపనతో తహతహలాడిపోతున్నారు. అయితే.. విపక్ష కూటమి ఆయనను దరిజేర్చటం లేదు. భాజపాకు బీ టీమ్ గా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి మాత్రమే ఆయన జాతీయ పార్టీ డ్రామా నడిపిస్తున్నారనే విమర్శను దూరం చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారాస పేరు ఆయనకు సొంత రాష్ట్రంలో కూడా నష్టమే చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో పేరు భారాస అని ఉండినప్పటికీ.. పార్లమెంటు ఎన్నికల సమయానికి ఆయన తెలంగాణలో మెజారిటీ సీట్లను దక్కించుకోవడం మీదనే దృష్టి పెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఓడిన తర్వాత.. ఎంపీ ఎన్నికలను పూర్తిగా వారసుల మీద వదిలేసి.. ఆయన దేశమంతా రాజకీయం చేస్తానని భారాస యాక్టివిటీ పెంచడానికి సమయం ఇవ్వలేకపోవచ్చు. అలా జరిగితే తెలంగాణలో పార్టీకి ఆత్మహత్యాసదృశం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పేరు మార్పుపై యూటర్న్ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి.