జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్

“సో బ్యూటిఫుల్- సో ఎలిగెంట్- జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్” అని ఈ మధ్యన వైరల్ అయిన ఒక షార్ట్ వీడియో ఉంది.. Advertisement ప్రస్తుత ఆంధ్ర రాజకీయాల పరిస్థితి చూస్తూ బాధపడేకంటే…

“సో బ్యూటిఫుల్- సో ఎలిగెంట్- జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్” అని ఈ మధ్యన వైరల్ అయిన ఒక షార్ట్ వీడియో ఉంది..

ప్రస్తుత ఆంధ్ర రాజకీయాల పరిస్థితి చూస్తూ బాధపడేకంటే నవ్వుతూ ఆ వాక్యాన్ని అనేసుకోవడమే నయమనిస్తోంది. 

కేశినేని నానిని మొన్నటి వరకు వైకాపా వారు బస్సుల దొంగ అన్నారు. ఇప్పుడు తెదేపాతో తెగతెంపులు చేసుకుని వైకాపా గూట్లో చేరారు కనుక ఆయన ఇప్పుడు ధర్మం కోసం తిరుగుబాటు చేసిన సచ్చీలుడైన నాయకుడుగా కనిపిస్తున్నారు వారికి. మరోపక్క తెదేపాకు చెందిన సోషల్ మీడియా జనం మాత్రం కేశినేని కమ్మజాతికే అవమానం అంటూ పోస్టులు పెడుతున్నారు. 

అందరికీ తెలిసిన విషయం రాజకీయాలకి, కులాలకి విడదీయలేని సంబంధముంటుందని. అయితే ఇప్పుడు కమ్మ నాయకులు కొందరు వైకాపాలో చేరారు. అలాగే ఒంగోలుకి, నెల్లూరుకి చెందిన రెడ్లు తెదేపాలో చేరుతున్నారు. కమ్మ నాయకుల్ని చంద్రబాబు నిలబెట్టుకోలేక పోతున్నారు. రెడ్డి నాయకుల్ని జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేకపోతున్నారు! ఇంకెందుకు కమ్మ పార్టీ, రెడ్ల పార్టీ అని జనాలు బ్రాండ్ చేయడం? 

నిజానికి కేశినేని ప్రస్థానం చూస్తే తొలుత చిరంజీవికి హగ్గిచ్చి ప్రజారాజ్యంలో చేరారు. తర్వాత చంద్రబాబుకి కౌగిలిచ్చి తెదేపాలో గడిపారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకుని వైకాపాలో చేరారు. 

అందుకే అనాలనిపిస్తుంది- “”సో బ్యూటిఫుల్- సో ఎలిగెంట్- జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్” అని.

అలాగే మొన్నటి వరకు తేదేపా వారికి వైకపా కండువా కప్పుకున్న అంబటి రాయుడుని చూస్తే చిరాకు. జనసేన వారైతే అసలతను కాపే కాదంటూ ట్రోలింగులు చేసారు. ఇప్పుడు వైకాపాని వదిలేసి జనసేనలో చేరుతున్నాడు కనుక ఆయన నిఖార్సైన కాపు! తమ పార్టీకి ఆశాకిరణం. 

ఇక షర్మిల సంగతి చెప్పక్కర్లేదు. ఆమెను రకరకాలుగా ట్రోలింగు చేసి, అవమానించి బాధపెట్టిన పార్టీకి మిత్రపక్షంగా ఉందామె. రాజకీయ మనుగడ కోసం ఆమె ఆ నిర్ణయం తీసుకుంటే గతంలో ఆమె పక్షాన ఎమోషనల్ గా ఫీలయ్యి అండగా నిలిచిన జనం ఇప్పుడు ఎలా రియాక్టవ్వాలి?

ఏముందీ- “సో బ్యూటిఫుల్- సో ఎలిగెంట్- జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్” అనుకోవడమే. 

ఇదిలా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా తన బాధని మనముందుంచారు. 30-40కోట్లు ఖర్చు పెడితే తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదని, ఓడితే మొత్తం పోయినట్టే అని, గెలిచినా గతంలోలాగ సంపాదించుకునే పరిస్థితులు ఇప్పుడు లేవని తేల్చేసారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కేవలం ఉత్సవ విగ్రహాలని, సంపాదించుకునే అసలు మూలవిరాట్టులు పార్టీ అధినేతలని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ పరిస్థితి సింగిల్ మ్యాన్ షోగా నడిచే పార్టీల్లోనే ఉందని చెప్పుకొచ్చారు. 

ఈ విషయాన్ని కాస్త విపులంగా చెప్పుకోవాలి. 

ఐ-పాక్ లాంటి సంస్థలొచ్చి రాజకీయాలకి, ఎన్నికలకి కార్పొరేట్ రంగు పులిమాయి. 

ఉదాహరణకి ఒక వ్యక్తి ఎమ్మెల్యే గా నిలబడదలచుకుంటే అతని అభ్యర్థిత్వానికి జనంలో సానుకూలత ఉందో లేదో చూస్తారు. అందులో పాసైతే రూ 30 కోట్లు- రూ 50 కోట్ల వరకు ముందుగానే పార్టీ అధినేత వద్ద డిపాజిట్ చెయమంటారు. ఆ మొత్తాన్ని ఎక్కడో ఎవ్వరికీ తెలియని చోట దాచి పెడతారు. ఎన్నికల ముందు దాని అడ్రెస్ చెప్పి తీసుకుని ఖర్చుపెట్టమంటాడు. ఎవరికి ఎంత పంచాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనే లెక్కలు కూడా ఉంటాయి. అన్నీ ఫాలో అయ్యి ఆ మొత్తం సొమ్ముని హారతి కర్పూరం చెయ్యాలి. ఓటుకింతని ఏడుస్తూ ఈ అభ్యర్థి పంచితే కొందరు ఓటర్లు వెక్కిలి నవ్వు నవ్వుతూ తీసుకుంటారు. తీరా తీసుకున్నవాళ్లంతా నిజంగా ఓటేస్తారో లేదో తెలీదు. 

అసలు ఎన్నికలకంటే ముందుగా డబ్బు కట్టే పరిస్థితి దేనికంటే నిజంగా అభ్యర్థి దగ్గర డబ్బుందో లేదో తెలుసుకోవడం, నమ్మకం కుదుర్చుకోవడం అట! గతంలో పార్టీ అధినేతకి, అభ్యర్థికి మధ్య నమ్మకం మీద వ్యవహారాలు నడిచేవి. ఇప్పుడా నమ్మకాన్ని చంపేసారు మధ్యలో వచ్చి పెత్తనం చేస్తున్న స్ట్రాటజిష్టులు. 

ఈ పద్ధతిని మొదట ఐ-పాక్ వాళ్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రతి పార్టీ అదే ఫాలో అవుతోంది. 

అదలా ఉంచితే డబ్బుని ఎక్కడో దాయడం అనేదే కామిడీతో కూడిన థ్రిల్లింగ్ సబ్జెక్ట్. ఉదాహరణకి ఈ పని ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వాళ్లు చేసి ఏ మారుమూల పట్టణంలోనో ఒక ఇంట్లో దాచారనుకోండి..ఏ విలేజ్ వాలంటీరో పసిగడితే టాస్క్ ఫోర్స్ వారో, ఆదాయపుపన్నువారు ఆ ఇంటిమీద పడొచ్చు. అప్పుడు మొత్తానికే సీలు పడుతుంది! ఆ పరిస్థితిలో సదరు అభ్యర్థి పరిస్థితి ఏమిటో మరి! బేల చూపులు చూస్తూ పార్టీ అధినేత దయాదాక్షిణ్యాల కోసం వేచి చూడాలేమో. ఈ దాచే సలహా ఇచ్చేది కూడా వ్యూహకర్తల కంపెనీయే. 

పాలకులకి, నాయకులకి ఇలాంటి సలహాలిచ్చి నడిపిస్తున్న వ్యూహకర్తలు ఎంతటి ఫీనాన్షియల్ క్రైం చేయిస్తున్నారో వేరే చెప్పక్కర్లేదు. ఇదంతా చూస్తుంటే నీతి, నిజాయితీ అని మాట్లాడేవాడు చేతకాని వాడు మాత్రమే అనిపిస్తుంది. ట్యాలెంటున్నవాడు అన్నిటికీ తెగించి ముందుకెళ్తున్నాడు. అది లేని వాడు ట్యాలెంటున్న వాడిని చూసి ఏడుస్తున్నాడు. 

అందుకే ఆ ఏడుపులు అవీ లేకుందా మనస్ఫూర్తిగా వాళ్ల ట్యాలెంటుని మెచ్చుకుంటూ- “సో బ్యూటిఫుల్- సో ఎలిగెంట్- జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్” అనేసుకుంటే సరిపోతుంది.

ఇక్కడ యువతకి నీతేంటంటే ఎమోషనల్ ఫీలైపోయి నచ్చని పార్టీవాళ్లని ఊరికే ట్రోలింగులు చేసుకుంటూ గడపక్కర్లేదు. ఎప్పుడెవరు ఎటు మారతారో తెలీదు! వాళ్ల కోసం గంగవెర్రులెత్తిపోయి వీరాభిమానాన్ని చాటుకోనక్కర్లేదు. 

హరగోపాల్ సూరపనేని