వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులతో పాటుగానే ఎంపీ అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటూ వెళ్తోంది. అలా ఉత్తరాంధ్రాలో అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఎమ్మెల్యేగా అరకు వ్యాలి నుంచి పోటీ చేయిస్తోంది. ఇపుడు విజయనగరం ఎంపీ సీటు విషయంలో మార్పుచేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సీటులో సిట్టింగ్ ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. దాంతో చాలా కాలంగా విజయనగరం ఎంపీ సీటుకు బొత్స కుటుంబం నుంచే అభ్యర్ధి వస్తారు అని ప్రచారంలో ఉంది.
దానికి తగినట్లుగా బొత్స మేనల్లుడు, విజయనగరం జెడ్పీ చైర్ పర్సన్ అయిన మజ్జి శ్రీనివాసరావుని ఎంపిక చేస్తున్నట్లుగా భోగట్టా. జెడ్పీ చైర్మన్ గా విజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావుకు అంగబలం అర్ధబలం దండీగా ఉన్నాయి.
ఆయన జగన్ కి ఇష్టుడు అని పేరు ఉంది. గత ఎన్నికలలోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి ఉంది. సమీకరణలలో అది కుదరలేదు. దాంతో జెడ్పీ చైర్మన్ కట్టబెట్టారు. ఇపుడు ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు.
ఆయన ఎంపీగా పోటీలో ఉంటే ఎంపీ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎచ్చెర్ల అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అధినాయకత్వం ఆయనకు ఎక్కడ ప్లెస్ మెంట్ చూపిస్తొందో అని ఆయన అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.