కోటికి పైగా చలాన్లు.. రూ.107 కోట్ల ఆదాయం

తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ ప్రకటించిన మెగా లోక్ అదాలత్ కు మంచి స్పందన దక్కింది. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు భారీ డిస్కౌంట్ మేళా ప్రకటించగా.. 2 వారాల్లో ప్రభుత్వానికి 107 కోట్ల రూపాయలకు…

తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ ప్రకటించిన మెగా లోక్ అదాలత్ కు మంచి స్పందన దక్కింది. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు భారీ డిస్కౌంట్ మేళా ప్రకటించగా.. 2 వారాల్లో ప్రభుత్వానికి 107 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది.

లెక్కప్రకారం ఇవాళ్టితో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ గడువు ముగిసింది. అయితే ఇంకా లక్షల్లో చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు స్పందన కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తోంది. దీంతో గడువును పెంచాలని ట్రాఫిక్ పోలీస్ నిర్ణయించింది. తాజాగా ఈ గడువును 31వ తేదీ వరకు ప్రకటించారు.

గడువు పొడిగించినా డిస్కౌంట్ ఆఫర్లలో మాత్రం మార్పు లేదు. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై పెండింగ్ లో ఉన్న చలాన్ మొత్తంలో 20 శాతం కడితే సరిపోతుంది. ఇక ఆర్టీసీ బస్సుల పెండింగ్ చలాన్ల మొత్తంలో 10 శాతం కడితే చాలు. భారీ వాహనాలు, 4 చక్రాల వాహనాలపై ఉన్న చలాన్ మొత్తంలో 40 శాతం కడితే సరిపోతుంది.

రాబోయే రోజుల్లో కనీసం 50 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తోంది ప్రభుత్వం. ఇంకా చలాన్లు క్లియర్ చేసుకోని వాళ్లు ఉంటే వెంటనే చెల్లించాలంటూ విజ్ఞప్తి చేస్తోంది. అయితే గడిచిన రెండేళ్లుగా ఉన్న ట్రెండ్ ను గమనిస్తే, పోలీస్ శాఖ ఆశించిన స్థాయిలో రెవెన్యూ ఉండకపోవచ్చు. 

కట్టాలనే ఉద్దేశం ఉన్న వాహనదారుడు ఈ పాటికే చెల్లించి ఉంటాడు. చలాన్లు క్లియర్ చేసే ఉద్దేశం లేని వ్యక్తి ఎన్ని రోజులు గడువు పెంచినా పట్టించుకోడు. కనీసం, ఈసారైనా ప్రభుత్వం టార్గెట్ అందుకుంటుందేమో చూడాలి.