భూతల స్వర్గం కశ్మీర్ లోయకు ఏమైంది?

డిసెంబర్, జనవరి వచ్చిందంటే చాలు భారత పర్యాటకులు ఎక్కువగా చూసే పర్యాటక ప్రాంతం కశ్మీర్ లోయ. మరీ ముఖ్యంగా గుల్మార్గ్ లో ఐస్ స్కేటింగ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే ఈసారి అలాంటి…

డిసెంబర్, జనవరి వచ్చిందంటే చాలు భారత పర్యాటకులు ఎక్కువగా చూసే పర్యాటక ప్రాంతం కశ్మీర్ లోయ. మరీ ముఖ్యంగా గుల్మార్గ్ లో ఐస్ స్కేటింగ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే ఈసారి అలాంటి కోరికలు ఏమైనా ఉంటే విరమించుకోండి. ఎందుకంటే, గుల్మార్గ్ లో మంచు జాడ లేదు.

అవును.. జనవరి నెల వచ్చినా గుల్మార్గ్ లో మంచు కురవలేదు. గతేడాది డిసెంబర్ నాటికే మంచుతో పూర్తిగా నిండిపోయిన ఈ ప్రాంతం, ఈ ఏడాది మాత్రం బోసిపోయింది. ఎండిన గడ్డితో, చదునైన నేల మాత్రమే కనిపిస్తోంది.

ఈ ఏడాది కశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంఖండ్ లో అతితక్కువ హిమపాతం నమోదైంది. ఈపాటికి కనీసం 4 నుంచి 6 అడుగుల మేర మంచు ఉండాలి. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.

కశ్మీర్ లోయలో గతేడాది వర్షపాతం 79 శాతం తగ్గిపోయింది. ఈ ప్రభావం హిమపాతంపై గట్టిగా పడింది. మరోవైపు భారత్ పై ఎల్-నినో ప్రభావం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది నవంబర్ లోనే ఎల్-నినో ప్రభావం మొదలైందని, ఫిబ్రవరి వరకు ఉంటుందని అంటున్నారు.

ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇలా ఉంటుందని గుల్మార్గ్ లో స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది తమకు పర్యాటక రంగం నుంచి ఎలాంటి ఆదాయం ఉండదంటున్నారు. అటు అధికారులు మాత్రం జనవరి 16 తర్వాత మంచు కురిసే అవకాశం ఉందంటున్నారు.

గిన్నిస్ బుక్ ఎక్కిన మంచు థీమ్ పార్క్.. మరోవైపు పొరుగుదేశం చైనాలో మాత్రం భారీగా మంచు కురుస్తోంది. ఎంతలా అంటే ఏకంగా కురిసిన మంచుతో నిర్మాణాలు చేపడుతున్నారు. హీలింగ్ జియాంగ్ ప్రాంతంలోని హార్బిన్ లో కురిసిన మంచుతో ఏకంగా థీమ్ పార్క్ నిర్మించారు. మంచుతో నిర్మించిన అతిపెద్ద థీమ్ పార్క్ గా ఇది గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించింది. 8,16,682 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈసారి థీమ్ పార్క్ నిర్మించడం విశేషం.