ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ అంటే వామ్మో అంటున్నారు జనం. దీనికి కారణం రీసెంట్ గా వచ్చిన రీమేక్స్ బొక్కబోర్లా పడ్డమే. మరీ ముఖ్యంగా భోళాశంకర్ సినిమా దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ గా నిలిచింది.
ఇలాంటి టైమ్ లో రీమేక్ సబ్జెక్ట్ తో వస్తోంది నా సామిరంగ సినిమా. నాగ్ నటించిన ఈ సినిమా ఓ రీమేక్ అనే విషయం చాలామందికి తెలిసిందే. మరి ఆ నెగెటివ్ సెంటిమెంట్ ప్రభావం నా సామిరంగ సినిమాపై పడుతుందా? అలాంటి భయం లేదంటున్నాడు దర్శకుడు విజయ్ బిన్నీ.
“రీమేక్ చేస్తున్నాం అనే భయం లేదు. ఎందుకంటే, ఇది బేసిగ్గా రీమేక్ కాదు. ఒరిజినల్ సినిమా నుంచి ఓ పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ చుట్టూ మన నేటివిటీకి తగ్గట్టు పూర్తిగా అన్నీ మార్చేశాం. సంక్రాంతి సీజన్ కు తగ్గట్టు మార్పులు చేశాం. సినిమా రిలీజైన తర్వాత చూస్తే, ఒరిజినల్ మూవీకి, నా సామిరంగకు ఎలాంటి సంబంధం కనిపించదు.”
తను తీసిన నా సామిరంగ సినిమాను రీమేక్ ప్రాజెక్ట్ అనొద్దంటున్నారు విజయ్ బిన్నీ. తను, రచయిత కలిసి కూర్చొని పూర్తిగా ట్రీట్ మెంట్ మార్చేశామని చెబుతున్నారు. మలయాళం సినిమాలు స్లోగా ఉంటాయి, నా సామిరంగ సినిమాలో ఆ సమస్య ఉండదని చెబుతున్నారు.
రికార్డ్ టైమ్ లో నా సామిరంగ సినిమాను పూర్తిచేశారు విజయ్. దీంతో సినిమాను చుట్టేశారంటూ విమర్శలు వచ్చాయి. దీనికి విజయ్ బిన్నీ దగ్గర ఆన్సర్ ఉంది. షూటింగ్ ఫాస్ట్ గా చేసినా, ప్రీ-ప్రొడక్షన్ కు టైమ్ తీసుకున్నామని, సినిమా చూసిన తర్వాత తాము చేసిన హోం వర్క్ ఏంటో అర్థమౌతుందని అంటున్నారు.