ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మొదటి రోజే పాఠాలు నేర్చుకున్నారు. గత అధ్యక్షుల అనుభవాలను దగ్గరి నుంచి చూసిన ఆమె, జాగ్రత్తగా నడుచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తన పార్టీకి చెందిన గత అధ్యక్షుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, వారి మార్గ నిర్దేశకత్వంలో పని చేస్తానని అన్నారు. ఈ మాటల వెనుక నిగూఢమైన అర్థం దాగి వుంది. గత అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అంటే… తాను అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఏదో ఒక పార్టీ అనుకూల నాయకురాలిగా ముద్ర వేయించుకోనని చెప్పకనే చెప్పారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఆమె ఆ మేరకు జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది.
వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించి, తాను సీఎం జగన్ వ్యతిరేకి అనుకునేలా చేశారు. ఇదే సందర్భంలో పవన్‌కల్యాణ్‌పై సానుకూల వ్యాఖ్యల ద్వారా తమతోనే జనసేన వుంటుందనే సంకేతాలు పంపారు. పవన్‌కల్యాణ్‌తో నిన్న ఉన్నాం, మొన్న ఉన్నాం, రేపూ వుంటామనే కామెంట్స్ ద్వారా జనసేనాని అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. జనసేనతోనే తమ పొత్తు వుంటుందని తేల్చి చెప్పారు. అలాగే పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ఏపీలో బీజేపీపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లతో నిమిత్తం లేకుండా మోదీ సర్కార్ సాయం అందిస్తోందని చెప్పుకొచ్చారు. రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామన్న హామీ ఏమైందని సీఎం జగన్‌ను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సొంత బాబాయ్ వివేకా హత్య కేసుని విచారణ చేయలేమని జగన్ సర్కార్ చేతులెత్తేసిందన్నారు.
పదో తరగతి బాలుడిని పెట్రోల్ పోసి చంపేశారన్నారు. అధికార పార్టీ ఎంపీ ఇంట్లో కిడ్నాపర్లు రెండు రోజులు ఉన్నారన్నారు. దశలవారీ మద్యం సంగతి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇలా జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించడం ద్వారా…. ఫస్ట్ డే వైసీపీ వ్యతిరేకిగా పాస్ మార్కులు వేయించుకున్నారు. ఇక అనధికార సొంత పార్టీ అయిన టీడీపీపై ఆమె వైఖరి ఏంటనేది తేలాల్సి వుంది.