జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాలంటీర్లపై పవన్‌కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్‌కు అధికార పార్టీ నేతలతో పాటు వాలంటీర్లు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్‌పై కేసులు నమోదవుతున్నాయి. వాలంటీర్లపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో పవన్‌పై మంత్రి బొత్స మండిపడ్డారు. మహిళలపై పవన్‌కల్యాణ్ అసభ్యకరంగా మాట్లాడ్డం కరెక్టేనా? అని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న దుర్బుద్ధితోనే పవన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ హయాంలో సర్వేల పేరుతో వ్యక్తిగత సమాచారం తీసుకుని ఓట్లను తొలగించారని ఆయన ఆరోపించారు. అప్పుడు తానే స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు బొత్స గుర్తు చేశారు.
ఏపీ వాసుల డేటా హైదరాబాద్‌లో ఉందన్న పవన్ వ్యాఖ్యలను బొత్స ఖండించారు. పవన్, ఆయన పార్టనర్ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజల డేటాను హైదరాబాద్‌లో ఉంచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఎవరో, ఎలా వచ్చారో, అసలు ఆ వ్యవస్థ విధి విధానాలను పవన్‌కు తెలుసా ? అని బొత్స నిలదీశారు. అన్ని రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని మంత్రి చెప్పడం విశేషం.