ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని బలి పెట్టారనేది చంద్రబాబు ఆరోపణ. అదేంటో గానీ, మాటల్లో సీఎం వైఎస్ జగన్ను బాబు తిడుతుంటారు. చేతల విషయానికి వస్తే జగన్ను అనుసరిస్తానని బాబు చెబుతున్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని చంద్రబాబు ప్రకటించారు. అలాగే సంక్షేమ పథకాలను జగన్ కంటే మిన్నగా అమలు చేస్తానని చంద్రబాబు ఏకంగా మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారు.
దీంతో వైఎస్ జగన్ పరిపాలనను తీసుకొస్తానని చంద్రబాబు తన హామీల ద్వారా చెప్పకనే చెప్పినట్టైంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ పాదయాత్రలోనూ, అలాగే ఎన్నికల ప్రచార సందర్భాల్లో తాను అధికారంలోకి వస్తే… ప్రజలను ఇబ్బంది పెడుతున్న జన్మభూమి కమిటీలను రద్దు చేస్తానని ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగనే అదే పని చేశారు.
సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వ్యవస్థకు అనుసంధానంగా వాలంటీర్లను నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మందిని నియమించి సేవలందిస్తున్నారు. ఎన్నికల ముంగిట వాలంటీర్లు తమను రాజకీయంగా దెబ్బతీస్తారనే భయం ప్రతిపక్షాల్లో వుంది. అయితే మొదట్లో వాలంటీర్లపై చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఒక బలమైన వ్యవస్థను చెడ్డ చేసుకోవడం వల్ల రాజకీయంగా నష్టపోతామని ఆయన జాగ్రత్త పడ్డారు.
తాజాగా పవన్ కల్యాణ్ వాలంటీర్లపై అవాకులు చెవాకులు పేలడం పరోక్షంగా టీడీపీపై కూడా నెగెటివ్ ప్రభావం పడుతోంది. దీంతో చంద్రబాబు వారి సేవల్ని రాజకీయాలకు అతీతంగా వాడుకుంటామని మంచి చేసుకునేందుకు ప్రయత్నించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ చంద్రబాబు అంతే. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్ …తదితర దేశాల మాదిరిగా దివాళా తీస్తుందని సంచలన ఆరోపణలు చేశారు.
ఇదే పెద్ద మనిషి తాను ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. దీంతో ఇంత కాలం వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలన్నీ ఉత్తుత్తివే అని తేలిపోయాయి. అది కూడా జగన్ తీసుకొచ్చిన అమ్మ ఒడికి బదులు తల్లికి వందనం అని పేరు పెట్టారు. అలాగే మహాశక్తి పథకం అంటూ జగన్ పథకాన్ని కాపీ కొట్టారు. జగన్ రైతు భరోసా పథకాన్ని అన్నదాత పేరుతో అమలు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
ఒకవైపు జగన్ పరిపాలన విధానాల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని ఘాటు విమర్శలు చేస్తూనే, మళ్లీ తాను కూడా అవే పథకాలు తీసుకొస్తానని చెప్పడం ద్వారా… జగన్కు రాజకీయ వారసుడనిపించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మూడు రాజధానులకు కూడా చంద్రబాబు జై కొడితే… జగన్ను సంపూర్ణంగా అనుసరించినట్టు అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు, చివరికి తన అనుభవమంత వయస్సున్న జగన్ను అనుసరించాల్సి రావడం విషాదం.