తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేయబోతున్న అభ్యర్థులు అందరికీ చంద్రబాబునాయుడు ఒక శిక్షణ శిబిరం ప్లాన్ చేశారు. మామూలుగానే శిబిర రాజకీయాలకు ఆద్యుడు అయిన చంద్రబాబునాయుడు, కేండిడేట్ల కోసం ఒక వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి అందులో చర్చిస్తారట. అందరికీ దిశానిర్దేశం చేస్తారట. విజయవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమంలో మొత్తం పార్టీ వ్యూహాలను కేండిడేట్ల బుర్రల్లోకి నూరిపోసి పంపుతారన్నమాట.
అయితే ఇదే వర్క్ షాప్ కు ప్రతి నియోజకవర్గం నుంచి మరి కొందరిని కూడా ఆహ్వానించారు. అంటే పార్టీ అనుసరించబోతున్న వ్యూహాలు.. ప్రతి నియోజకవర్గంలో వారందరికీ క్లారిటీగా తెలియాలనేది పార్టీ ఆలోచన కావొచ్చు. వారంతా ఎవరయా అంటే.. ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఒక పొలిటికల్ మేనేజర్, ఒక మీడియా మేనేజర్, ఒక సోషల్ మీడియా మేనేజర్ ఉంటారట. ఒక్కో నియోజకవర్గానికి ఇందరు మేనేజర్లా..? ఇంతకూ వారు ఏం చేస్తుంటారు బాబూ.. అని ప్రజలకు సందేహం కలుగుతోంది.
అయితే పార్టీ అంతర్గత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఏంటంటే.. మేనేజర్ అనే పదం ద్వారా నియోజకవర్గాల్లో పనిచేయడానికి నియమితులవుతున్న వీళ్లందరూ కూడా ఆయా విభాగాల్లో ప్రలోభ పెట్టడానికి, డబ్బులు ముట్టజెప్పి తమకు అనుకూలతలను తయారు చేయడానికే పనిచేయబోతున్నారని తెలుస్తోంది.
అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ అనే వారు.. ప్రచారంలో పాల్గొనే పెయిడ్ ఆర్టిస్టులను, ప్రచారానికి అయ్యే ఖర్చులను, ఇతరత్రా ప్రలోభాలను మేనేజ్ చేయాలి. ప్రచారానికి కేండిడేట్లు వెళితే వారి హారతులు, వారికి స్థానికులు వేసే పూలమాలలు, వేసే వారికి కూలీలు అన్నీ వీళ్ల రెస్పాన్సిబిలిటీ అన్నమాట.
పొలిటికల్ మేనేజర్- అంటే నియోజకవర్గంలో ఉండే తమ సొంత పార్టీ నాయకులకు ఎంతెంత సొమ్ములు ముట్ట జెప్పాలి. వారితో ఎలా పనిచేయించుకోవాలి. వారు డిమాండ్ చేసే సొమ్ములను ఎలా బేరమాడాలి. అలాగే… డబ్బుతో కొటే పడిపోయే ఇతర పార్టీ నాయకులను ఎలా ప్రలోభపెట్టాలి. పొత్తు పార్టీల నాయకులు పనిచేయడానికి వారికి ఎంత ఆమ్యామ్యాలు చదివించుకోవాలి.. అనే వ్యవహారాలను వారు చూసుకోవాలి.
అలాగే మీడియా మేనేజర్- అంటే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో ఉండే జర్నలిస్టులను ప్రలోభపెట్టే బాధ్యత మాత్రమే. వారితో అనుకూల వార్తల ప్రచారం చేయిస్తుండాలి. అందుకు వారు అడిగే మొత్తాలను ముట్టజెప్పడం, బేరాలాడడం కూడా వారిదే బాధ్యత.
సోషల్ మీడియా మేనేజర్ పని చాలా కీలకం. ప్రత్యర్థుల మీద విషపూరితమైన పోస్టులు పెట్టడం, కేరక్టర్ అసాసినేషన్ చేయడం, వందల కొద్దీ తప్పుడు దొంగ అకౌంట్లను కలిగి ఉండడం, తయారు చేయడం, వాటి ద్వారా నిత్యం విషం చిమ్ముతూ ఉండడం వారి బాధ్యత అన్నమాట.
ఇలా నాలుగు రకాల ఆమ్యామ్యా వ్యవహారాలకు వినియోగించిన వాళ్ల పేర్లే మేనేజర్లు అన్నమాట. కేండిడేట్లతో పాటు ఇలాంటి మేనేజర్లు అందరికీ తన కుట్ర తెలివితేటలను నేర్పి పంపడానికి చంద్రబాబునాయుడు ఏకంగా వర్క్ షాప్ నిర్వహిస్తుండడమే విశేషం.