కడపలో బలి పెట్టడానికి చంద్రబాబుకు నాయకుల అవసరం ఏర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప వైసీపీకి కంచుకోట. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని చంద్రబాబు ఆశయం. అయితే అది సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడు. దీన్ని అడ్డం పెట్టుకుని బాబు తన మార్క్ రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆటలు సాగడం లేదు.
ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డిపై వైఎస్ కుటుంబ సభ్యుల్నే బరిలో నిలిపి, కొట్టుకుంటుంటే చూస్తూ సంబరపడాలని ఆశించారు. అయితే కడప బరి నుంచి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ సునీత తెలివిగా తప్పుకున్నారు. దీంతో టీడీపీకి బలి పెట్టడానికి ఓ నాయకుడు అవసరం. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డిని నిలబెట్టాలని చంద్రబాబు మొదట భావించారు. ఎందుకనో ఆయన అభ్యర్థిత్వంపై టీడీపీ సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. ఎవరూ దొరక్కపోతే ఆయన్నే బలిపెట్టే అవకాశం వుంది.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే జీ.వీరశివారెడ్డిని నిలబెడితే ఎలా వుంటుందని ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. ఎలాంటి ఫలితం వచ్చిందో తెలియదు కానీ, తాజాగా జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్ భూపేష్‌రెడ్డి పేరుతో టీడీపీ సర్వే చేస్తోంది. ఈ మేరకు కడప పార్లమెంట్ పరిధిలోని ఓటర్లకు కాల్స్ వెళుతున్నాయి. జమ్మలమడుగు సీటు బీజేపీకి కేటాయించిన సంగతి తెలిసిందే.
దీంతో భూపేష్‌రెడ్డి రివర్స్ అయ్యారు. తాను బరిలో వుంటానని స్పష్టం చేశారు. తన చిన్నాన్న, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కోసం పోటీ విరమించలేనని తేల్చి చెప్పారు. బాబాయ్, అబ్బాయ్ మధ్య రాజీ కుదిర్చి, జమ్మలమడుగు బరిలో ఆదినారాయణరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌ను నిలబెట్టాలని చంద్రబాబు ఉద్దేశం. అయితే ఓడిపోయే సీటులో పోటీ చేయడానికి భూపేష్ ఎంత వరకు ఆసక్తి చూపుతారనేది ప్రశ్నగా మిగిలింది. భూపేష్‌ను కడప ఎంపీగా పోటీ చేయించడానికి ఆయన తల్లిదండ్రులు ఏ మాత్రం ఇష్టపడడం లేదని సమాచారం.
రెండు కుటుంబాల మధ్య వ్యక్తిగత వైరం వుంది. దీంతో ఆదినారాయణరెడ్డికి సహకరించే పరిస్థితి వుండదు. ఆదినారాయణరెడ్డి ప్రతిసారి స్వార్థ రాజకీయాలకు పాల్పడడం ఆనవాయితీగా వస్తోందనే భావన భూపేష్ కుటుంబంలోనూ, ఆ నియోజకవర్గ ప్రజానీకంలోనూ ఉంది. అందుకే ఆయనకు ఆదరణ అంతంత మాత్రమే.
ఇప్పుడు తేల్చుకోవాల్సింది భూపేషే. చిన్నాన్న కోసం బలి కావడమా? జమ్మలమడుగులో పోటీ చేసి నాయకత్వాన్ని నిలబెట్టుకోవడమా? మొదటి సారి ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న తమ బిడ్డను గెలిచే సీట్లో మాత్రమే పోటీ చేయాలని భూపేష్ తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ చదరంగంలో భూపేష్ ఏమవుతారో అనే ఉత్కంఠ కడపలో నెలకుంది.