హిందీ సినీ గాయకుడు తలత్ మహమ్మద్ శతజయంతి గత నెల ఫిబ్రవరి 24న జరిగింది. ఇప్పటి శ్రోతల్లో ఆయన గురించి తెలిసినవారు తక్కువ మందే ఉంటారు కానీ ఆ విలక్షణ గాయకుడి గురించి కొంతైనా తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో యీ వ్యాసం రాస్తున్నాను. మొఖమల్ గుడ్డను కంఠంలో దూర్చి పాడుతున్నట్లుండే అతని సుతిమెత్తని వాయిస్ ఒకసారి వింటే మర్చిపోవడం కష్టం. ఆర్తి, వేదన, సౌకుమార్యం, మార్దవం, సిల్కీనెస్ అతని కంఠంలో పలికినట్లు వేరెవ్వరి కంఠంలో పలకవు. అవి డైరక్టుగా హృదయాన్ని తాకుతాయి. నిస్సహాయుడైన విరహ ప్రేమికుడి గీతంలోని దుఃఖం అలాటి గొంతులోనే చక్కగా ప్రతిఫలిస్తుంది. రఫీ, ముకేశ్ వీరందరూ వేదనాభరితమైన గీతాలు పాడేరు కానీ వాళ్లవి రిచ్, బారిటోన్ వాయిస్‌లు. ఘంటసాలదీ అంతే గాంభీర్యం పాలు ఎక్కువ. బాలు గొంతులో మాధుర్యం పాలు ఎక్కువ.
ఘంటసాలకు ముందు ఎమ్మెస్ రామారావు పాడేవాడు. బాధ, మృదుత్వం అనాయాసంగా పలికేవి. హిందీలో తలత్ది అలాటి వాయిస్సే. ‘‘దేవదాసు’’లో నాగేశ్వరరావు పాత్రకు తలత్‌ను ఊహించుకోవచ్చు. ‘‘ప్రేమనగర్’’లో ‘మనసు గతి యింతే..’లో పలికించినంత గాంభీర్యం ఘంటసాల ‘‘దేవదాసు’’లో ‘కల యిదనీ…’లో పలికించక పోవడం గమనించండి. ‘ట్రాజెడీ కింగ్’గా పేరు బడిన దిలీప్ తొలి సినిమాల్లో తలత్ వాయిస్ అతనికి అచ్చు గుద్దినట్లు సరిపోయింది. తలత్ కంఠంలో పలికే ఒక చిన్నపాటి వణుకు కూడా విషాద కథానాయకుడి దైన్యానికి గుర్తుగా ఉండేది. ఏ శ్రమా లేకుండా, సునాయాసంగా పాడేవాడు.
దిలీప్ కుమార్ ‘నా పాటలకు ఆత్మ తలత్’ అన్నాడొకసారి. పోనుపోను తలత్‌కు బదులు దిలీప్ రఫీని ఎంచుకోవడానికి గల కారణాలు తర్వాత చెప్తాను. నిస్సహాయుడైన త్యాగశీలి, ప్రేమమూర్తి పాత్రలు ఆడవాళ్లకు బాగా నచ్చుతాయి. తెరపై దిలీప్, అతనికి గళం యిచ్చిన తలత్ అంటే మహిళలు విపరీతంగా యిష్టపడేవారు. 1961లో తలత్ కరాచీలో యిచ్చిన కార్యక్రమానికి 60 వేల మంది వస్తే మూడింట రెండు వంతులు మహిళా శ్రోతలే ఉన్నారట. గళానికి తోడు తలత్ అందగాడు. కోటు, సూటుతో స్టయిలిష్‌గా ఉండేవాడు. దాంతో అతనికి విమెన్ ఫాలోయింగ్ బాగా ఉండేది. బార్లో పానప్రియులు వినడానికి యిష్టపడే పాటల్లో తలత్వే ఎక్కువగా ఉండేవి. తర్వాత అతని కెరియర్ దెబ్బ తినడంతో అలాటి పాటలు ముకేశ్‌కి వెళ్లసాగాయి. బార్లలో ముకేశ్ పాటలు కూడా పాప్యులరే.
తలత్ లఖ్‌నవూలో పుట్టాడు. తండ్రిది ఎలక్ట్రిక్ సామాన్య వ్యాపారం. హైస్కూలు దాకా యితని చదువు ఆలీగఢ్‌లో సాగింది. అప్పట్లోనే కెఎల్ సైగల్ పాటలంటే చెవి కోసుకునేవాడు. పాటల పట్ల అతని యిష్టానికి మేనత్త ప్రోత్సాహం తోడైంది. హైస్కూలు తర్వాత లఖ్‌నవూ వచ్చి ఒక మ్యూజిక్ కాలేజీలో చేరాడు. కాలేజీలో ఉండగానే అతని గాన ప్రతిభ వెలుగులోకి రావడంతో ఆలిండియా రేడియో లఖ్‌నవూ, లాహోర్ స్టేషన్లు అతన్ని పిలిపించి పాడించుకున్నాయి. అది చూసి ఎచ్ఎంవి వాళ్లు ఒక సంవత్సరానికి కాంట్రాక్టు రాయించుకుని రికార్డింగుకి రూ.30 యిచ్చి 5 పాటలు, ఘజల్స్ పాడించుకున్నారు. 1941 సెప్టెంబరులో కలకత్తాలో మొదటి డిస్క్ కట్ అయింది. అప్పటికి తలత్ వయసు 17. లఖ్‌నవూ వాడు కాబట్టి అతని ఉర్దూ ఉచ్చారణ పెర్ఫెక్ట్గా ఉండేది.
కాలేజీ చదువు పూర్తవగానే తన ఐడాల్ అయిన సైగల్‌ను కలవడానికి తలత్ కలకత్తా వెళ్లాడు. అప్పట్లో అక్కడే హిందీ, బెంగాలీ సినిమాలు తయారవుతూండేవి. ఇతనికి ప్లేబ్యాక్ ఆఫర్లు వచ్చాయి. అప్పట్లో చాలా మంది ముస్లిములు హిందూ పేర్లతో నటించేవారు, పాడేవారు. ఇతను తపన్ కుమార్ పేరుతో పాడేవాడు. ఇతను అందంగా ఉండడంతో, ‘ఆదాయం ఎక్కువ వస్తుంది, నటించరాదా’ అని స్నేహితులు సూచించారు. 1945లో ‘‘రాజలక్ష్మి’’ అనే సినిమాలో చిన్న వేషం వేశాడు. ఇంకో రెండు సినిమాల్లో నటనకు ఆఫర్లు వచ్చాయి. ఈ నటనా కండూతి గాయకుడిగా అతని కెరియర్ను తర్వాతి రోజుల్లో దెబ్బ తీసింది. ఆ సంగతి తర్వాత చెప్తాను.
దేశ విభజన తర్వాత కలకత్తా ప్రాభవం తగ్గి హిందీ సినిమాకు బొంబాయి కేంద్రం కాసాగింది. 1949లో యితను బొంబాయి వచ్చేసి, గాయకుడిగా ప్రయత్నాలు చేయసాగాడు. కలకత్తాలోనే పరిచయమైన అనిల్ బిశ్వాస్ ‘‘ఆర్జూ’’ (1950) సినిమాలో దిలీప్ కుమార్‌కు ‘ఐ దిల్ ముసే ఐసీ జగహ్ లే చల్ జహాఁ కోయీ న హో’ పాటకు పాడే అవకాశం యిచ్చాడు. అదే ఏడాది విడుదలైన అనేక సినిమాల్లో తలత్ పాడాడు. వాటిల్లో దిలీప్ నటించిన ‘‘బాబుల్’’, ‘‘జోగన్’’, దేవ్ ఆనంద్ నటించిన ‘‘మధుబాల’’, భరత్ భూషణ్ నటించిన ‘‘భాయి బహెన్’’, కరణ్ దివాన్ నటించిన ‘‘అన్మోల్ రతన్’’ వంటివి ఉన్నాయి. సినిమాలూ హిట్, తలత్ పాటలూ హిట్. అతనికి అవకాశాలు యిచ్చిన సంగీత దర్శకులలో ఖేమ్‌చంద్ ప్రకాశ్, నౌషాద్, శ్యామ్ సుందర్, వినోద్, బులో సి. రానీ, లచ్చీ రామ్ వగైరాలు ఉన్నారు. పై ఏడాది కల్లా యీ జాబితాలో ఎస్డి బర్మన్, మదన్ మోహన్ చేరారు. ఇవన్నీ భారీ సినిమాలే!
ఇలా తారాపథంలోకి దూసుకుపోతున్న తలత్ కెరియర్ వేగం కోల్పోవడానికి మూడు కారణాలున్నాయి. మొదటిది, అతని చాదస్తమనండి, నిబద్ధత అనండి, మరోటనండి. పాట పాడాలనగానే లిరిక్ ఏమిటో చూపండి అనేవాడు. చక్కటి భాష, భావం ఉంటేనే ఒప్పుకునేవాడు. ‘ఆహా రిమ్ఝిమ్కే’ (‘‘ఉస్నే కహా థా’’), ‘ఇత్నా న ముఝ్సే ప్యార్ బఢా’ (‘‘ఛాయా’’), ‘చోరీచోరీ దిల్కా’ (‘‘బడా భాయ్’’), ‘టిమ్ టిమ్ టిమ్’ (‘‘మౌసీ’’) వంటి హుషారు పాటలు పాడడం వరకు ఓకే కానీ, లల్లాయి పదాల్లాటివి పాడననేవాడు. ఇతని తర్వాత వచ్చిన రఫీకి అలాటి పట్టింపులు లేవు. ఇప్పటికైనా మీరు గమనించవచ్చు, తలత్ పాడిన ప్రతీ పాటా చక్కటి సాహిత్యంతో అలరారుతుంది. రఫీతో సహా యితర గాయకుల పాటల్లో కొన్ని పొల్లు ఉంటాయి.
తలత్ పీక్‌లో ఉండగా హీరో పాత్రలు ఒక విధంగా మలచబడేవి. ‘50లు దాటి ‘60ల్లోకి వస్తూండగానే హీరో యిమేజి మారిపోయింది. అల్లరిచిల్లరి వేషాలు, కొంటెతనాలు, అరుపులు, కేకలు యివన్నీ మొదలెట్టేశారు హీరోలు. శాస్త్రీయ సంగీతం కంటె పాశ్చాత్య సంగీతానికి మోజు పెరిగింది. అవి తలత్ కప్ ఆఫ్ టీ కాదు. అందువలన అతను వెనకబడ్డాడు. తలత్ అంత గొప్పగా ఉర్దూపై పట్టు, శాస్త్రీయ సంగీత జ్ఞానం కలిగి, ‘యాహూ…’ లాటి పాటలు కూడా పాడగలిగిన రఫీ హీరోలకు ఫేవరేట్ అయిపోయాడు. దిలీప్ కూడా రఫీని పిలవసాగాడు. ‘థరో జంటిల్మన్’గా పేరున్న తలత్ దీనికై బాధపడలేదు. తుంటరి పాటలు పాడడం నా వల్ల కాదు అంటూ మర్యాదగా ఊరుకున్నాడు. ఎలాటి పాలిటిక్సూ చేయలేదు, ఫిర్యాదులు చేయలేదు, మారిన పరిస్థితులను హుందాగా ఆమోదించాడు.
రఫీ, ముకేశ్లకున్నంత వైవిధ్యం తనకు లేదన్న సంగతి అతనికి తెలుసు. పైగా ఒక స్థాయికి మించి తలత్ గొంతు పైకి లేవదు. రఫీకైతే ఆ బాధ లేదు. ఎంత హై పిచ్‌కైనా వెళ్లగలడు. అందుకే నౌషాద్ రఫీని తన అభిమాన గాయకుడిగా చేసుకున్నాడు. కొంతకాలం రఫీ హిందీ సీమను ఏలాక, ఫుల్‌టైమ్ గాయకుడిగా అవతారమెత్తిన కిశోర్ వైవిధ్యాన్ని కనబరచి, అతని స్థానాన్ని భర్తీ చేశాడు. అంతా హీరోల యిష్టాయిష్టాలపై, మార్కెట్ డిమాండ్లపై ఉంటుంది. ‘‘భాభీ’’ (1957) సినిమాలో ‘చల్ ఉడ్ జారే పంఛీ’ అనే థీమ్ సాంగ్‌ను (‘తెలుగులో ‘పయనించే ఓ చిలుకా, ఎగిరిపో, పాడై పోయెను గూడు) సంగీత దర్శకుడు చిత్రగుప్త తలత్ చేత పాడించాడు. కానీ డిస్ట్రిబ్యూటర్ పట్టుబట్టడంతో రఫీ చేత మళ్లీ పాడించి దాన్నే సినిమాలో వాడారు.
‘‘గుడిగంటలు’’ హిందీ రీమేక్ ‘‘ఆద్మీ’’ (1968)లో నౌషాద్ ఒక పాటలో దిలీప్‌కు రఫీ చేత, జగ్గయ్య పాత్ర వేసిన మనోజ్ కుమార్‌కు తలత్ చేత పాడించాడు. అది రికార్డుగా వచ్చింది కూడా. కానీ సినిమాకు వచ్చేసరికి మనోజ్ కుమార్ తలత్‌కు బదులు మహేంద్ర కపూర్ పాడాలని పట్టుబట్టి సాధించాడు. రికార్డు చేసినా ఆ పాట సినిమాలో చోటు చేసుకోని యిలాటి దుస్థితిని అనుభవించాడు తలత్. కానీ సంగీతదర్శకుడి మాట చెల్లిన చోట తలత్ అదరగొట్టాడు. ‘‘టాక్సీ డ్రైవర్’’ (1954) సినిమాలో ఎస్డి బర్మన్ హీరో దేవ్ ఆనంద్ మెయిన్ సాంగ్ ‘జాయేతే జాయే కహాఁ’కు తలత్నే ఉపయోగించాడు. ఆ పాట రికార్డులు బద్దలగొట్టింది. ఆ ఏడాది బినాకా గీత్‌మాలా టాపర్ అయింది.
‘‘జహానారా’’ (1964) అనే చారిత్రాత్మక సినిమా దర్శకనిర్మాత పాటలన్నీ రఫీ చేత పాడిస్తానంటే సంగీత దర్శకుడు మదన్ మోహన్ పట్టుబట్టి అన్నీ తలత్ చేతనే పాడించాడు. సినిమా ఫ్లాప్. కానీ పాటలు సూపర్ హిట్. తలత్ పాడిన ‘ఫిర్ వహీ శామ్, ఫిర్ వహీ గమ్’ శ్రోతలను యిప్పటికీ అలరిస్తోంది. ఆ పాట తర్వాత తలత్ సినిమా కెరియర్ ముగిసిపోయిందనే చెప్పాలి. అప్పుడు అతని వయసు 40. కానీ సినిమాయేతర గజల్స్ రంగంలో అతనికి ఎదురు లేదు. ఎన్నో ప్రైవేటు రికార్డులు యిచ్చాడు. మెహదీ హసన్, జగ్జీత్ సింగ్ వంటి ఎందరో గజల్ గాయకులకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆ తర్వాత సినిమాలకు పాడే అవకాశం రెండు సార్లే వచ్చింది. 1971లో లక్ష్మీ-ప్యారే సంగీత దర్శకత్వంలో ‘‘వో దిన్ యాద్ కరో’’లో లతాతో డ్యూయట్, ‘‘మేరే శరీక్-ఎ-సఫర్’’ (1985)లో హేమలతాతో కలిసి డ్యూయెట్. కానీ అవి ఎవరికీ గుర్తు లేవు.
తలత్ కెరియర్ నీరసించడానికి రెండో కారణం – యాక్టింగ్‌పై అతని మక్కువ! ఏ రంగంలో ప్రావీణ్యత ఉంటే దాన్నే నమ్ముకోవాలి తప్ప రెండు పడవల్లో కాళ్లు పెడతానంటే సినిమా రంగంలో ఎవరికో కానీ ఒప్పదు. హీరో నిర్మాతగా మారితే ‘ఆయన తన సొంత సినిమాపైనే ఫోకస్ పెడుతున్నాడండి, ఆ వర్రీస్‌లో పడి యాక్టింగ్‌పై శ్రద్ధ తగ్గింది, మరొకర్ని చూడండి.’ అంటారు తక్కిన నిర్మాతలు. దర్శకత్వానికి దిగినా అలాగే అంటారు. కమెడియన్ హీరో వేషాలు వేయబూనితే, కామెడీ వేషాలకు పిలవడం మానేస్తారు. ఇక గాయకుల విషయానికి వస్తే మొదట్లో సింగింగ్ స్టార్స్ ఉండేవారు. క్రమేపీ నటన, గానం రెండూ విడివిడి రంగాలుగా ఎదిగాయి. గాయకుడు యాక్టింగ్‌లోకి దిగితే యిక తనకి తనే పాడుకోవాలి తప్ప తక్కిన వాళ్లు ప్లేబ్యాక్‌కు పిలవరు. ఎస్పీ బాలూ గాయకుడిగా ఎదిగే రోజుల్లో బాపురమణలు ‘‘బంగారు పిచిక’’ (1968)లో హీరో వేషం వేయమని అడిగితే ఆయన వద్దన్నాడు. సినిమా ఆడకపోతే, గాయకుడి ఛాన్సులు కూడా పోతాయని! గాయకుడిగా బాగా స్థిరపడ్డాక, కారెక్టరు పాత్రలు వేసి తన నటనాతృష్ణను తీర్చుకున్నాడంతే!
గాయకుడు ముకేశ్ అందగాడు, నటించే ఉత్సాహం ఉంది. ‘‘నిర్దోష్’’ (1941) సినిమాలో నళినీ జయవంత్ సరసన హీరోగా, సింగర్‌గా సినీప్రవేశం చేశాడు. తర్వాత ‘‘ఆదాబ్ అర్జ్’’ (1943)లో కూడా వేశాడు. ఆ సినిమాలు ఆడకపోవడంతో నటన వదిలేసి, పాటల్నే నమ్ముకున్నాడు. అయినా కొన్నాళ్లకు నటనాకండూతితో సురయ్యా సరసన ‘‘మషూకా’’ (1953)లో వేశాడు. ఉషాకిరణ్ హీరోయిన్గా ‘‘అనురాగ్’’ (1956)లో హీరోగా వేయడంతో పాటు, సినిమాలో పెట్టుబడి పెట్టి, సంగీత దర్శకత్వం కూడా తనే వహించాడు. ఇవన్నీ పరాజయం పొందడంతో యిక యాక్టింగ్‌కు స్వస్తి చెప్పాడు. అయితే నటన రక్తంలో ఉండిపోయింది కాబోలు, అతని కొడుకు నితిన్ గాయకుడు కాగా, మనుమడు నీల్ నితిన్ ముకేశ్ నటుడయ్యాడు.
ముకేశ్‌కు ఉన్న తెలివితేటలు తలత్‌కు లేకపోయాయి. కొన్ని సినిమాల్లో హీరోగా, మరి కొన్నిటిలో సైడ్ హీరోగా నటించసాగాడు. ప్రసిద్ధ దర్శకనిర్మాత ఎఆర్ కర్దార్ ‘‘దిల్ ఏ నాదాన్’’ (1953) అనే సినిమాలో యితనికి శ్యామా పక్కన హీరోగా ఛాన్సిచ్చాడు. పాటలు హిట్ అయ్యాయి కానీ యితని యాక్టింగ్ బాగాలేక సినిమా ఫెయిలయింది. ఇలా ఐదేళ్లలో 8 సినిమాలు వేశాడు. ఒకసారి శమ్మీ కపూర్ చనువుగా మందలించాడు కూడా – పాటలు చూసుకోక యీ యాక్టింగ్ దేనికి మీకు? అని. 1958లో సినిమా యాక్టింగ్ మానేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. హీరోలు తలత్ ప్లేబ్యాక్ అక్కరలేదు అనసాగారు.
ఇక మూడో కారణం – విదేశాల్లో కచ్చేరీలివ్వడం. అప్పట్లో పాటలు రాసేవాళ్లకు, పాడేవాళ్లకు చాలా తక్కువ పారితోషికాలు యిచ్చేవారు. రాయల్టీలు కూడా ఉండేవి కావు. కానీ జనంలో గాయనీ గాయకులకు క్రేజ్ ఉండేది. విదేశాలలో తలత్ పాటలకు ఉన్న డిమాండ్ గమనించి, అక్కడి వారు ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. 1956లో తూర్పు ఆఫ్రికాతో ఆ పర్యటనలు ప్రారంభమయ్యాయి. అలా వెళ్లిన తొలి సినీ కళాకారుడు యితనేట. అక్కడ డబ్బు బాగా ముట్టడంతో ఒక దాని తర్వాత మరో ప్రోగ్రాం చేసుకుంటూ తిరిగి రావడం ఆలస్యం చేసేవాడు తలత్. దాంతో యిక్కడి నిర్మాతలకు చిఱ్ఱెత్తేది. ఆయనకు బదులు వేరేవారితో పాడిస్తే మంచిదనుకున్నారు. అలా ఛాన్సులు పోయాయి.
కానీ సినిమాలలో పోయిన స్థానాన్ని అతను బయటి కచ్చేరీలలో నిలబెట్టుకున్నాడు. కడదాకా దేశంలోనూ, విదేశాలలోనూ వేదికలపై సినీగీతాలు, గజల్స్ పాడుతూ బాగా ఆర్జించాడు. 1991 వరకు విదేశీ పర్యటనలు సాగాయి. సినిమాల వరకు చూసుకుంటే అతను 750 పాటలు 12 భాషల్లో పాడాడు. తెలుగులో రమేశ్ నాయుడు ‘‘మనోరమ’’ సినిమాలో ‘అందాల సీమ సుధా నిలయం’, ‘గతిలేని వాణ్ని గుడ్డివాణ్ని బాబయా’, ‘మరిచిపోయేవేమో’ పాటలు తలత్ చేత పాడించాడు. ఉచ్చారణలో ఏ లోపమూ ఉండదు. 1992లో పద్మభూషణ్ యిచ్చారు. 1998లో చనిపోయాడు. వ్యక్తిగత జీవితానికి వస్తే ఒక బెంగాలీ క్రైస్తవురాలిని పెళ్లి చేసుకున్నాడు. కూతురు ఒక హిందువుని పెళ్లి చేసుకుంది. కొడుకు ఖాలిద్ గాయకుడు.
నేను కలకత్తాలో ఉండగా 1983లో తలత్ యిచ్చిన కచేరీకి వెళ్లాను. టిక్కెట్ల ధర ఎక్కువ పెట్టినా హాలంతా నిండిపోయింది. హాయిగా, మంద్రంగా, సుతిమెత్తని వాయిస్‌తో ఆయన పాటలన్నీ పాడాడు. విరామం తర్వాత మీకో సర్ప్రైజ్ అన్నాడు. ఏమిటా అనుకుంటే ఆయన కొడుకు ఖాలిద్ వచ్చి పాడాడు. అతనిదీ తలత్ వాయిస్సే. బాగానే పాడాడు కానీ చికాకేసింది, తలత్ కోసం వస్తే, కొడుకు చేత పాడిస్తాడేమిటి అని. ఇలా ప్రమోట్ చేసినా అతను ప్రాచుర్యంలోకి వచ్చినట్లు తోచదు. కొన్ని డ్యూయట్లు పాడమని అడిగితే ‘లతాజీకో యహాఁ బులానా పడేగా’ అన్నాడు తలత్. మన దగ్గర బాలూ కచ్చేరీల్లో ఒరిజినల్ లేడీ సింగర్ లేకపోయినా వేరే వాళ్లతో పాడిస్తారు కదా. తలత్ది ఆ పద్ధతి కాదు. ఆ కారణంగా సోలోలే పాడాడు.
ఇక్కడే ఓ తమాషా సంగతి చెప్తాను. చైనా అధినేత చౌఎన్‌లై బొంబాయి వచ్చినపుడు అతని కోసం గవర్నరు బంగళాలో ఒక మ్యూజిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి తలత్, గీతా దత్ల చేత పాటలు పాడించారు. చౌఎన్‌లైకి ముకేశ్ పాడిన ‘‘ఆవారా హూఁ’’ పాట అంటే యిష్టం. దాన్ని పాడమని కోరాడు. కానీ అక్కడ ముకేశ్ లేడు. వీళ్లిద్దరికీ ఆ పాటలో చరణాలు రావు. ఎలాగా అని ఆలోచించి చివరకు వీళ్లిద్దరూ కలిసి పల్లవి మాత్రం పాడి, దాని చరణాలకు బదులు తమ పాటల చరణాలను ఆ ట్యూన్లో పాడి సరిపెట్టారు. చౌఎన్‌లైకి ట్యూను, మొదటి లైను మాత్రమే తెలుసు తప్ప లిరిక్స్ తెలియవుగా, సంతోషించేశాడు. ఇది చదివినప్పుడు ‘లతాజీకో బులానా పడేగా’ అని తలత్ మాకు చెప్పినట్లుగా ‘ముకేశ్జీకో బులానా పడేగా’ అని చౌఎన్‌లైకి చెప్పలేదేం? అనుకున్నాను.
చివరగా నాకు నచ్చిన కొన్ని తలత్ పాటల పల్లవులు రాస్తున్నాను. చివర్లో 10 పాటలున్న యూ ట్యూబు లింకు యిస్తున్నాను. వింటే తలత్ ఘనత ఏమిటో మీకు తెలుస్తుంది. 1. అష్కోం మేఁ జో పాయా హై (చాంద్ కీ దీవార్) 2. అంధే జహాఁ కే అంధే (పతితా) 3. జాయేతో జాయే కహాఁ (టాక్సీ డ్రైవర్) 4. ఐ మేరే దిల్ ఔర్ కహీఁ ఔర్ చల్ (దాగ్) 5. జిందగీ దేనేవాలే సున్ (దిల్ ఏ నాదాన్) 6. తస్వీర్ బనాతా హూఁ (బారాదరీ) 7. ఫిర్ వహీ శామ్ (జహానారా) 8. ఏ హవా ఏ రాత్ (సంగ్దిల్) 9. శామ్ ఏ గమ్ కి కసమ్ (ఫుట్‌పాత్) 10. రాత్ నే క్యాక్యా ఖ్వాబ్ (ఏక్ గావ్ కీ కహానీ) 11. హమ్ సే ఆయా న గయా (దేఖ్ కబీరా రోయా) 12. మాజన్దరాన్ మాజన్దరాన్ (రుస్తుం సొహ్రాబ్). డ్యూయట్లలో హుషారైనవి అంటూ పైన పేర్కొన్నవి కాక 1. గమ్‌కీ అంధేరీ రాత్ మేఁ (సుశీలా) 2. ప్యార్ పర్ బస్ తో నహీఁ హై (సోనే కీ చిడియా) 3. మిల్తే హై ఆంఖే దిల్ హువా (బాబుల్) 4. రాహీ మత్వాలే (వారిస్). శతజయంతి సందర్భంగా తలత్ గాత్రానికి జోహార్లు అర్పిస్తూ ..
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2024)