భౌగోళికంగా ఉత్తరాదిన హిమాలయాలను అధిరోహించడం ప్రతి పర్వతాధిరోహకుడికీ ఒక పెను సవాలే. రాజకీయాల్లో మాత్రం దక్షిణాదిన విజయం సాధించడం ఇతర ప్రాంతాల పార్టీలకు, పాలకులకు అంత సులభం. మధ్యయుగ కాలంలో మొఘల్ పాలకులు, బ్రిటీష్, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి తదితరులందరికీ కూడా దక్కన్ ప్రాంతం అంత సులభంగా చేజిక్కలేదు. వీరంతా దక్కన్ పై కూడా దండయాత్రలు చేశారు కాని ఈ ప్రాంతంలో ఎవరి సామ్రాజ్యం అంతగా స్థిరపడలేదు.
ప్రపంచమంతా ఏలిన బ్రిటిష్ వారు కూడా గంగా పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా విస్తరించగలిగారు. కాని సాత్పురా, వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న దట్టమైన అడవుల్లో వారు భీకర సవాళ్లను ఎదుర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం దేశమంతటా విస్తరించిన కాంగ్రెస్ హైదరాబాద్ స్టేట్ నుంచి తీవ్రమైన సవాలును ఎదుర్కొంది. మతతత్వవాదులనే కాదు, కమ్యూనిస్టులను ఢీకొనేందుకు కాంగ్రెస్ వారు నానా కష్టాలు పడ్డారు. అందుకోసం వారు రాష్ట్రాన్నే విడదీయాల్సి వచ్చింది.
తమిళనాడు, ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పలు పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కొని దక్షిణాదినే దెబ్బతినే పరిస్థితిని ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్ ను విభజించినా రెండు.. ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, వైసీపీ, తెలుగుదేశం ప్రాబల్యం మూలంగా కాంగ్రెస్ కు తెలుగు రాష్ట్రాల్లోనే మనుగడకు ప్రమాదం ఏర్పడింది. బిజెపి మితిమీరిన అవినీతి మూలంగా కర్ణాటకలో అధికారంలోకి రాగలిగిన కాంగ్రెస్.. కేసీఆర్ అతి ఆత్మవిశ్వాసం మూలంగా మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టింది. కాని కాంగ్రెస్ కు సవాళ్లు సమిసిపోలేదు.
భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ రాజకీయాల్లో కేంద్ర శక్తిగా మారినప్పటికీ దక్షిణాదిలో కర్ణాటక మినహా ఎక్కడా బలమైన పునాదిని నిర్మించుకోలేకపోయింది. తెలంగాణలో గతంలో కొంత ఓటు బ్యాంకు, నాయకత్వ శక్తి ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకు తన ప్రయోజనాలను కట్టబెట్టింది. మాజీ ప్రధాని పివి నరసింహా రావు ను ఓడించగల జంగారెడ్డి, టైగర్ నరేంద్ర, ఇంద్రసేనారెడ్డి, బద్ద బాల్ రెడ్డి వంటి నేతలు ఉన్నప్పటికీ వెంకయ్యనాయుడు వంటి ఆంధ్ర నేతల పుణ్యమా అని తెలంగాణలో బిజెపి నేతలు ఎదిగే అవకాశమే లేకుండా పోయింది. వాజపేయి, అడ్వాణీ కూడా చంద్రబాబునాయుడుతోనే స్నేహం చేశారు.
మోదీ హయాంలో తూర్పు, పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా ఈశాన్యంలో కూడా బిజెపి మోదీ హయాంలో విస్తరించింది. కాని దక్షిణాదిన మాత్రం మోదీ అంత చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయారు. మోదీ, అమిత్ షాలు రాక ముందే కర్ణాటకలో బిజెపి పాలన ఉండేది. మోదీకి కర్ణాటకలో గత లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు 26 సీట్లు కట్టబెట్టారు. ఇదంతా తమ గొప్పతనమే అని విర్రవీగి స్థానిక నాయకులను వారు విస్మరించి, తమ పెత్తనం చలాయించేసరికి అక్కడ బిజెపి అధికారం కోల్పోయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి గతంలో వచ్చినన్ని సీట్లు వచ్చే అవకాశం లేదని, కనీసం 10-15 సీట్లు తగ్గిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడులో బిజెపి దూకుడుగా వ్యవహరించి తనకు మద్దతుగా ఉన్న అన్నాడిఎంకేతో సంబంధాలు కోల్పోయింది. తమిళనాడు రాజకీయాలు కూడా బిజెపికి అంతగా తెలియవు. అక్కడ ఇవి రామస్వామి నాయకర్ పెరియార్, ద్రావిడ ఉద్యమం వ్రేళ్లూనుకుని ఉన్నది. సనాతన ఛాందసవాదాలపై అక్కడ ప్రజల్లో లోతుగా నిరసన వ్రేళ్లూనికుని ఉన్నది. తమిళ ఆధిపత్య భావం, ఉత్తరాది కంటే ఎంతో ముందు బలంగా నెలకొన్న కుల రాజకీయాలు ఉత్తరాది పార్టీలకు అక్కడ వ్యతిరేకంగా మారాయి. కాశీ తమిళ సంగమం, సెంగోల్ వంటి నాటకాలతో మోదీ తమిళ ప్రజలను రంజింపచేయడం అంత సులభం కాదు. తమిళనాడులో బిజెపికి 2 శాతం కంటే మించే అవకాశాలులేవు.
ఇక కేరళలో సమీప భవిష్యత్ లో బిజెపి ప్రవేశించడం సాధ్యం కాదు. ఈసారి కేంద్రమంత్రులను అక్కడి నుంచి రంగంలోకి దింపుతున్నా ఒక్క సీటు కూడా రావడం కష్టమని స్థానిక రాజకీయ పరిశీలకులు తెలిపారు. అక్కడ క్రైస్తవస, ముస్లిం వర్గాలను చీల్చి ప్రయోజనం పొందేందుకు బిజెపి గత ఎన్నికల్లో కొంత ప్రయత్నించింది. కాని ఈ రెండు వర్గాలు బిజెపిని మరింతచిత్తుగాఓడించేందుకు సిద్దంగా ఉన్నాయి.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో బిజెపి కొంత పుంజుకున్న మాట నిజమే. కేసిఆర్ విశృంఖల పాలనను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కు లేకపోవడం వల్లే బిజెపికి కొంత బలం ఏర్పడింది. జీహెచ్ ఎంసి ఎన్నికల్లో, ఒకటి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచింది. కాని తమకు తెలంగాణ పట్ల ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని మోదీ, అమిత్ షా నిరూపించుకున్నారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించి మెతక స్వభావుడైన కిషన్ రెడ్డిని పార్టీ అధినేతగా నియమించారు. బిజెపి బలహీనపడే సరికి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బలం పుంజుకుంది ఇప్పుడు లోక్ సభలో తెలంగాణలో బిజెపి మళ్లీ గతంలో గెలుచుకున్న 4 సీట్లైనా గెలుచుకుంటుందా లేదా అన్నది అనుమానమే.
విభజిత ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి అసలు ఓటు బ్యాంకే లేదు. కొంతకాలం చంద్రబాబునాయుడుపై ఆధారపడినప్పటికీ అతడు మామకు వెన్నుపోటు పొడిచినట్లే మోదీ కి కూడా వెన్నుపోటు పొడిచి ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. మోదీని అనరాని మాటలు అన్నారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో సగం రోజులు హైదరాబాద్ లోనే గడిపారు. కేసిఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించి భంగపాటుకు గురై కేసుల దెబ్బలకు దడిసి అమరావతి పారిపోయి వచ్చారు. గ్రాఫిక్స్ తో జనాన్ని అదరగొట్టారు. ఒకే వర్గానికి లాభాలు కట్టబెట్ట చూశారు. దీనితో ప్రజలు ఆయనను వదుల్చుకుని జగన్ ను భారీ మెజారిటీతో గెలిపించారు.
2019 ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు రాగా తెలుగుదేశంకు 40 శాతం ఓట్లు వచ్చాయి. జాతీయ పార్టీ అయిన బిజెపికి కేవలం 0.98 శాతం ఓట్లు లబించాయి. అయితే బిజెపి జాతీయస్థాయిలో అధికారంలోకి వచ్చినందువల్ల జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి అంత వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అదే సమయంలో మోదీ ప్రభుత్వం భజన కూడా చేయలేదు. బిజెపి రాజకీయాలను సమర్థించలేదు. చంద్రబాబులా అందితే జుట్టు, అందకపోతే కాళ్లు గా జగన్ ఏనాడూ వ్యవహరించలేదు.
విచిత్రమేమంటే ఒకసారి చంద్రబాబు చేతుల్లో భంగపాటుకు గురైన బిజెపి ఆయన కాళ్లా వేళ్లా పడే సరికి పొత్తుకు అంగీకరించింది. కాని తనకు బలం లేకున్నా ఆరు లోక్ సభ సీట్లను తెలుగుదేశం నుంచి లాక్కుంది. దీని వల్ల తనకు నష్టమని తెలిసినప్పటికీ తెలుగుదేశం చేసేది ఏమీ లేకుండా పోయింది.ఈ ఆరు సీట్లలో వైసీపీని ఢీకొనడం కష్టమని బిజెపికి కూడా తెలుసు.తన శక్తికి మించి సీట్లలో పోటీ చేస్తే ఓడే సీట్ల సంఖ్యే పెరుగుతుంది కాని తగ్గే అవకాశాలు లేవు.
విచిత్రమేమంటే ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పోరాడి తన స్వంత పార్టీని నెలకొల్పి ప్రజల ఆశీర్వాదాలు పొందారో, అదే కాంగ్రెస్ తో జగన్ చేతులు కలిపారని నరేంద్రమోదీ ఇటీవల ఏపీలో జరిగిన బహిరంగ సభలో విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జగన్ ను జైలుకు పంపించడమే కాకుండా ఆయన కుటుంబాన్ని చీల్చింది. ఏపీ ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ను ఆదరించినా, ఏపీలో చీకొట్టారు. అలాంటి కాంగ్రెస్ తో జగన్ చేతులు కలిపే అవకాశాలు ఎంతమాత్రమూ లేదు. అవసరమూ లేదు. కేంద్రంలో కాంగ్రెస్ సమీప భవిష్యత్తు లో అధికారంలోకి రాదని కూడా జగన్ కు తెలుసు.
దక్షిణాదిన సామాజిక పరిస్థితుల గురించి మాత్రమే కాదు, రాజకీయాల గురించి కూడా బిజెపికి అవగాహన లేదనడానికి మోదీ ప్రకటనే నిదర్శనం.