బాబోయ్‌… ఈ పంచ్‌ను త‌ట్టుకోడం ఎలా?

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే, ఏపీలో ఆ వాతావ‌ర‌ణం నెల‌కుంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన‌పై అధికార పార్టీ ఓ రేంజ్‌లో పంచ్‌లు…

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే, ఏపీలో ఆ వాతావ‌ర‌ణం నెల‌కుంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన‌పై అధికార పార్టీ ఓ రేంజ్‌లో పంచ్‌లు విసురుతోంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు ద‌త్త‌పుత్రుడ‌నే పేరు స్థిర‌ప‌డింది. ఆ మ‌చ్చ‌ను తుడిపేసుకోవ‌డం జ‌న‌సేన‌కు సాధ్యం కావ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌పై రాష్ట్ర ర‌హ‌దారులు, భ‌వ‌నాల‌శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఒకే ఒక్క పంచ్‌తో జ‌న‌సేన దిమ్మ‌తిరిగేలా చేశారు. అడ్వాన్స్ తీసుకుని అద్దెకిచ్చే పార్టీ జ‌న‌సేన అని ఆయ‌న దెప్పి పొడిచారు. 

చంద్ర‌బాబు హ‌యాంలో రైతులు క‌ష్టాల‌పాలైన‌ప్పుడు ఈ వీర‌మ‌ల్లులు, వీర‌విల్లులు ఏమ‌య్యార‌ని నిల‌దీశారు. నాడు టీడీపీ వ‌ద్ద తీసుకున్న ప్యాకేజీ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సి వ‌స్తుందేమోన‌న్న భ‌యంతో మాట్లాడ‌లేద‌ని అన్నారు.

పార్టీ పెట్టి త‌న‌ను న‌మ్ముకున్న వారిని అమ్ముకోడానికి 2014లో అనుస‌రించిన పంథానే 2024లో కూడా ప‌వ‌న్ అనుస‌రిస్తార‌ని దాడిశెట్టి రాజా విమ‌ర్శించారు. త‌న ఇంటి పేరుకు త‌గ్గ‌ట్టే జ‌న‌సేన‌పై మంత్రి రాజా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌ల దాడి చేశారు. 

ఏకంగా జ‌న‌సేనను అద్దె పార్టీగా చిత్రీక‌రించ‌డాన్ని ఆ పార్టీ శ్రేణులు త‌ట్టుకోలేక‌పోతున్నాయి. వైసీపీపై జ‌న‌సేన సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు ఎదురు దాడికి దిగాయి. అయితే జ‌న‌సేనాని రాజ‌కీయ పంథా పార్టీ శ్రేణుల్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తుంద‌న్న‌ది వాస్త‌వం. ఈ విమ‌ర్శ‌లను తిప్పికొట్టాలంటే జ‌న‌సేన స్వ‌తంత్ర‌గా పోటీ చేయ‌డం ఒక్క‌టే మార్గం.