మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. దశాబ్దకాలం నుంచీ వినిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవి విశాఖలో స్టూడియో నిర్మిస్తారని. ఆయనకు ఆ ఆసక్తి వుందని. కానీ ఇప్పుడు ఆయన ఖరాఖండీగా చెప్పేసారు. తనకు అలాంటి ఆసక్తి లేదు. తనది వ్యాపార మైండ్ సెట్ కాదు. స్టూడియోలు, థియేటర్లు నిర్మించడం, నిర్వహించడం తన వల్ల కాదు అని.
అంటే ఇన్నాళ్లుగా వినిపిస్తున్నవి గ్యాసిప్ లు అనుకోవాలి. లేదా లేటెస్ట్ గా మైండ్ సెట్ మార్చుకని మెగాస్టార్ ఇలా సమాధానం చెప్పి వుండాలి. ఒక్కసారి, రెండు సార్లు వినిపిస్తే గ్యాసిప్ అనే అనుకోవాలి. కానీ మెగాస్టార్ విశాఖ స్టూడియో అన్నది చిరకాలంగా వినిపిస్తోంది. స్టూడియోల మీద సినిమా జనాలకు ఆసక్తి వున్న రోజుల నుంచి వినిపిస్తోంది.
అప్పటికే అన్నపూర్ణ, రామకృష్ణ, పద్మాలయా వచ్చేసాయి. ఆ అడుగు జాడల్లోనే చిరు కూడా హైదరాబాద్ లో కాకుండా విశాఖలో స్టూడియో కడతారని వార్తలు వినిపించాయి.
విభజన నేపథ్యంలోనో, లేదా ఇరు వైపులా వున్న సంబంధ బాంధవ్యాల వల్లనో, అదీ కాక స్టూడియో నిర్వహణ కష్టసాధ్యం అనుకోవడం వల్లనో, అవన్నీ కాకపోతే తన సన్నిహితుడు అల్లు అరవింద్ స్వంతంగా స్టూడియో నిర్మాణానికి పూనుకోవడం వల్లనో మెగాస్టార్ మనసు మార్చుకుని వుండొచ్చు. దాన్ని ఇలా వ్యక్తపరచి వుండొచ్చు.
మొత్తానికి చిరంజీవి విశాఖలో స్టూడియో కట్టడం లేదు. ఇప్పటికే కట్టిన సురేష్ బాబు స్టూడియో మొదటి నుంచీ అంతంత మాత్రంగానే వుంటోంది. స్టూడియో కట్టడానికి స్థలం తీసుకున్నపుడు వున్న ఆసక్తి ఆ తరువాత తరువాత తగ్గినట్లు కనిపిస్తోంది. ఇంకెవరు ముందుకు వస్తారో? విశాఖలో ఇండస్ట్రీని అభివృద్ది చేయడానికి?