ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ఆసక్తిదాయకమైన ఫలితాలతో సాగుతూ ఉంది. సీజన్ సగం ముగిసే సరికే.. ప్లే ఆఫ్స్ విషయంలో కొన్ని జట్లు పూర్తిగా ఆశలు వదిలేసుకున్న స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రతియేటా ఐపీఎల్ విషయంలో హాట్ ఫేవరెట్లుగా నిలిచిన జట్లు టేబుల్ లో కింద పడిపోగా, సీజన్ ఆరంభంలో పోటీలో ఉండగలవా? అనే అనుమానాలు రేకెత్తించిన జట్లు టాప్ పొజిషన్లో ఉండటం విశేషం.
తొలి రెండు మ్యాచ్ లలో పేలవమైన రీతిలో ఓటమి పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత వరసగా ఐదు మ్యాచ్ లలో నెగ్గి ఇప్పుడు నంబర్ టూ పొజిషన్ లో ఉంది. ఆర్సీబీతో నిన్నటి మ్యాచ్ లో భారీ గెలుపు సన్ రైజర్స్ కు కొత్త ఊపును ఇచ్చింది. పది పాయింట్లతో అత్యంత మెరుగైన నెట్ రన్ రేట్ తో ఉంది.
ఇక ఆరంగేట్రంతోనే తొలి స్థానంలో కొనసాగుతూ ఉంది గుజరాత్ జట్టు. ఏడు మ్యాచ్ లలో ఆరు విజయాలతో ఈ జట్లు తొలి స్థానంలో ఉంది. ఏడు మ్యాచ్ లలో ఐదు విజయాలతో రాజస్తాన్ జట్టు మూడో స్థానంలో, ఎనిమిది మ్యాచ్ లలో ఐదు విజయాలతో ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉంది.
లక్నో జట్టు ఏడు మ్యాచ్ లలో నాలుగు విజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను కలిగి ఉంది. ఇక ఈ సీజన్ కు ఆశ్చర్యకరమైన పరిణామాల్లో ముంబై జట్టు వైఫల్యం హైలెట్ అవుతూ ఉంది. వరసగా ఏడు మ్యాచ్ లలోనూ ఓటమి పాలై ముంబై జట్టు అత్యంత పేలవమైన స్థితిలో నిలుస్తోంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానం సంగతలా ఉంచితే, ఐపీఎల్ చరిత్రలోనే ఇలాంటి అరుదైన పరాజయాల పరంపర ఉంది. ఐపీఎల్ తొలి సీజన్లో డెక్కన్ చార్జర్స్ వంటి ఫెయిల్యూర్ ను గుర్తు చేస్తూ ఉంది ముంబై జట్టు.
ఇక చెన్నై జట్టు పరిస్థితి అంతకంటే కాస్త మెరుగ్గా ఉంది. ఏడు మ్యాచ్ లలో రెండు విజయాలతో ఆ జట్టు చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబై, చెన్నై జట్లు చివరి రెండు స్థానాల్లో ఉండటం ఈ సారికి ఆసక్తిదాయకమైన అంశం. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ పోటీలో కూడా ముంబై, చెన్నై జట్లు లేనట్టేనేమో! మరీ అద్భుతాలు చేయగలిగితే చెన్నైకి కాస్త ఛాన్సులున్నట్టు!