పాపం.. దత్తపుత్రుడికి బాగా కాలినట్టుందే..!

పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ బాగానే జరుగుతుంటాయి. ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు దత్తపుత్రుడని, పావలా అని.. రకరకాలుగా ట్రోలింగ్స్ ఉంటాయి. ఆమాటకొస్తే సోషల్ మీడియా బారిన పడని రాజకీయ నాయకుడెవరూ…

పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ బాగానే జరుగుతుంటాయి. ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు దత్తపుత్రుడని, పావలా అని.. రకరకాలుగా ట్రోలింగ్స్ ఉంటాయి. ఆమాటకొస్తే సోషల్ మీడియా బారిన పడని రాజకీయ నాయకుడెవరూ లేరు, కానీ పవన్ కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని తమకి పోటీగా చెప్పుకోడానికి వైసీపీ నేతలు ఇష్టపడరు. కానీ వారు పవన్ ని విమర్శించకుండా ఉండలేరు. అందుకే చంద్రబాబుతో కలిపి పవన్ ని టార్గెట్ చేస్తుంటారు.

పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించిన వైసీపీ నేతలెవరైనా ఆయన్ను చంద్రబాబు దత్తపుత్రుడిగానే పేర్కొంటున్నారు. ఇటీవల బాబు వన్ సైడ్ లవ్ డైలాగ్, పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చను అన్న డైలాగులు బయటకొచ్చాక ఈ దాడి మరింతగా పెరిగింది. దీంతో పవన్ కి కూడా బాగా కాలుతున్నట్టుంది.

జనసేనాని, జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్… ఇలా పిలిపించుకోవడం పవన్ కి ఇష్టం. అప్పుడప్పుడూ బహిరంగ సభల్లో, ర్యాలీల్లో సీఎం పవన్, సీఎం పవన్ అనే కామెంట్ వినసొంపుగానే ఉన్నా.. పవన్ వాటిని ఇష్టం లేనట్టు నటిస్తూ తిరస్కరిస్తుంటారు. కానీ వైసీపీ వాళ్లు నేరుగా ఆయన్ని దత్తపుత్రుడు అనేస్తున్నారు. చంద్రబాబు సొంత పుత్రుడు లోకేష్ ని కూడా పెద్దగా పట్టించుకోరు కానీ, దత్తపుత్రుడు అనే పేరు మాత్రం వాడకుండా ఉండట్లేదు. దీంతో పవన్ కి ఎక్కడలేని చిరాకొచ్చేసింది.

ఇటీవల ఆ ఫ్రస్టేషన్ బాగా పెరిగిపోయింది. అందుకే తన పర్యటనల్లో అదే పనిగా దత్తపుత్రుడు అనే పదాన్ని కోట్ చేస్తున్నారు పవన్. తనను అలా పిలవొద్దు, పిలవొద్దు అని మొత్తుకుంటున్నారు. అలా పిలిస్తే నేను జగన్ ని సీబీఐ దత్తపుత్రుడు అని పిలవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల అనంతపురం పర్యటనలో రెండు చోట్ల ఆయన ఇదే డైలాగ్ కొట్టారు. తాజాగా ఏలూరు జిల్లా రైతుల పరామర్శ యాత్రలో కూడా దత్తపుత్రుడి పాఠాన్ని మరోసారి ఏకరువు పెట్టారు.

గతంలో పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు వచ్చినప్పుడు కూడా ఆయన లైట్ తీసుకున్నారు. కుటుంబ వ్యవహారాలు మాట్లాడినప్పుడు కూడా ఇంతగా రియాక్డ్ కాలేదు. కానీ ఇప్పుడు పదే పదే చంద్రబాబుకి దత్త పుత్రుడు అంటుండే సరికి పవన్ అహం ఎక్కడో దెబ్బతింటోంది. 

జనసేన వంటి పార్టీకి అధినేతగా ఉన్నా కూడా వైసీపీ వాళ్లు తనను గుర్తించడంలేదని, టీడీపీ తోక పార్టీగానే పరిగణిస్తున్నారనేది పవన్ బాధ. అందుకే తనను దత్తపుత్రుడు అంటే మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని చిన్న పిల్లల్లాగా హెచ్చరిస్తున్నారు. చిన్నప్పుడు నిక్ నేమ్స్ పెట్టినప్పుడు స్కూల్ పిల్లలు ఉడుక్కుంటున్నట్టు పవన్ ఇప్పుడు తెగ ఇదైపోతున్నారు.