ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను జనసేనాని పవన్‌కల్యాణ్ దేబిరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ తన అజ్ఞానాన్ని, అపరిపక్వతను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనను సీఎం దత్తపుత్రుడిగా పిలవడాన్ని పవన్‌కల్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తనను అలా పిలవొద్దని ప్రత్యర్థి పార్టీ అధినేతను కోరడం ఒక్క పవన్‌కల్యాణ్‌కే సాధ్యం. దత్తపు త్రుడని పిలిస్తే, తాను మరో రకంగా అనాల్సి వస్తుందని చిన్నపిల్లల్లా చెప్పడం పవన్ రాజకీయ అజ్ఞానాన్ని చాటి చెబుతోంది.
కైలురైతు భరోసా యాత్రను జనసేనాని పవన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడ్డ ఒక్కో కౌలురైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తూ, స్వయంగా ఓదార్పు ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. మొదట అనంతపురం జిల్లా నుంచి భరోసా యాత్ర మొదలు పెట్టారు. మొన్న అనంతపురం, నిన్న ఏలూరు జిల్లా పర్యటనలో పవన్ వేడుకోలు నవ్వు తెప్పిస్తోందని పలువురి అభిప్రాయం.
” రైతు సమస్యల్ని ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని దత్తపుత్రుడు అంటున్నాడు. ఎవరెన్నిసార్లు అలా మాట్లాడినా మర్యాదగా మాట్లాడాను. ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అంటే మాత్రమే ఊరుకునేది లేదు. ఇలాగే కొనసాగితే సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది. నాకంటూ సొంతవాళ్లుండగా దత్తపుత్రుడిగా వెళ్లాల్సిన అవసరం లేదు. అయినా నన్ను దత్తపుత్రుడిగా భరించడం ఎవరివల్లా కాదు” అని అన్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులను ప్రజల్లో పలుచన చేసే ఎత్తుగడలో భాగంగా సెటైర్స్ విసురుతుంటారు. అందులో భాగంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే పవన్‌కల్యాణ్‌ను దత్తపుత్రుడిగా జగన్ వ్యూహాత్మకంగా అభివర్ణించారు. ఇది జనాల్లోకి బాగా వెళ్లింది. టీడీపీపై మాట మాత్రం కూడా పవన్ విమర్శలు చేయకపోవడంతో దత్తపుత్రుడిగా నమ్మే పరిస్థితి. ఆ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా నడుచుకోవాల్సిన పవన్‌కల్యాణ్, ఆ పని చేయకుండా తనను అలా పిలవొద్దని జగన్‌ను దేబిరించడం ఆయన అజ్ఞానాన్ని చాటుతోంది.
నువ్వు అట్లా అంటే, నేను కూడా ఇట్లా విమర్శిస్తా అని పవన్ మాట్లాడ్డం చిన్నపిల్లల చేష్టల్ని మరిపిస్తోంది.