చంద్రబాబు.. ‘అతి’లో అత్యుత్తముడు!

రాజకీయం, సినిమా రెండు రంగాలకూ ఒక సారూప్యత ఉంటుంది. ఉన్నదానికంటె కాస్త హైప్ క్రియేట్ చేసి చెప్పుకుంటూ ఉంటారు. దానినే మనలాంటి మామూలు పామర జనభాషలో ‘అతి’ అంటూ ఉంటాం. ఉన్నదానికి చిలవలు పలవలు…

రాజకీయం, సినిమా రెండు రంగాలకూ ఒక సారూప్యత ఉంటుంది. ఉన్నదానికంటె కాస్త హైప్ క్రియేట్ చేసి చెప్పుకుంటూ ఉంటారు. దానినే మనలాంటి మామూలు పామర జనభాషలో ‘అతి’ అంటూ ఉంటాం. ఉన్నదానికి చిలవలు పలవలు జతచేసి చెబుతూ ఉంటారు. ఇతరత్రా మామూలు భాషలో దానిని డబ్బా కొట్టుకోవడం అని కూడా అనొచ్చు. ఆ విద్యలో చంద్రబాబునాయుడు ఘనాపాటి. ఆయన ముందు వేరెవ్వరూ సాటి రారు!

‘బొంకరా బొంకరా పోలిగా అంటే వెనకటికి ఓ ప్రబుద్ధుడు టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ అన్నాట్ట. చంద్రబాబు సదరు బొంకుల పోలిగాడికి ఏమాత్రం తీసిపోరు. చీమంత చేస్తే చాటంత చెప్పుకోవడం ఆయన నైజం. ఆయన మాటలు ఏవి గమనించినా ఏవగింపు పుడుతుంది. అలాంటి వ్యవహార సరళి మీదనే గ్రేట్ ఆంధ్ర‌ ప్రత్యేక కథనం ఇది. 

అబద్ధం చెప్పినా అతికేలా చెప్పాలంటారు పెద్దలు. అబద్ధం మాత్రమే కాదు.. అతిశయం జోడించినా అతికేలా జోడించాలి. కానీ తొలినుంచి చంద్రబాబునాయుడు స్టయిలే వేరు. వైస్రాయి హోటల్లో పట్టుమని పదిమంది కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేకపోయినా వందమందికి పైగా అప్పటికే అక్కడ తన జట్టులోకి చేరిపోయినట్లుగా డప్పు కొట్టించి.. ఎన్టీరామారావును వంచించిన ఘనత ఆయనది. ఆ అతిశయాల పునాదుల మీద అందలం ఎక్కిన చంద్రబాబునాయుడు.. అడుగడుగునా అలాంటి అతకని అతి మాటలనే తన బతుకు తెరువుగా మార్చుకుని నలభై నాలుగేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేశారు. 

చంద్రబాబు అతి డైలాగులు..- ఒక మానసిక విశ్లేషణ 

చంద్రబాబు లోని ఇలాంటి అతిశయాల జాడ్యం అహంకారానికి నిదర్శనం. తాను మహానుభావుడిని అని.. తాను ఏం చెప్పినా ఎదుటివారు నమ్మి తీరుతారనే మితిమీరిన అహంకారపు ఆనవాళ్లే ఏ వ్యక్తినైనా ఈ రీతిగా మాట్లాడిస్తాయి. తెలుగు ప్రజలంటే చంద్రబాబుకు అపరిమితమైన చులకన భావం. ఆ చులకన భావంలోంచే ఇలాంటి అహంకారం పుడుతుంది. తెలుగు ప్రజలందరూ వెర్రి వెంగళప్పలని, తాను ఏం చెప్పినా నమ్ముతారని, నమ్మడం తప్ప వారికి వేరే గతి లేదు అనేది చంద్రబాబునాయుడు ఉద్దేశం. అందుకే ఆయన ఇలాంటి అతిశయపు అబద్ధాలను ఎడాపెడా వండి వార్చేస్తుంటారు. ప్రజలని మూర్ఖుల కింద జమకట్టి ఆయన బొంకుతూ పోతుంటారు గానీ.. ప్రజలు ఆయనకంటె తెలివైనవారనే సంగతిని ఆయన గుర్తించలేరు. ఆయన చుట్టూ ఉండే వందిమాగధులు ఆయన దృష్టికి వాస్తవాల్ని వెళ్లనివ్వరు. 

చంద్రబాబునాయుడు ఇలాంటి అతి డైలాగులు వేసినప్పుడెల్లా.. జనం నవరంధ్రాలతో నవ్వుకుంటూ ఉంటారు. ఆయన తీరును ఈసడిస్తూ ఉంటారు. జనాన్ని బురిడీ కొట్టించి పబ్బం గడుపుకోవాలని, ఓట్లు దండుకోవాలని చూసే చంద్రబాబు మాటలు ఎలా ఉంటాయంటే.. చెక్కతుపాకీ చేతపట్టుకుని భిక్షమెత్తుకోడానికి పల్లెల్లో తిరుగుతూ ఉండే  పిట్టల దొర జ్ఞప్తికి వస్తాడు. 

పిట్టల దొరను మించిన మానసిక వైకల్యానికి, నిత్య అహంకారానికి నిదర్శనమైన చంద్రబాబు మాటలు ఎలా ఉంటాయో గమనించండి. 

ఒకరి మానసిక స్థితిని బేరీజు వేయడానికి మొట్టమొదటి సాధనం అతనేం మాట్లాడుతున్నాడో వినడం. మాట్లాడే విషయాన్ని బట్టి, విధానాన్ని బట్టి సదరు వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడా, భ్రమల్లో బతుకుతున్నాడా, మానసిక వైకల్యం వస్తోందా మొదలైన విషయాల్ని సూచనగా పసిగట్టొచ్చు. 

ఉపోద్ఘాతం లేకుండా నేరుగా మ్యాటర్లోకి వచ్చేద్దాం. 

ముందుగా, వివిధ సందర్భాల్లో మైకుల ముందు మోగిన ఈ అమూల్యమైన కొటేషన్స్ చదవండి. బ్రాకెట్లో ఆ కొటేషన్ చదవగానే అనిపించే వాక్యం మీద కూడా ఒక లుక్కేయండి. 

* “అబ్దుల్ కలాం ని ప్రెసిడెంటుని చేసింది నేనే” –చంద్రబాబు

(మరి కొడుకుని ఎమ్మెల్యే ఎందుకు చేయలేకపోయారో!)

* “తెలంగాణాలో స్కూల్స్ పెట్టి చదువుకి శ్రీకారం చుట్టింది నేనే”- చంద్రబాబు

(ఓహో..ఆ తర్వాతే నిజాం కాలం నాటి ఒస్మానియా యూనివర్సిటీ వచ్చుంటుంది) 

* “ప్రపంచంలో ఇంఫర్మేషన్ టెక్నాలజీని మొదట ప్రొమోట్ చేసింది నేనే” – చంద్రబాబు

(అంతే అంతే..అలాగే కానీ) 

* “మీరు వాడే సెల్ ఫోన్ కి శ్రీకారం చుట్టింది నేనే” – చంద్రబాబు 

(ఊరుకోండి సార్! మరీ ఇంత హంబులా! గ్రహం బెల్ కి ఫోన్ కనిపెట్టే ఫార్ములా ఇచ్చింది మీరే కదా! పర్లేదు చెప్పేయండి)

* “1984 నుంచై ఈ దేశంలో ఐ.టి కి మారుపేరు నేనే” – చంద్రబాబు

(ఐ.టి అంటే “ఇన్సేన్ టాక్” అనే కదా?!)

* “ఒలింపిక్స్ లో మన రాష్ట్రంలోని పిల్లలు మెడల్ గెలుచుకొస్తే నేను నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తానని ఎనౌన్స్ చేసాను”- చంద్రబాబు

(మరీ చిన్నది సార్. అమెరికా అధ్యక్ష పదవి ఎనౌన్స్ చేయకపోయారా?)

* “ప్రధాన మంత్రి వాజపేయ్ నాకోసం వెయిట్ చేసారు” – చంద్రబాబు

(దేనికి? ఆయన కవిత్వం వినిపించి మీ పయిత్యం తగ్గించడానికా?!)

* “రాజశేఖరరెడ్డి నేనంటే భయపడేవాడు. గట్టిగా లేచి మాట్లాడితే తగ్గిపోయి కూర్చునేవాడు”- చంద్రబాబు

(ఉఫ్. మరీ అంతలా కనిపిస్తున్నామా? కొంచెం కూడా మామూలుగా కనిపించట్లేదా?)

* “నన్ను చూసి శంకర్ తమిళంలో “ఒకే ఒక్కడు” సినిమా తీసి తెలుగులోకి డబ్బింగ్ చేసాడు”- చంద్రబాబు 

(అవునా సార్! అన్నట్టు డ్రాయరుతో రోడ్డు మీద పరుగెట్టే సీనొకటి ఉందందులో. అదెప్పుడు చూసారాయన?) 

* “రాయలసీమలో వరన్నం తినడం మొదలు పెట్టింది మా నాన్న దయవల్లే” – లోకేష్ బాబు 

(ఏడుకొండలవాడా! వేంకటరమణా!!) 

* “పిడుగుపడటానికి 45 నిమిషాల ముందు మనకు తెలియజెప్పే టెక్నాలజీని మన ముందుంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు”- ఒక తెలుగుదేశం అభిమాని

(ఈ సారి పిడుగు పడేటప్పుడు చెప్పండి సర్. మీ కోటేషన్స్ వినడం కంటే దాని కింద నిలబడడం బెటర్)

అతిశయోక్తులు చెప్పే పిట్టలదొరల గురించి విన్నాం, తరచూ ట్రోలింగ్ కి గురయ్యే నమ్మశక్యంగా లేని కె.ఎ. పాల్ మాటలు విన్నాం…కానీ పై కొటేషన్స్ కి పోటీ రాగలిగే వాళ్లు ఎవరైనా ఉంటారా? 

అబద్ధం చెప్పేటప్పుడు అతకాలంటారు. కానీ అటువంటి అతుకులు బొతుకులు ఏవీ లేకుండా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్ధాలాడేయడమే.

చూస్తుంటే “చంద్రమండలానికి వెళ్లమని ఆర్మ్ స్ట్రాంగ్ కి సలహా ఇచ్చింది నేనే”, “బ్రిటీషు వాళ్లని దేశం విడిచి పొమ్మని ఆ క్రెడిట్ ని గాంధీ అకౌంట్లో వేసింది నేనే” అని కూడా చెప్పేయగలరేమో. 

“యథా పితా తథా పుత్రా” అన్నట్టుగా, తండ్రిగారి వెర్రి పుత్రరత్నానికి కూడా పాకేసింది. 

“మా తాత దేవుడు. మా నాన్న రాముడు. నేను మూర్ఖుడిని..” అని గొంతు చించుకుని తన మామ రేంజులో డైలాగొదిలాడు. 

అసలది రాసిచ్చిందెవడో ఏంటో! 

శంషాబాద్ ఎయిర్పోర్టు కట్టాను, హై టెక్ సిటీ నేనే కట్టాను అని చంద్రబాబు చెప్పేవి అబద్ధాలని ఆధారాలతో చూపించినా నమ్మని చం.బా.నా అభిమానులు పైన కొట్టిన కొటేషన్లని నమ్మగలరా? 

అసలీ మాటలన్నీ పడిపోయిన తెదేపాని పైకి లేపుతాయనుకుంటున్నారా? జనం నవ్వుకుంటున్నారని తెలియట్లేదా? ఏది చెప్పినా జనం నమ్ముతారనే ఒక భ్రమలో జీవిస్తున్నారా? 

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నిస్సందేహంగా “ఔను”. 

అసలేమాత్రం ఆత్మపరిశీలనకి తావు లేకుండా నోటికొచ్చినట్టు డబ్బా కొట్టుకుంటూ పోవడమే చంద్రబాబు పనౌతోంది. దాంతో ఆయన “పని” అయిపోతోంది. అది తెలుసుకోవట్లేదు, తెలుసుకోరు కూడా. ఎందుకంటే మానసికంగా మన లోకంలో ఆయనా, ఆయన కుమారుడు లేరు. 

అతిశయాలు ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ఎవరినైనా మోసం చేయగలవు. నిజానికి చంద్రబాబు అతిశయాలు.. ఆయన ముఖ్యమంత్రి కాలేనందుకు ఎక్కడెక్కడి ఆడవాళ్లంతా ఆయన వద్దకు వచ్చి.. బోరుమని ఏడిచే సన్నివేశాలూ.. ఈ నాటకాలన్నీ చూసి చూసి తెలుగు ప్రజలు చిరాకెత్తిపోయారు. ఆయన అబద్ధాలను అసహ్యించుకున్నారు గనుకనే.. అధికారం మీద ఇప్పట్లో ఆశ పుట్టే అవకాశం కూడా లేనంత దారుణమైన పరాజయాన్ని 2019లో అందించారు. ఆ వాస్తవాన్ని తెలుసుకోకుండా చంద్రబాబు అనేకానేక కొత్త డ్రామాలు కూడా ప్రారంభించారు. 

తనను పట్టుకుని భోరుమని ఏడిచే ఆడవాళ్ల నాటకాలు, తన భార్యను ఏదో అనేశారని తానే భోరుమని ఏడ్చే నాటకాలూ.. ఇలా అనేకానేక అతిశయం అనే పదానికి మించిన వెర్రిమొర్రి నాటకాలను ఆయన మూడేళ్లుగా నడిపిస్తున్నారు. ఇలాంటి పగటి వేషాల పట్ల తెలుగు ప్రజల అసహ్యం మరెంత భారీ స్థాయిలో ఉంటుందో.. స్థానిక ఎన్నికల్లో చాలా బాగానే బయటపడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత స్పష్టంగా అది వెల్లడవుతుంది. 

అమంగళం అప్రతిహతమగుగాక!

– హరగోపాల్ సూరపనేని