జనసేన పొత్తులతో పోటీకి దిగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ పార్టీకి ఇస్తున్న సీట్లు అన్నీ టీడీపీకి బలమైనవి కావడం విశేషం. ఈ సీట్లను జనసేన అడగడం టీడీపీ ఇవ్వడం బాగానే ఉంది కానీ ఈ సీట్లలో పోటీ చేసే అభ్యర్ధులను జనసేన ఎంపిక చేసుకున్న తీరుతోనే సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
పార్టీ జెండా మోయకుండానే ఈ మూడు కీలక నియోజకవర్గాలలో సీట్లు దక్కించుకోవడం పట్ల జనసేనలో ఆశావహులు మండిపడుతున్నారు. వీరంతా ఇటీవల కాలంలో జనసేనలో చేరి ఎమ్మెల్యే అభ్యర్ధులుగా పోటీకి సిద్ధమవుతున్నారు.
మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అనకాపల్లి సీటుని లాస్ట్ మినిట్ లో వచ్చి పట్టుకుపోయారు అన్న బాధ అక్కడ టీడీపీ జనసేనలలో ఉంది. ఈ సీటు టీడీపీకి ఇచ్చి ఉంటే కచ్చితంగా గెలిచేదని అంటున్నారు. ఇపుడు పొత్తులో కొణతాలకు ఇచ్చారు. ఆయన అందరినీ కో ఆర్డినేట్ చేసుకుని ముందుకు పోవాల్సి ఉంది.
అనకాపల్లి సీటు కొణతాలకు ఇవ్వడం పట్ల జనసేన టీడీపీలో అగ్గి రాజుకుంది. అది ఇంకా చల్లారలేదు. జనసేన కోసం కోట్లు ఖర్చు పెట్టి కాలం వెచ్చించిన కీలక నేత పరుచూరి భాస్కరరావు రాజకీయాలకే దండం అని తప్పుకున్నారు. మిగిలిన వారి తీరు కూడా అలాగే ఉంది అంటున్నారు.
పెందుర్తి సీటుని పార్టీలు మారి వచ్చిన పంచకర్ల రమేష్ బాబుకు ఇచ్చారు. పక్కా లోకల్ అయిన మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి ఈ విధంగా తీరని అన్యాయం చేశారు అని అంటున్నారు. ఇక్కడ కూడా రెండు పార్టీలలో అసమ్మతి రాజుకుంది.
విశాఖ సౌత్ లో అదే సన్నివేశం కనిపిస్తోంది. ఈ సీటుని జనసేన నేతలు ఆశించారు. టీడీపీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మూడేళ్ళుగా కష్టపడి పనిచేస్తూ వచ్చారు. జనసేనకు ఇవ్వడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వంశీ క్రిష్ణ నిన్నటిదాకా వైసీపీలో ఉండి అధికారం అనుభవించి వచ్చారని ఆయనకు సీటు ఇస్తే ఎలా అని జనసేన నేతలు అంటున్నారు. ఆయనను నాన్ లోకల్ గా పేర్కొంటున్నారు. ఇక్కడ రచ్చ సాగుతోంది.
ఈ మూడు సీట్లూ విపక్షానికి గెలుపునకు అవకాశం ఉన్నవే. కానీ ఈ రకంగా వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని దిగుమతి చేసుకుని ఇవ్వడం వల్ల జనసేనకే కాకుండా కూటమికే ఇబ్బందిగా మారాయని అంటున్నారు.