శుద్ధ‌పూస‌లెవ‌రో చెప్పండ‌బ్బా!

రాష్ట్రంలో అవినీతి మ‌చ్చ‌లేని శుద్ధ‌పూస‌లెవ‌రో చెప్పాల‌ని రాష్ట్ర రెవెన్యూసంఘం అధ్య‌క్షుడు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ చేశారు. ఇటీవ‌ల రెవెన్యూశాఖ‌లో అవినీతిపై ప్ర‌భుత్వ పెద్ద‌లే విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో బొప్ప‌రాజు అభిప్రాయాలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అవినీతి…

రాష్ట్రంలో అవినీతి మ‌చ్చ‌లేని శుద్ధ‌పూస‌లెవ‌రో చెప్పాల‌ని రాష్ట్ర రెవెన్యూసంఘం అధ్య‌క్షుడు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ చేశారు. ఇటీవ‌ల రెవెన్యూశాఖ‌లో అవినీతిపై ప్ర‌భుత్వ పెద్ద‌లే విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో బొప్ప‌రాజు అభిప్రాయాలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అవినీతి అంటే రెవెన్యూ, పోలీసుశాఖ‌ల‌పై అంద‌రి చూపుడు వేళ్లు వెళ్తాయి. 

ఇటీవ‌ల రెవెన్యూశాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకున్న సంద‌ర్భంగా మాట్లాడుతూ రెవెన్యూశాఖ‌లో అవినీతి పెరిగింద‌న్నారు. దాన్ని త‌గ్గించేందుకు కృషి చేస్తాన‌న్నారు. త‌మ‌ను అవినీతిప‌రులుగా మంత్రి వ్యాఖ్యానించ‌డంపై సంబంధిత రాష్ట్ర‌శాఖ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

అలాగే రాష్ట్రంలో అవినీతిని పార‌దోలేందుకు ప్ర‌తి మండ‌లంలో ఒక ఏసీబీ స్టేష‌న్ పెట్టాల‌ని సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ శాఖ‌ల్లో అవినీతిపై నిఘా పెంచాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఏసీబీకి ప‌ట్టుబ‌డిన అధికారుల‌కు వేగంగా శిక్షలు పడితేనే వ్యవస్థలో మార్పు వస్తుందని సీఎం ఆకాంక్షించారు.

ఈ నేప‌థ్యంలో ఒంగోలులో శ‌నివారం బొప్ప‌రాజు మీడియాతో మాట్లాడుతూ అవినీతిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవినీతి ఏ వ్య‌వ‌స్థ‌లో లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండా రెవెన్యూశాఖ‌లో అవినీతి పెరుగుతోంద‌ని విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించేందుకు సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండా శుద్ధంగా ప‌ని చేయాలంటే ఎలా అని నిల‌దీశారు. రెవెన్యూ ఉద్యోగుల్ని దోషులుగా చిత్రీక‌రించ‌డం స‌బ‌బు కాద‌ని ఆయ‌న అన్నారు.