ఏపీ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యవహారశైలిపై తెలంగాణ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. తాము చేయాల్సిన పనిలో అనవసరంగా జీవీఎల్ తలదూర్చారనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతోంది.
తెలంగాణ అధికార పార్టీకి మద్దతుగా నిలిచే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
తెలంగాణకు చెందిన పత్రికలపై ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు బదులు జీవీఎల్ ప్రివిలేజ్ నోటీసు ఇవ్వడం ఏంటనే ప్రశ్న తలెత్తింది. జీవీఎల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీపై తప్పుడు వార్తలు ప్రచురించారని, అందుకే ప్రివిలేజ్ నోటీసు ఇచ్చానన్నారు. మంత్రి కేటీఆర్ హద్దుమీరి ప్రధానిపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
తమ పార్టీ అంటే భయంతోనే కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. ఇదిలా వుండగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రధాని గౌరవాన్ని కించపరిచేవిగా ఆ రాష్ట్ర నాయకులకు అనిపించలేదా? అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తమను ఇబ్బంది పెట్టడానికి ఏపీ బీజేపీ నాయకులు కూడా రంగంలోకి దిగారా? అని ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు తెలంగాణ ఇష్యూలో ఏపీ బీజేపీ సీనియర్ నేత తలదూర్చడాన్ని ఆ రాష్ట్ర బీజేపీ ఇబ్బందిగా భావిస్తోంది. ఎవరి రాష్ట్రాల్లో వాళ్లు పని చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు.