అభ్యంతరకర తంబ్లైన్స్ పెట్టొద్దని సీనియర్ నటి జీవితా రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. తమకు జీవితా రాజశేఖర్ దంపతులు రూ.26 కోట్లు ఎగ్గొట్టారని, త్వరలో వారు జైలుకు వెళ్తారని జోస్టర్ ఫిలిం ఫౌండర్ కోటేశ్వరరాజు, ఆయన భార్య, సంస్థ ఎండీ హేమ హెచ్చరించిన నేపథ్యంలో జీవిత శనివారం మీడియాతో మాట్లాడారు. తమపై ఆరోపణలు అన్యాయమన్నారు. తమపై ఆరోపణలు చేసిన వాళ్ల చరిత్ర ఏంటో చూడాలన్నారు.
26 కోట్లు ఎగ్గొట్టామని ఆరోపిస్తున్నారని, మరి కోట్లు అంటే వేసుకునేవేమో అని జీవిత వెటకరించారు. నిజానిజాలేంటో కోర్టులోనే తేలుతాయని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మీడియాలో సినీ నటులపై పెడుతున్న తంబ్లైన్స్పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన కూతుళ్లపై పెట్టిన తంబ్లైన్స్ తీవ్రంగా బాధించాయన్నారు. వాటిని చూసి ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. మరికొందరు తన కూతుళ్ల యోగక్షేమాలు ఆరా తీశారన్నారు.
తన కూతుళ్లకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. అవకాశం రావడంతో నటిస్తున్నారన్నారు. కానీ మీడియాలో ఇబ్బందికర తంబ్లైన్స్ పెట్టడం వల్ల చాలా బాధ కలిగిస్తోందన్నారు. తన కూతుళ్లు కూడా మంచి ఇళ్లకు కోడళ్లుగా వెళ్లాల్సి వుంటుందని గుర్తు చేశారు. అలాగే ఇటీవల నిహారిక గురించి కూడా ఇలాగే తంబ్లైన్స్ పెట్టారన్నారు.
నిహారిక పబ్‌కు వెళ్లిన విషయం వాస్తవమే అని, అయితే అక్కడేం జరిగిందో ఎవరికీ తెలియదన్నారు. ఏమీ తెలియనప్పుడు డ్యామేజీ కలిగించే హెడ్డింగ్స్ పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. చాలా మంది చదువుకోని వాళ్లు తంబ్లైన్స్ చూసి అదే నిజమని నమ్మే ప్రమాదం ఉందన్నారు. కావున దయచేసి తంబ్లైన్స్ పెట్టేటప్పుడు కాస్త ఆలోచించాలని జీవితా రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. మోహన్‌బాబు కుటుంబంపై కూడా ఇటీవల ట్రోలింగ్ జరిగిందని, ఇది బాధించిందన్నారు.
“మా” ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు పోటీ చేశాయన్నారు. ప్రకాశ్‌రాజ్‌ను చాలా మంది సపోర్ట్ చేశారన్నారు. కానీ తననే హైలెట్ చేశారన్నారు. ఒక ఆడపిల్లగా ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎందుకనో వేరేలా చూపిస్తున్నారన్నారు. కొన్ని విషయాల్లో తాను కంట్రోల్ చేసుకుంటున్నా, రాజశేఖర్ మాత్రం అమాయకంగా మాట్లాడుతున్నారని తెలిపారు.